
వెలుగుల్లేని ఉద్యోగుల దీపావళి కానుక
నవంబరు జీతంతో కలిపి డీఏని చెల్లిస్తామని, రిటైర్మెంట్ అయ్యాకే అరియర్స్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వెల్లడించిన డీఏ ప్రకటన ఉద్యోగులలో వివాదాస్పదంగా మారింది. సీఎం చంద్రబాబు వెల్లడించిన దానికి, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు సంబంధం లేక పోవడంతో ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. వెలుగుల్లేని దీపావళి కానుకను కూటమి ప్రభుత్వం అందజేసిందని మండిపడుతున్నాయి. డీఏకి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం ప్రభుత్వం జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం, 2024 జనవరి 1 నుంచి 3.64% డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, అరియర్స్ రిటైర్మెంట్ తర్వాత మాత్రమే చెల్లిస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ పేరుతో ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీఏ అరియర్స్ చెల్లింపులకు సంబంధించి ఇలా ప్రకటించడం చరిత్రలో మొదటిసారి అని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధాన వివరాలు:
- డీఏ పెంపు:
- పాత డీఏ: 33.67% (బేసిక్ పేలో).
- కొత్త డీఏ: 37.31% (3.64% పెరిగి).
- అమలు తేదీ: 2024 జనవరి 1 నుంచి
- చెల్లింపు విధానం:
- కరెంట్ డీఏ: తదుపరి నవంబరు జీతాలు/పెన్షన్లతో కలిపి చెల్లిస్తారు.
- అరియర్స్: 2024 జనవరి నుంచి వచ్చే బకాయిలు రిటైర్మెంట్ తర్వాత మాత్రమే చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారు.