
దివీస్ ఫార్మా: నాడు వైఎస్ జగన్, నేడు పవన్ కళ్యాణ్ ఇద్దరిదీ ఒకటే రూటు!
దివీస్ ఫార్మా కంపెనీ యూనిట్ ఏర్పాటు విషయంలో ఇరువురు నేతలు ఒకేదారిన సాగారు. కాకినాడ సెజ్ ను ఆనుకుని నిర్మించిన ఆ ప్లాంట్ అప్పట్లో పెనుదుమారం రేపింది.
విపక్షంలో ఉండగా వ్యతిరేకించడం, ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించడంలో ఇద్దరి నేతలదీ ఒకటే దారి. 2017లో దివీస్ వ్యతిరేక పోరాటంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దివీస్ కి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని తుని అసెంబ్లీ నియోజకవర్గం తొండంగి మండల పరిధిలోని తీర ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటును అంగీకరించబోమన్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా సాగితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు.
కానీ తీరా 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో దివీస్ యాజమాన్యానికి అండగా నిలిచారు. పరిశ్రమ ఏర్పాటు కోసం సహకరించారు. స్థానికుల అభ్యంతరాలను, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఉద్యమాన్ని పక్కన పెట్టేసి పరిశ్రమ స్థాపనకు తోడ్పడ్డారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. మాట తప్పిన నాయకుడంటూ మండిపడ్డారు. ప్రజాభీష్టానికి భిన్నంగా పరిశ్రమ వద్దంటూ హెచ్చరించారు. కాలుష్యాన్ని పెంచేసి, మత్స్యకారుల ఉపాధి కొల్లగొట్టే పరిశ్రమలు అంగీకరించబోమన్నారు.
ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో దివీస్ పరిశ్రమ ప్రారంభ సన్నాహాలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. దివీస్ పరిశ్రమ కోసం సముద్రంలో పైప్ లైన్ ఏర్పాటు చేసే ప్రక్రియను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో రంగంలో దిగిన ప్రభుత్వం పెద్ద స్థాయిలో పోలీసులను మోహరించింది. దివీస్ వ్యతిరేక ఆందోళనకారులను గృహనిర్బంధంలో ఉంచింది. దివీస్ కార్యకలాపాలకు అడ్డులేకుండా చూసే బాధ్యత తీసుకుంది.
చివరకు ఫిబ్రవరి 2వ తేదీన పైప్ లైన్ నిర్మాణ పనులను దివీస్ యాజమాన్యం ప్రారంభించింది. దాంతో కోన అటవీ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించారని దివీస్ వ్యతిరేక పోరాట సంఘం అంటోంది.
మాట తప్పడంలో ఇద్దరూ ఒక్కటే. అధికారం దక్కేటంత వరకూ ఒక మాట చెప్పి, గద్దె మీద మరో విధంగా వ్యవహరించారు. మత్స్యకారులను, తీర ప్రాంత ప్రజలను వంచించారు. కాలుష్యకారక పరిశ్రమ తెరిచేందుకు కారణమయ్యారు. రాబోయే రోజుల్లో సమీపంలోని వందలాది రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు ముప్పు ఉంది. ఫార్మా కాలుష్యంతో హేచరీలు మూతపడే ప్రమాదం తప్పదు అంటూ కమిటీ ప్రతినిధి ఆర్ రామారావు అన్నారు.