జగన్ పొలిటికల్ టెర్రరిస్టని వాసిరెడ్డి పద్మకిప్పుడే గుర్తుకొచ్చిందా?
x

జగన్ పొలిటికల్ టెర్రరిస్టని వాసిరెడ్డి పద్మకిప్పుడే గుర్తుకొచ్చిందా?

వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మంచి పదవులనే అనుభవించారు. రాజీనామా సమయంలో గుడ్ బుక్ కాదని, గుండె బుక్ కావాలని నానా విమర్శలు చేశారు.


వామపక్ష రాజకీయ నేపథ్యం ఉన్న కృష్ణా జిల్లా వాసి, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పుడు తన మాజీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన అసలు రాజకీయాలకే పనికి రాడని చెబుతూ వైసీపీ నుంచి వైదొలిగారు. జగన్ ను ఓ రాజకీయ ఫ్యాక్షనిస్టు, పొలికల్ టెర్రరిస్టు అంటున్న ఈ వాసిరెడ్డి పద్మ ఎవరు, ఇంతకాలం ఆ పార్టీలో ఉండి అన్ని విధాలుగా లబ్ధి పొందిన ఆమె ఇప్పుడెందుకు తీవ్రంగా విమర్శిస్తున్నారనేది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది.

వాసిరెడ్డి పద్మ కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట దగ్గర గల కంభంపాడు లో జన్మించారు. ఆమెకు ఓ సోదరుడు ఉండేవారు. ఆయన జర్నలిస్టు. ఆమధ్య కాలం చేశారు. వీరిద్దరూ జగ్గయ్యపేటలో చదివారు. కళాశాల దశలోనే వీరు వామపక్ష రాజకీయాల పట్ల మక్కువ చూపారు. కొంతకాలం తీవ్రవాద రాజకీయాలను అధ్యయనం చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె మంచి వాగ్ధాటి ఉన్న వ్యక్తి. కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు. భర్త పేరు వెస్లీ. ఆయన ఓ సామాజిక సేవా కార్యకర్త. తూర్పుగోదావరి జిల్లా వాసి. వీరికి ఇద్దరు పిల్లలు.
వామపక్ష రాజకీయ నేపథ్యాన్ని వదిలేసిన తర్వాత అస్థిత్వ ఉద్యమాల వైపు మళ్లిన ఈ జంట- ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సామాజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినపుడు 2009లో ఆ పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడంతో ఆమె 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పని చేసేవారు. ఈ అధికార ప్రతినిధులందరూ నిర్ణీత వేతనంతో పని చేసిన వారే కావడంతో వీళ్లకు అంతగా గుర్తింపు ఉండేది కాదన్న వదంతులూ వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. తద్వార వాసిరెడ్డి పద్మ వైఎస్ జగన్ కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. డాక్టర్ వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా చేదోడు వాదోడుగా ఉండేవారు.
జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీ మీడియా విభాగం ఇన్చార్జ్ గా ఉన్న జీవీడీ కృష్ణమూర్తి చెప్పిన దానికి అనుగుణంగా ఈమె కూడా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి పార్టీ విధివిధానాల పేరిట వాళ్ల ప్రత్యర్థులను గట్టిగానే విమర్శించారు. మాటలో స్పష్టత ఉండడంతో మహిళా సమస్యలపై ఆమెతోనే ఎక్కువగా మాట్లాడించేవారు.
2019లో వైఎస్ జగన్ సంచలన విజయం నమోదు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకున్నట్టే ఈమెకు కీలకపదవే లభించింది. వైఎస్ జగన్ వాసిరెడ్డి పద్మను 2019 ఆగస్టు 8న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆగస్టు 26న బాధ్యతలు చేపట్టారు. 2019 ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు పదవిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో రాజ్యాంగబద్ధమైన ఆ పదవికి రాజీనామా చేశారు.
"వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చురుగ్గా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశా" అని వాసిరెడ్డి పద్మ ఆవేళ ప్రకటించారు. ఆ మర్నాడే వైసీపీ ఏర్పాటు చేసిన
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఉపన్యసించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేసేందుకు వీలు ఉండదు, ముఖ్యంగా మా ప్రియతమ నేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంటి మహిళా అనుకూల నేతకు మద్దతుగా ఉండేలా రాజీనామా చేశా. ఇప్పుడు రాష్ట్రమంతటా పర్యటించి మహిళల ఓట్లు వైసీపీకి పడేలా కృషి చేస్తాను అని చెప్పారు. ఇంటింటికి వెళ్లి మహిళలందర్నీ ఒప్పించి వైసీపీకి మద్దతు కూడగడతానని చెప్పారు. జగన్ పాలనను విపరీతంగా మెచ్చుకుంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి నేతలు జగన్ కి సాటిరారంటూ ప్రశంసించారు. మహిళా కమిషన్ ఛైర్మన్ హోదాలో ఆమె ఓ దశలో పవన్ కల్యాణ్, చంద్రబాబుకు నోటీసులు కూడా ఇప్పించారు.
