
జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ
విజయవాడలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈపోస్ మిషన్లతో పాటు ఎలక్ట్రానిక్ కాటాల పనితీరును మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.
జూన్ 1 నుంచి రేషన్ షాపుల నుంచే నిత్యావసర రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడ మధురానగర్‌లోని 218వ రేషన్ షాపులో ట్రయల్ నిర్వహించారు. ఈపోస్ యంత్రాలను, ఎలక్ట్రానిక్ కాటాల పనితీరును పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 29,760 రేషన్ డిపోలను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఈపోస్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాటా పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్‌ను నిర్వహించినట్లు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు రేషన్ డిపోల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి మొదలు కానున్న ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.