
ఎంఎల్సీ ఎన్నికల్లో బీసీ వాదన పనిచేయలేదా ?
గ్రౌండ్ రిపోర్టు ప్రకారం బీసీ వాదన పెద్దగా ఫలించలేదనే అనిపిస్తోంది.
ఇపుడిదే పాయింట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే తాజాగా ఫలితాలు వచ్చిన మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో రెండుచోట్ల బీజేపీ గెలిచింది. రెండు టీచర్లు, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఒక టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికల్లో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్(Congress) పోటీచేసిన ఏకైక సీటు గ్రాడ్యుయేట్ ఎన్నికలో ఓడిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీసీ నినాదంతో గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పోటీచేసిన బీఎస్పీ(BSP) అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ ఓడిపోయారు. మూడుపాయింట్లను దృష్టిలో పెట్టుకుని హరికృష్ణ పోటీచేశారు. మొదటిది పార్టీలకు అతీతంగా ఉమ్మడి జిల్లాలైన మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో బీసీ ఓట్లను నమ్ముకున్నారు.
రెండోపాయింట్ పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్(BRS) ఓట్ల వేయించుకోవటంతో ఎన్నికలో గెలవచ్చని అనుకున్నారు. ఇక మూడోపాయింట్ ఏమిటంటే కాంగ్రెస్, బీజేపీ(BJP) అభ్యర్ధుల యాంటీ ఓట్లు తనకు పడతాయన్నది హరికృష్ణ ఆలోచన. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కీలకనేత హరీష్ రావు(Harish Rao)తో ప్రసన్న భేటీ అయితే, కల్వకుంట్ల కవిత(Kalvkuntla kavitha)తో ప్రసన్న భార్య భేటీ అవటంతో బీఆర్ఎస్ ఓట్లు ప్రసన్నకే పడతాయనే ప్రచారం జరిగింది. అయితే బీఎస్పీ అభ్యర్ధి ప్లాన్ కొంతవరకు మాత్రమే వర్కవుటైంది. కొంతవరకు వర్కవుటైంది అనేందుకు నిదర్శనం ఏమిటంటే హరికృష్ణకు సుమారు 60 వేల ఓట్లు రావటమే. ఎంఎల్సీ ఎన్నికల్లో వినిపించిన బీసీ నినాదం పై నాలుగు జిల్లాల్ల పరిధిలోని టీచర్ల నియోజకవర్గంలో గెలిచిన బీజేపీ అభ్యర్ధి మల్క కొమురయ్యకు కొంచెం పనిచేసింది. పై జిల్లాల్లోని టీచర్ల నియోజకవర్గంలో కొమురయ్యకు ప్రత్యర్ధులుగా వివిధ టీచర్ల యూనియన్ల నేతలు పోటీచేశారు. యూనియన్ల నేతల మధ్య ఓట్లు చీలిపోవటం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో లేకపోవటంతో పాటు బీసీ కావటం కూడా కొమురయ్యకు బాగా కలిసొచ్చింది.
గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పోటీచేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు చిన్నమైల్ అంజిరెడ్డి(BJP Candidate Anjireddy), వూటుకూరి నరేంద్రరెడ్డి ఇద్దరు రెడ్లే కాబట్టి బీసీ(BC Slogan) నినాదాన్ని బలంగా తెరపైకి తీసుకొచ్చారు బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న. పై నాలుగు జిల్లాల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఇలాంటి అనేక కాంబినేషన్లను దృష్టిలో పెట్టుకున్న ప్రసన్న హరికృష్ణ బీసీ నినాదంతో గ్రాడ్యుయేట్ ఓటర్లలో చీలిక తీసుకొచ్చి ఇద్దరు రెడ్డి అభ్యర్ధులను ఓడించవచ్చని అనుకున్నారు. అయితే బీఎస్పీ అభ్యర్ధి బీసీ నినాదం చివరకు బీజేపీ అభ్యర్ధి కొమురయ్య, అంజిరెడ్డిల గెలుపుకు ఉపయోగపడింది. రెండుఎన్నికల పోలింగ్ ఒకేరోజు జరిగింది కాబట్టి బీసీల ఓట్లు కొమురయ్య, అంజిరెడ్డికి సానుకూలంగా పడ్డాయి.
పార్టీ ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్రరెడ్డి వ్యతిరేక ఓట్లు, బీఆర్ఎస్ ఓట్లలో కూడా ఎన్నోకొన్ని బీజేపీ లాక్కోగలిగింది. వీటన్నింటికి అదనంగా అంజిరెడ్డికి కలిసొచ్చిన అంశాలు ఏమిటంటే అభ్యర్ధిత్వాన్ని రెండునెలల ముందుగా ప్రకటించటం, బీజేపీతో సంబంధంలేకుండా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీలో పనిచేస్తున్న వాళ్ళు ఓటర్ల నమోదులో బాగా చురుకుగా వ్యవహరించటమే కాకుండా బీజేపీ అభ్యర్ధి గెలుపుకు 24 గంటలూ పనిచేయటం. కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్రరెడ్డికి పార్టీలోనే నూరుశాతం యాక్సెప్టెన్సీ రాలేదు. అభ్యర్ధి వ్యవహారశైలి కూడా అందరినీ కలుపుకుని వెళ్ళేట్లుగా లేకపోవటంతో పార్టీలోని ఒక సెక్షన్ ముఖ్యంగా బీసీ నేతలు పెద్దగా పనిచేయలేదు. ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న లాంటి కొంతమంది బీసీ నేతలు బహిరంగంగానే బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్నకు మద్దతుగా ప్రచారంచేశారు. కాంగ్రెస్ ఓట్లన్నీ నరేంద్రరెడ్డికి పడకుండా బీసీ నినాదంతో బీఎస్పీకి పడ్డాయి. అభ్యర్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లలో వచ్చిన చీలిక కూడా బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి గెలుపుకు కారణమనే చెప్పాలి. మొత్తంమీద గ్రౌండ్ రిపోర్టు ప్రకారం బీసీ వాదన పెద్దగా ఫలించలేదనే అనిపిస్తోంది.
గెలిచిన బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డికి డైరెక్టుగాను, ప్రాధాన్యత ఓట్లరూపంలో అన్నీ కలుపుకుని పోలైన ఓట్లు 98,637. అలాగే కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్రరెడ్డికి పడిన ఓట్లు 93,531 ఓట్లు. ప్రసన్నకు సుమారు 60 వేల ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్రరెడ్డి, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న ఓట్ల లెక్కింపులో చివరలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజారిటితో గెలిచారు.