వర్షం వల్ల డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ వాయిదా
x

వర్షం వల్ల డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ వాయిదా

డీఎస్సీ నియామక పత్రాల పంపిణీని ఓ వేడుకలా నిర్వహించాలని భావించిన ప్రభుత్వానికి వర్షం అడ్డంకిగా మారింది.


కూటమి ప్రభుత్వం తలపెట్టిన మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించిన స్థలం అంతా బురద మయం కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మెగా డీఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద వేడుకలా నిర్వహించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా నియామక పత్రాలను అభ్యర్థులకు అందించాలని భావించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ఓ వేడుకలా నిర్వహించాలని ఆలోచించారు. ఆ మేరకు సచివాలయం, అసెంబ్లీలకు వెనుక భాగంలో భారీ సెటప్‌లు వేసి నిర్వహించాలని ప్లాన్‌ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించిన అభ్యర్థులను ఈ ప్రాంగణానికి తరలించాలని ప్లాన్‌ చేశారు. ఆ మేరకు ప్రభుత్వమే అభ్యర్థులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాలను కూడా సిద్ధం చేసింది. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ హంగులతో నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఆ మేరకు ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్నారియా, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అయితే బుధవారం రాత్రి కురిసిన వర్షాల కారణంగా ఈ ప్రాంగణం అంతా తడిసి ముద్దయింది. దీంతో ఆ ప్రదేశం అంతా బురదమయంగా మారిపోయింది. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ ప్రాంగణం అనుకూలంగా లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.


ఇటీవలె సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ కార్యక్రమాన్ని అనంతపురంలో నిర్వహించిన ప్రభుత్వం మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ప్రజల్లో మైలేజీ కొట్టేయాలని భావించిన కూటమి ప్రభుత్వానికి వాతావరణం అడ్డుకట్ట వేసినట్టు అయ్యింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామక పత్రాల పంపిణీనికి ఓ పెద్ద వేడుకలా గత ప్రభుత్వం నిర్వహించింది. అదే తరహాలోనే ఓ వేడుకలా కూటమి ప్రభుత్వం కూడా నిర్వహించాలని భావించింది. అయితే గత ప్రభుత్వం విజయవాడ నగరంలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం డీఎస్సీ కార్యక్రమాన్ని అమరావతి వేదికగా నిర్వహించాలని భావించింది.

Read More
Next Story