ఏపీలో విభిన్న వాతావరణ పరస్థితులు
x

ఏపీలో విభిన్న వాతావరణ పరస్థితులు

ఓ పక్క అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఉక్క పోతతో ప్రజలు అల్లాడి పోతోంటే.. మరో వైపు పిడుగుపాటు వర్షాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. వాతావరణ మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మే 15 గురువారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మే 16 శుక్రవారం నాడు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద నిలబడరాదన్నారు.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 53.5మిమీ, రాగోలులో 49.2మిమీ, శ్రీకాకుళం 47.2మిమీ, ఏలూరు జిల్లా పూళ్ళలో 44.5మిమీ, శ్రీకాకుళం ఎల్‌ఎన్‌ పేటలో 38.5మిమీ, ఆముదాలవలసలో 35.7మిమీ, ఏలూరులో 34.5మిమీ, పార్వతీపురంమన్యం జిల్లా పాలకొండలో 32.7మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
అలాగే గురువారం ఉష్ణోగ్రతలు 41–43డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. పార్వతీపురంమన్యం జిల్లా గరుగుబిల్లిలో తీవ్రవడగాలులు, శ్రీకాకుళం జిల్లాలో ఒక మండలంలోను, విజయనగరం జిల్లాలో 16, పార్వతీపురంమన్యం జిల్లాలో 10, అల్లూరి జిల్లాలో 1, కాకినాడ జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 1 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
బుధవారం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8డిగ్రీలు, పల్నాడు జిల్లా కాకాని 42.7డిగ్రీలు, బాపట్ల జిల్లా కొమ్మలపాడులో 42డిగ్రీలు, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.7డిగ్రీలు, నంద్యాల జిల్లా బొల్లవరంలో 41.6డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 41డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వివరించారు.
ఎండ తీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్‌ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని కూర్మనాథ్‌ సూచించారు.
Read More
Next Story