ఈ మంత్రుల చుట్టూ చర్చ
మంత్రుల్లో చాలా మందిని గడ్డు పరిస్థితులు వెంటాడుతున్నాయి. మరి కొందరు టఫ్ ఫైట్‌లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొందరి మంత్రుల గెలుపు, ఓటములపై చర్చ జోరుగా సాగుతోంది. స్థానికత, స్థానాల మార్పు, లోకల్ లీడర్లు, కార్యకర్తలు సహకరించక పోవడం, స్థానిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపక పోవడం తదితర సమస్యలు మంత్రుల గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతోందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. దాదాపు 10 మందికిపైగా మినిస్టర్లు ఈ రకమైన సమస్యలు వెంటాడుతున్నాయని చర్చించుకుంటున్నారు. మరి కొందరు టఫ్ ఫైట్‌లో ఉన్నారనే చర్చ సాగుతోంది.
మంత్రులైన, ఎమ్మెల్యేతో సమానమని, ఎమ్మెల్యేలకున్న పవర్స్‌తో పాటే పరిపాలనలో మంత్రులుగా యాక్ట్ చేశారే తప్ప, ప్రత్యేక నిధులు, అభివృద్ధికి అవకాశమంటూ మంత్రులకు ఏమీ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఓటు ఏ మంత్రిని ఎలా రిసీవ్ చేసుకుంటుందోననే చర్చ బలంగా జరుగుతోంది.
పేరుకే మంత్రులు తప్ప ప్రతిదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు మాత్రమే జరిగిందని, పైగా కొందరు మంత్రులు ఆ నియోజక వర్గాల్లో గెలిచే అవకాశం లేదంటూ, వేరే నియోజక వర్గాలకు బదిలీ చేయడం కూడా ఓటమికి తొలి మెట్టు అయ్యే అవకాశాలున్నాయనే చర్చ కూడా జరుగుతోంది.
ప్రకాశం జిల్లాలో ఇద్దరు మంత్రులకు కొత్త నియోజక వర్గాలను కేటాయించారు. ఎర్రగొండపాలెం నుంచి మంత్రి అయిన ఆదిమూలపు సురేష్‌ను అదే జిల్లా కొండపి నియోజక వర్గం అభ్యర్థిగాను, బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యే, మంత్రి మేరుగ నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఈ నియోజక వర్గం తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీలకు బలమైన నియోజక వర్గమే. వరుసగా రెండు సార్లు వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన బిఎన్ విజయ్‌కుమార్ అదే నియోజక వర్గంలో టీడీపీ తరపున పని చేస్తూ వస్తున్నారు. టీడీపీ కేడర్‌లో విజయ్‌కుమార్‌కు మంచి పట్టు ఉంది. సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్‌బాబును కాదని మంత్రి నాగార్జునకు సీటివ్వడంతో అక్కడి ఓటర్లు మంత్రిని తిరస్కరించే పరిస్థితులు వచ్చాయి. 15ఏళ్లుగా అందుబాటులో ఉన్న బిఎన్ విజయ్‌కుమార్‌ను కాదని నిన్న కాక మొన్నొచ్చిన మేరుగ నాగార్జునకు ఓటు వేయడం ఎంత వరకు సబబనే పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో నాగార్జున పరిస్థితి బోర్లాపడ్డటై్టంది. ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన అక్కడ ఖమ్మ సామాజిక వర్గం డామినేషనే ఎక్కువుగా ఉంటుంది.
కొండపిలో ఇప్పటికే రెండు సార్లు టీడీపీ నుంచి డాక్టర్ బాలవీరాంజనేయస్వామి గెలిచారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్‌ను మాదాసు వెంకయ్యను కాదని అశోక్ బాబుకు ఇన్‌చార్జి ఇచ్చారు. వీరిద్దరి మద్య స్పర్థలు చోటు చేసుకొని బహరింగ విమర్శలకు దిగారు. అశోక్ బాబును వేమూరుకు పంపించి మంత్రి సురేష్‌ను బరిలో దింపారు. సురేష్ కూడా ఇక్కడ కొత్త. ఇది కూడా ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం. అయినా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చెప్పినట్లు ఇతరులు తలూపే పరిస్థితులున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామంచర్ల జనార్థన్ కనుసన్నల్లో కొండపి ఎమ్మెల్యే స్వామి నడుచుకుంటున్నారు. తిరిగి స్వామికి అనుకూల పరిస్థితులు ఉన్నాయనేది పలువురు నాయకుల మాట. సురేష్ మంత్రి అయినప్పటికీ ఓటర్లుతో మాట్లాడటం కోసం గ్రామ స్థాయి నేతల వద్దకు వెళ్తే వారు కుర్చీలో దర్జాగా కూర్చుని పక్కన కుర్చీ వేసి కూర్చోండి సురేష్‌గారు అంటూ మాట్లాడటం తప్ప కుర్చీలో నుంచి లేచి ఆహ్వానించి సంఘటన ఒక్క చోట కూడా జరగ లేదని వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లే చెబుతున్నారు. కేవలం సురేష్ వద్ద డబ్బు ఉందని, ఆ డబ్బుకు ఆశపడి చాలా మంది మీకు తిరుగులేదు, గెలుస్తారని మెప్పు కోసం చెప్పడం తప్ప వేరేది కాదని స్థానికుల్లో చర్చ ఉంది.
మంత్రి రోజా పరస్థితి కూడా ఇదే. పార్టీ ముఖ్య కార్యకర్తలను కాదని, తను సోదరులతో రాజకీయాలు చేయడాన్ని స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జీర్ణించుకోలేక పోయారు. అందుకే పార్టీ కేడర్ నుంచి సంపూర్ణ మద్ధతు రోజాకు లభించ లేదని, గత ఎన్నికల్లోను తక్కువ మెజారిటీతో గెలిచినందున ఈ ఎన్నికలు అంతకంటే రెండు రెట్లు రోజాకు టఫ్‌గా ఉంటాయని, గెలుపు అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. రోజా మొదటి నుంచి పార్టీ కేడర్‌కు సహకరించడం లేదని పార్టీలతో సంబంధం లేకుండా ఆర్థిక సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే ఓటమి అంచుకు రోజా చేరారనే వాదన కూడా వైఎస్‌ఆర్‌సీపీలో ఉంది. ఎన్నికలకు ముందు ఈ పంచాయతీ సీఎం వద్దకు చేరినా ఎన్నికలు అయిపోయేంత వరకు అలాగే ఉంది తప్ప పరిష్కారం కాలేదు.
రాజమండ్రి గ్రామీణం నుంచి బరిలో ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గోపాలపురం నుంచి పోటీలో ఉన్న మంత్రి తానేటి వనిత, గుంటూరు పశ్చిమ నుంచి బరిలో ఉన్న మంత్రి విడుదల రజనీ. పెనమలూరు నుంచి పోటీలో ఉన్న మంత్రి జోగి రమేష్, తాడేపల్లి నుంచి బరిలో ఉన్న మంత్రి కొట్టు సత్యనారాయణ, అమలాపురం నుంచి పోటీలో ఉన్న మంత్రి పినిపే విశ్వరూప్, పెనుకొండ నుంచి బరిలో ఉన్న మంత్రి ఉష శ్రీచరణ్‌లకు గడ్డు పరిస్థితులు ఉన్నాయని చర్చ సాగుతోంది. ఈ స్థానాల్లో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మద్దిపాటి వెంకటరాజు, పిడుగురాళ్ల మాధవి, బోడె ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, అయితాబత్తుల ఆనందరావు, సవితలకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చర్చ స్థానికుల్లో ఉంది.
Next Story