
నీటి కేటాయింపులు జరిగాకే మిగులు జలాలపై చర్చలు
రాజకీయ ప్రయోజనాల కంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చేసిన భట్టి విక్రమార్క
ఏపీ ,తెలంగాణ మధ్య జలాల పంపిణీ విషయంలో ఇప్పట్లో చర్చలు లేనట్లేనా..మిగులు జలాల విషయం ఇప్పుడే మాట్లాడే అంశం కాదా ?ఇదే అంశాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీటి హక్కుల కోసమని, రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయ్యి కేటాయింపులు జరిగిన తరువాతే మిగులు జలాల అంశంపై చర్చలుంటాయని భట్టి స్పష్టం చేశారు.విశాఖలో నిర్వహించిన ‘స్టాప్ ఓట్ చోరీ’ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై స్పందించారు.
‘‘సముద్రంలోకి వెళ్లే జలాలు అని మాట్లాడటం సరికాదు. గోదావరిపై మేం చేపట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయంగా ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగులు జలాలుంటే వాడుకోవచ్చు. మా అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు నిర్మిస్తే కేటాయింపుల్లో సమస్య వస్తుంది’’అని భట్టి అన్నారు.భవిష్యత్‌లో ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.
బనకచర్ల ప్రాజెక్టు అంశంలో వరద జలాలనే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిపుణుల కమిటీని ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తమ సభ్యుల పేర్లు కేంద్రానికి పంపలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో విశాఖ వేదికగా భట్టి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Next Story