రేవంత్ మాటలతో  పెరిగిపోతున్న సస్పెన్స్
x

రేవంత్ మాటలతో పెరిగిపోతున్న సస్పెన్స్

ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడే అవకాశాన్ని ప్రస్తావించారు. అనర్హత వేటుపై రేవంత్ ప్రస్తావించారంటే తెరవెనుక ఏదో పథకం రూపుదిద్దుకుంటోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


తెలంగాణా రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. అసెంబ్లీ సమావేశంలొ రేవంత్ రెడ్డి మాట్లాడుతు ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడే అవకాశాన్ని ప్రస్తావించారు. అనర్హత వేటుపై రేవంత్ ప్రస్తావించారంటే తెరవెనుక ఏదో పథకం రూపుదిద్దుకుంటోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా ఈ విషయాన్ని రేవంత్ పార్టీ మీటింగులోనో లేకపోతే మంత్రులతోనో చెప్పలేదు. డైరెక్టుగా మీడియాతోనే చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి, స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా వ్యాఖ్యలు చేసిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడినా ఆశ్చర్యంలేదన్నారు.

సీఎం, స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరు ? అధికార కాంగ్రెస్ ఎంఎల్ఏలు చేయరు. బీజేపీ ఎంఎల్ఏలకు మాట్లాడే అవకాశం రావటమే అంతంతమాత్రం. కాబట్టి కమలంపార్టీ ఎంఎల్ఏలు కూడా సీఎం, స్పీకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసేదిలేదు. ఎంఐఎం ఎంఎల్ఏలు కాంగ్రెస్ కు మిత్రపక్షమే. పైగా వాళ్ళు మాట్లాడేది కూడా చాలా తక్కువ. ఇక మిగిలింది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు మాత్రమే. కారుపార్టీ ఎంఎల్ఏల్లో కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రులు తెగ బాధపడిపోతున్నారు. కొంతమంది సభ్యులు డైరెక్టుగా స్పీకర్ ను ఉద్దేశించి బెదిరించేట్లుగా మాట్లాడుతున్నారని మంత్రులు సభలోనే ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే కారుపార్టీ ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డికి రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మధ్య తీవ్రస్ధాయిలో సభలో వివాదం నడిచింది. బీఆర్ఎస్ మహిళా ఎంఎల్ఏలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి పేరు ప్రస్తావన తేకుండానే రేవంత్ మాట్లాడారు. దాంతో భుజం తడుముకున్న సబితా డైరెక్టుగా రేవంత్ ను టార్గెట్ చేస్తు గట్టిగా మాట్లాడారు. దాంతో సభలో చాలాసేపు వాగ్వాదాలు చోటు చేసుకున్నది. ఆ తర్వాత సభ వాయిదా పడినపుడు మీడియాతో రేవంత్ మాట్లాడుతు అనర్హత వేటు ప్రస్తావన తెచ్చారు.

2018లో సభలో బాగా దూకుడుగా మాట్లాడుతున్నారన్న కారణంతో తనను నెలరోజుల పాటు సభలోకి వచ్చేందుకు లేకుండా సస్పెండ్ చేసిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దుచేసినట్లు మండిపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన కొన్ని సంప్రదాయాలనే తమ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు రేవంత్ చెప్పారు. అంటే రేవంత్ తాజా వ్యాఖ్యలను బట్టి బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో కొందరి సభ్యత్వాలు రద్దు అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం పెరిగిపోతోంది. మరి రేవంత్ మనసులో ఏముంది ? ఎవరిని టార్గెట్ చేశారు ? ఎప్పుడు ఆచరణలోకి తీసుకొస్తారన్నది సస్పెన్సుగా మారింది.

Read More
Next Story