
ఏపీ ఐఏఎస్ ల్లో అలజడి
ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో అలజడి నెలకొంది.
ఏపీ ఫైబర్ నెట్ ఎండీ కొత్తమాసు దినేష్ కుమార్, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ల మధ్య భగ్గుమంటోంది. పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి వీరిద్దరి నుంచి వివరణ కోరారు. ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎండీ దినేష్ కుమార్ మంత్రి జనార్థన్ రెడ్డిని కలిసి తన గురించి చెప్పుకున్నారు. జీవీ రెడ్డి తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి యువరాజ్ తో పాటు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ లు మంత్రితో సుదీర్ఘంగా మాట్లాడారు. తాను ప్రభుత్వంలో ఉన్నానా, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానా, నాగురించి అంతగా జీవి రెడ్డి ఎందుకు మాట్లాడారు అని సీనియర్ ఐఏఎస్ అయిన దినేష్ కుమార్ మంత్రిని అడిగినట్లు సమాచారం.
సీఎం ను కలవనున్న ఐఏఎస్ అధికారుల సంఘం
ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడ్డాడని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జివి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలతో కలత చెందిన ఐఏఎస్ అధికారుల సంఘం ముఖ్యమంత్రిని కలిసి జరుగుతున్న పరిణామాలు వివరించాలనే ఆలోచనలో ఉంది. ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థిక మూలాలు ఎండీ దెబ్బతీస్తున్నాడని చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. తాను పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత ఎన్నో సంస్కరణలు తెచ్చానని, అయినా వాటిని అమలు చేయకుండా, ఆదాయం పెరగకుండా చేస్తున్నాడనే ఆరోపణలు చేశారు.
మంత్రి వద్ద పంచాయతీ
పెట్టుబడుల మంత్రి జనార్థన్ ఫైబర్ నెట్ పంచాయతీపై ఇటు ఎండీని, అటు చైర్మన్ ను వివరణ కోరారు. ఎవరి వద్ద ఉన్న ఆధారాలు ఎవరికి వారు సమర్పించాలని ఆదేశించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు అందజేస్తామని ఇరువురూ మంత్రికి చెప్పారు. ఇటు మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ఈ అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. జీవీ రెడ్డి ఎందుకు ఈ విధమైన ఆరోపణలు చేశారనే దానిపై ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలు జీవీ రెడ్డికి చైర్మన్ పదవి ఇచ్చారని, అటువంటప్పుడు సమస్యలు ఉంటే మంత్రి వద్ద కానీ, సీఎం దృష్టికి కానీ తీసుకు పోకుండా నేరుగా మీడియాను పిలిచి ఒక సీనియర్ ఐఏస్ అధికారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే చర్చ ప్రభుత్వంలోనే నడుస్తోంది.
నూతన ప్రభుత్వంలో ఫైబర్ నెట్ వివాదం
ఫైబర్ నెట్ చైర్మన్ గా గత ప్రభుత్వంలో డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి వ్యవహరించారు. ఆయన హయాంలో ఇష్టానుసారం వ్యవహరించారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇష్టానుసారం ఉద్యోగులను నియమించుకున్నారనే ఆరోపణలతో ఆయనపై ప్రభుత్వం కేసు పెట్టింది. కొందరు అధికారులను సస్పెండ్ చేశారు. మూడు నెలల కాలం ఫైబర్ నెట్ కార్యాలయానికి సీలు వేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల తరువాత కార్యాలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి సీఐడీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఫైబర్ నెట్ లో ఏ విధమైన అవినీతి జరిగిందో ఇంతవరకు పూర్తి స్థాయిలో తేల్చలేదు. కేబుల్ విస్తరణ కాంట్రాక్ట్ పనులు, ప్రైవేట్ కేబుల్ నెటవర్కులతో కుమ్మక్కు వంటి ఆరోపణలు అధికారులపై ఉన్నాయి. కార్యాలయంలో కోట్ల కుంభకోణం జరిగిందని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరోపించారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఎటువంటి అంశాలు ఫైబర్ నెట్ గురించి రాలేదు. చైర్మన్ గా జీవి రెడ్డిని నియమించిన తరువాత పలు సార్లు విలేకరులతో మాట్లాడుతూ ఫైబర్ నెట్ లో దోపిడీ జరిగిందని, వైఎస్సార్ సీపీ వారు దోచుకున్నారని ఆరోపించారు. అందుకు ఎవరు కారకులనే విషయాలపై సమగ్రత కొరవడిందని చెప్పొచ్చు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు.
జీవీ రెడ్డికి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది?
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఎందుకు ఉన్నతాధికారిపై ఆరోపణలు చేయాల్సి వచ్చిందనేదానిపై చర్చ జరుగుతోంది. మూడు నెలల క్రితం తాను 400 మంది ఉద్యోగులను తొలగించాలని చెప్పినా వారికి ఇంకా జీతాలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. దినేష్ కుమార్ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా కూడా ఉన్నారు. ఇటీవల డ్రోన్స్ ప్రదర్శన విజయవాడ నగరంలో జరిగింది. దీనికి కూడా దినేష్ కుమార్ నేతృత్వం వహించారు. ముఖ్యమంత్రి కూడా దినేష్ కుమార్ ను అభిమానిస్తున్నారు. అయినా ఎందుకు ఇలా జరిగిందనే దానిపై పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చర్చ మొదలైంది.