తప్పు వీళ్ళదైతే సమంతకు గాయాలా ?
x

తప్పు వీళ్ళదైతే సమంతకు గాయాలా ?

ఎనుబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు దెబ్బతిన్నాయన్నట్లుగా కొండా సురేఖ-కేటీఆర్ వివాదంలో సంబంధంలేని సమంత, అక్కినేని ఫ్యామిలి రోడ్డున పడిందన్నది వాస్తవం.


అవును ఇద్దరూ తప్పుచేశారు. మంత్రి కొండాసురేఖను రెచ్చగొట్టటం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తప్పయితే, రెచ్చిపోయి తమ వివాదానికి ఎలాంటి సంబంధంలేని సినీనటి సమంతతో పాటు అక్కినేని నాగార్జున, అక్కినేని చైతన్యలను రోడ్డుపైకి లాగటం మంత్రి చేసిన తప్పు. రాజకీయంగా కేటీఆర్ తో ఉన్న సమస్యను సరిగా ఎదుర్కోలేక ఏ సంబంధంలేని సమంత-నాగచైతన్య విడాకుల అంశాన్ని కొండా సురేఖ మద్దతుగా లాగటం చాలా తప్పు. ఇంతకీ వివాదం విడాకుల దాకా ఎందుకు వెళ్ళింది. అసలు వివాదానికి మూలకారణం ఏమిటి ?

కారణం ఏమిటంటే సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కొండాసురేఖతో పాటు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందనరావు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మంత్రి మెడలో ఎంపీ నూలుదండను వేశారు. దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చాల అసభ్యంగా కామెంట్లు పెట్టి వైరల్ చేశారు. రెండురోజుల పాటు అలాంటి పోస్టులు వైరల్ అయిన తర్వాత మంత్రి స్పందించి మీడియా సమావేశంలో భోరున ఏడ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారానే పోస్టు వైరల్ అయ్యింది కాబట్టి ఆమె కారుపార్టీ అగ్రనేల స్పందన కోరుకున్నారు. మంత్రి డిమాండుకు తగ్గట్లే సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించి వైరల్ అయిన పోస్టును ఖండించారు. హరీష్ ఎందుకు స్పందించారంటే వైరల్ అయిన పోస్టు డీపీగా హరీష్ ఫొటో ఉంది కాబట్టే. సరే, దేనికో ఒకందుకు హరీష్ స్పందించారు కాబట్టి వివాదం అక్కడితో ముగిసిందనే అనుకున్నారు.

అయితే అనూహ్యంగా కేటీఆర్ స్పందనతో మళ్ళీ వివాదం రాజుకుంది. కొండాను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతు దొంగ ఏడుపులు ఎందుకని ఎద్దేవాచేశారు. గతంలో కొండా ఎంతనీచంగా మాట్లాడారో అందరికీ తెలుసంటు మండిపోయారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మంత్రిని రెచ్చగొట్టేట్లుగానే ఉన్నాయి. తనపైన దారుణంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని మంత్రి మీడియా సమావేశంలో ఏడిస్తే దాన్ని కేటీఆర్ దొంగేడుపంటు ఎగతాళి చేయటం చాలా తప్పు. మంత్రిపై జరిగిన ట్రోలింగ్ కు పార్టీకి సంబంధంలేదని కాని లేదా మంత్రిపై జరిగిన ట్రోలింగ్ కు సారి చెప్పి భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని కేటీఆర్ ఒక మాటనుంటే సరిపోయేది. అలా అనకుండా మంత్రిది దొంగ ఏడుపలని ఎగతాళిచేయటంతో సురేఖకు బాగా మండింది. అసలే సురేఖ దూకుడు ఎలాగుంటుందో, నోటిదురుసు ఎలాగ ఉంటుందో గతంలో చాలాసార్లు అందరు చూసిందే.

అలాంటిది కేటీఆర్ బాగా కెలికేయటంతో కొండా సురేఖ ఇక రెచ్చిపోయారు. నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తు సంబంధంలేని రీతిలో సమంత-చైతన్య విడాకులు, కేటీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్, హీరోయిన్లను బ్లాక్ మెయిల్, కేటీఆర్ దగ్గరకు వెళ్ళాలని సమంతను నాగార్జున, చైతన్యలు ఒత్తిడిపెట్టడంతోనే ఇద్దరు విడాకులు తీసుకున్నారంటు అసందర్భంగా, అసహ్యంగా సురేఖ ఆరోపణలు చేశారు. కేటీఆర్ ను గబ్బుపట్టించే ప్రయత్నంలో మంత్రి చేసిన పనికి నాగార్జున, చైతన్య, సమంత మీద టన్నుల కొద్దీ బురదపడిపోయింది. ఈ బురద ఇక ఎంత కడుక్కున్నా పోదన్నది వాస్తవం. కడుక్కుంటే బురద కనబడకపోవచ్చు కాని దాని తాలూకు కంపు మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది.

బీఆర్ఎస్ సోషల్ మీడియా పేరుతో మంత్రిపైన అసభ్యంగా పోస్టులు వైరల్ అవటం మొదటి తప్పు. పార్టీకి సోషల్ మీడియా ఖాతాలకు సంబంధంలేకపోతే కేటీఆర్ కాని లేదా మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుండాలి. లేదా పార్టీ సోషల్ మీడియానే దానికి కారణం అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కేటీఆర్ బాధ్యతగా వ్యవహరించి సారి చెప్పుంటే సరిపోయేది. అలా చేయకుండా మంత్రి ఏడుపు దొంగ ఏడుపని ఎద్దేవా చేయటంతోనే వివాదం బాగా రాజుకుంది. మొత్తానికి ఎనుబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు దెబ్బతిన్నాయన్నట్లుగా కొండా సురేఖ-కేటీఆర్ వివాదంలో ఎలాంటి సంబంధంలేని సమంత, అక్కినేని ఫ్యామిలి రోడ్డున పడిందన్నది వాస్తవం.

Read More
Next Story