కల్తీ నెయ్యితో ఆ ముగ్గురూ రూ.250 కోట్లు దోచుకున్నారా?
x

కల్తీ నెయ్యితో ఆ ముగ్గురూ రూ.250 కోట్లు దోచుకున్నారా?

వైఎస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు నియమించిన ముగ్గురు- వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇవో ధర్మారెడ్డి సుమారు 250కోట్లు దోచుకున్నారని టీడీపీ ఆరోపించింది.


తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి టెండర్ల ఖరారులో కమీషన్ల కక్కుర్తి ఉందా? ఇంత చిన్న మొత్తాలకు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించిన టీటీడీ ఛైర్మన్లు పాల్పడ్డారా? తమ అనుకూల కంపెనీలకు ఆనాటి బోర్డు ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి కాంట్రాక్టులు ఇచ్చారా? అంటే అవుననే ఆరోపిస్తోంది తెలుగుదేశం. టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించిన దాని ప్రకారం ఈ ముగ్గురు కలిసి రూ.250 కోట్లు దోచుకున్నారు. కొన్ని సంస్థలతో కుమ్మక్కయ్యారు. వాళ్లకే వేర్వేరు పేర్లతో నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని, ఆ పేరిట కమీషన్లు తీసుకున్నారని విజయ్ కుమార్ అక్టోబర్ 5న పత్రికా విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. . ‘‘రివర్స్‌ టెండరింగ్ పేరిట తిరుమల నెయ్యి టెండర్లలోనూ జగన్‌ మోహన్ రెడ్డి, ఆయన అనుయాయులు దోపిడీకి పాల్పడ్డారు. తమకు నచ్చినవారిని తక్కువ ధర కోట్‌ చేయాలని... ఎల్‌1, ఎల్‌2లను నిర్ణయించారు. వారికే కాంట్రాక్టులు కట్టబెట్టారు’’ అన్నారు విజయ్ కుమార్. ఆయన ఇంకా ఏమని ఆరోపించారంటే..


‘‘తిరుమలలో ప్రసాదాల తయారీకి రోజుకు 15వేల కేజీల నెయ్యి అవసరం. అంటే ఏడాదికి సుమారు 54 లక్షల కేజీలు. కానీ, టీటీడీకి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 9 సంస్థలే నెయ్యి సరఫరా చేశాయి. 2019-24 మధ్య నెయ్యి సరఫరాకు 15సంస్థలు టెండర్‌ వేశాయి. టీటీడీ నిర్ణయించిన ధర, కమీషన్లు చెల్లించలేక.. ఆంధ్రాకు చెందిన విజయ, విశాఖ, తిరుమల, సంగం, పరాగ్, కర్ణాటకకు చెందిన నందిని తప్పుకొన్నాయి. మిగిలిన 10 సంస్థల్లో 9 సంస్థలు కాంట్రాక్టులు దక్కించుకొన్నాయి. వీటిలో తొమ్మిది ఇతర రాష్ట్రాలవి కాగా.. వైష్ణవి ఫుడ్స్‌ మాత్రమే ఆంధ్రా సంస్థ’’ అన్నారు విజయ్‌కుమార్. ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రీమియర్‌ అత్యధికంగా ఆరుసార్లు కాంట్రాక్టు దక్కించుకుంది. ఏపీకి చెందిన వైష్ణవి ఫుడ్స్, ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆల్ఫా మిల్క్, మహారాష్ట్రకు చెందిన మల్‌గంగా అగ్రి ప్రొడక్ట్స్‌ నాలుగేసి సార్లు, ఇందాపూర్‌ డెయిరీ రెండుసార్లు, భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ ఒకసారి, మధ్యప్రదేశ్‌కు చెందిన జయశ్రీ గాయత్రి ఫుడ్స్‌ ఒకసారి, రాజస్థాన్‌కు చెందిన దావూజీ, తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ ఒకసారి చొప్పున నెయ్యి సరఫరా చేశాయి’’ అన్నారు విజయ్‌కుమార్‌.

‘‘ఇతర రాష్ట్రాల నుంచి తిరుమలకు నెయ్యి చేర్చాలంటే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఎక్కువ ధర కోట్‌ చేయాలి. కానీ కిలో 350 చొప్పున ఇస్తున్నారు. రవాణా, లాభం అన్ని వేసుకుంటే వాళ్లకు పడుతున్న నెయ్యి ధర రూ.220కి కాస్త అటూ ఇటూ ఉంటుంది. దేశంలో అంత తక్కువ ధరకు నెయ్యి దొరకదు. అందుకే వాళ్లు కల్తీ చేసి టీటీడీకి సరఫరా చేశారు. దాని వల్ల లడ్డూ ప్రసాదం అపవిత్రమైంది’’ అని విజయ్‌కుమార్‌ ఆరోపించారు.
అప్పటి ఇవో ధర్మారెడ్డి నోరువిప్పాలి...
ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి ఆనాటి టీటీడీ ఇవో ధర్మారెడ్డి ఎక్కడని విజయ్ కుమార్ ప్రశ్నించారు. ధర్మారెడ్డి వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారని విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. ‘‘మార్కెటింగ్‌ ధరతో సంబంధం లేకుండా ఎలా కోట్‌ చేశారు? మూడు నెలలకోసారి ధరలో రూ.70 నుంచి రూ.130 వరకు ఎందుకు తేడా వచ్చింది? సహకార డెయిరీలను కాదని.. ట్రేడింగ్‌ కంపెనీలకు కాంట్రాక్టులు ఎందుకిచ్చారు? రైతులైతే కమీషన్లు ఇవ్వరని భయమా?’’ అని ప్రశ్నించారు. వంద టన్నుల నెయ్యి కూడా సరఫరా చేయలేని ఏఆర్‌ డెయిరీకి పది లక్షల కేజీల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎలా ఇస్తారన్నారు విజయ్ కుమార్.


Read More
Next Story