అదే సమయంలో తనకూ లేదా తన భర్తకు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేసేందుకు సీటు ఇవ్వాలని జగన్ ను కోరుతూ వచ్చారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అప్పటికే ఏ సీటు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించినందున ఆమెకు సీటు ఇచ్చే ప్రతిపాదనను పరిశీలించలేదు.
జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని, అది ఈ రాష్ట్ర ప్రజలందరి బాధ్యతగా చెప్పుకుంటూ వచ్చారు. అయినా సీటు దక్కలేదు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిత్వానికి మార్గం సుగమం చేసుకోవడమే లక్ష్యంగా రాజీనామా చేశారా అని అడిగిన ప్రశ్నకు ఆవేళ వాసిరెడ్డి పద్మ అటువంటిదేమీ లేదని చెప్పారు.
వాసిరెడ్డి పద్మ 2024 శాసనసభ ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ తనకు కానీ తన భర్తకు కానీ కేటాయించాని కోరారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆవేళ వార్తలు వచ్చాయి. జగన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేయడం కోసం రాజకీయ రంగంలోకి వచ్చానని చెప్పిన ఆమె తనకు సీటు రాకపోవడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. పార్టీ నాయకత్వం కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.
2024 ఎన్నికలలో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. అప్పటి వరకు గళం విప్పని అసంతృప్తి వర్గాలు నెమ్మదిగా నోరు విప్పడం ప్రారంభించాయి. అప్పటికే పలువురు రాజీనామా చేశారు. అయినా ఆమె నాలుగు నెలలుగా పార్టీలో ఉన్నారు. ఇటీవల జగ్గయ్యపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడి జనసేనలో చేరారు. అప్పుడైనా ఆమెకు జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగిస్తారని భావించారు. కానీ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అయిన జగన్ ఆమెను కాదని మరో సీనియర్ నేత తన్నీరు నాగేశ్వరరావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. జగన్‌ నిర్ణయంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైన ఆమె అసంతృప్తి చెంది అక్టోబర్ 23న వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు.
ఇప్పుడు ఆమె పార్టీపైనా, పార్టీ అధినేత జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాతీర్పు తర్వాత ప్రక్షాళన జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమంలో ఎంతో గొప్పగా చేశామని అనుకున్న తర్వాత కూడా ఎందుకు ఓటమి చెందామనే దానిపై జగన్ లో ఆత్మశోధన లేదన్నారు. రాజకీయాలను ఫ్యాక్షనిస్టు వైపు మళ్లించారని, ప్రత్యర్థులను టెర్రర్ చేయడం ద్వారా వైసీపీని సుస్థిరం చేయాలనుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ మోడల్ కరెక్ట్ కాదంటున్నారు. ప్రజలు తిరస్కరించినా, 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ ధోరణి మారలేదన్నారు. జగన్ మాయాజాలంలో మోసపోయామని వాపోతున్నారు. ఇంతకాలం భ్రమల్లో ఉండిపోయామంటున్నారు. పార్టీని నియంతృత్వం వైపు నడిపించారుని మండిపడ్డారు. ఓపెన్ గా మాట్లాడలేకపోయాం అంటున్నారు ఆమె.
ఈ విమర్శలన్నీ ఇప్పుడే గుర్తుకువచ్చాయా మేడం అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా జీతం తీసుకుంటున్నప్పుడు, పార్టీ ఇచ్చిన సౌకర్యాలను అనుభవించినపుడు, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ గా సుమారు నాలుగున్నర ఏళ్లు అధికారాన్ని చెలాయించినపుడు జగన్ దుర్మార్గుడు, దుష్టుడని తెలియదా అని పార్టీ అధికార ప్రతినిధి ఒకరు విరుచుకుపడ్డారు. మళ్లీ పదవులు రావన్నప్పుడే జగన్ తీరు గుర్తుకువచ్చిందా అనేది వారి విమర్శ. ప్రజాతీర్పు ప్రామాణికం అంటున్న వాసిరెడ్డి పద్మకు నిజంగా జనంలో ఉన్న పలుకుబడి ఎంత అనే దాన్ని నిలదీస్తున్నారు. ఓ మహిళగా, మేధావిగా భావించి పదవి అప్పగిస్తే ఇప్పుడీ విమర్శలు ఏమిటీ, ఇంత నీతి నిజాయితీ, చిత్తశుద్ధి, అంకిత భావం, ప్రజాసంక్షేమం పట్ల మక్కువ ఉంటే జగన్ ను అప్పుడే విమర్శించి బయటకు రావాలని కదా అని పార్టీ నేతలు ఆమెను విమర్శిస్తున్నారు. జగన్ అసలు స్వభావం ఇప్పుడే తెలిసిందా, 2012 నుంచి తెలియలేదా అని ప్రశ్నిస్తున్నారు. బయటకి పోవాలనుకుంటున్నప్పుడు ఇంత బురద జగన్ పై వేసి వెళ్లాల్నా అని నిలదీస్తున్నారు.
Read More
Next Story