అలా నీటిని మళ్లించడం రాయలసీమ గొంతు కోయడమే
x

అలా నీటిని మళ్లించడం రాయలసీమ గొంతు కోయడమే

రాయలసీమ హక్కులకు గండి కొట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.


బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌లోని ఎస్‌ఆర్‌బీసీ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువకు కృష్ణా జలాలు అందకుండా శాశ్వత అడ్డుకట్ట వేసి ఎడమవైపున వున్న కట్టను అడ్డంగా నరికేసి ఆ నీటిని ఎస్కేప్‌ ఛానల్‌కు మళ్లించడం రాయలసీమ గొంతు కోయడమే అవుతుంది రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ హక్కులకు గండి కొట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శికి బొజ్జా దశరథరామిరెడ్డి మెయిల్‌ ద్వారా లేఖను పంపినట్లు పేర్కొన్నారు.

గురువారం నంద్యాల పట్టణంలోని సమితి కార్యాలయంలో బొజ్జా మాట్లాడుతూ.. కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 13.08.2005న జారీ చేసిన జీ.ఓ. నెం. 170 లో, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన 120 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుండి 30 రోజుల్లో అందించాలన్న లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుందనీ, వాటిలో ప్రధానంగా..
1. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంపు.
2. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ( ఎస్‌ఆర్‌ఎంసీ) సామర్థ్యాన్ని రోజుకు నాలుగు టీఎంసీలకు పెంపు.
3. బనకచర్ల వద్ద అదనపు రెగ్యులేటర్‌ నిర్మాణం.
4. ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 22,000 క్యూసెక్కులకు పెంచడం (బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుండి గోరుకల్లు రిజర్వాయర్‌ వరకు వరకు)
5. గాలేరునగరి ప్రాజెక్టుకు అవసరమైన ప్రత్యేక కాలువలు, నిర్మాణాలు (గోరుకల్లు నుండి ఆవుకు రిజర్వాయర్‌ వరకు).
ఈ కార్యక్రమాలలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ), బనకచర్ల వద్ద అదనపు రెగ్యులేటర్‌ నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. అయితే, ఎస్‌ఆర్‌బీసీ గాలేరునగరి ప్రాజెక్టులకు అత్యంత అవసరమైన ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువ విస్తరణ నిర్మాణాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వలన, ఇరవై సంవత్సరాల తరువాత కూడా 12,000 క్యూసెక్కుల నీటినీ తీసుకోలేని దుస్థితి నేటికీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనపరమైన అనుమతులు లభించి రెండు దశాబ్దాలు గడిచినా కాలువ సామర్థ్యాన్ని పెంచకపోవడం, రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, నిర్లక్ష్యాలను ప్రశ్నించే పరిస్థితి ఏర్పరిచిందన్నారు.
ఈ నిర్లక్ష్యానికి పరాకాష్టగా, ఎస్‌ఆర్‌బీసీ రెగ్యులేటర్‌ ద్వారా విడుదలైన నీరు గోరుకల్లు రిజర్వాయర్‌కు చేరకుండా శాశ్వత అడ్డుకట్ట వేయడం, ఆ నీటిని ఎస్కేప్‌ ఛానల్‌ ద్వారా కుందూ నదిలోకి మళ్లించడం జరిగిందనీ.. ఇది రాయలసీమ ప్రాజెక్టుల అసలు ఉద్దేశ్యాన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా, రాయలసీమ ప్రజల సాగునీటి హక్కులపై బహిరంగ దాడి వంటిదేనని ఆయన మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి గారికి వ్రాసిన లేఖలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎస్‌ఆర్‌బీసీ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్‌ ఆర్‌ బి సి ప్రధాన కాలువకు కృష్ణా జలాలు వెళ్లకుండా శాశ్వత అడ్డుకట్ట వేసి, ఆ నీటిని ఎస్కేప్‌ ఛానల్‌ కు మళ్లించే నిర్మాణాలను పూర్తి చేశారు... ఈ పనులకు పాలనపరమైన అనుమతులు ఎవరు, ఎప్పుడు ఏ లక్ష్యంతో ఇచ్చారో తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేసారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే, రాయలసీమకు ద్రోహం తలపెట్టిన, ఈ చర్యలకు పాల్పడిన బాధ్యులైన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బొజ్జా తన లేఖలో ప్రధాన కార్యదర్శిని డిమాండ్‌ చేసారు.
అదే విధంగా ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువ ద్వారా కృష్ణా జలాలు గోరుకల్లు రిజర్వాయర్‌కి చేరడానికి ఉన్న అడ్డంకులను తొలగించి, 22000 క్యూసెక్కుల సామర్థ్యానికి తక్షణమే పెంచాలని విజ్ఞప్తి చేసారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు నీరు అందించి, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం తన బాద్యతగా చొరవ తీసుకోవాలని అందుకు తగ్గట్లుగా కార్యాచరణ చేపట్టాలని జలవనరుల ప్రధాన కార్యదర్శిని కోరారు.
Read More
Next Story