టికెట్ ధరల పెంపుతో బ్లాక్ మార్కెట్ లీగలైజ్ అయ్యిందా ?
x

టికెట్ ధరల పెంపుతో 'బ్లాక్ మార్కెట్' లీగలైజ్ అయ్యిందా ?

ముఖ్యమంత్రి బావమరిది చిత్రం కావడంతో, టికెట్జీ పెంపు వో రాజకీయ రంగు పులుముకుంది.

మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న 'అఖండ 2: తాండవం' చిత్రంపై రాష్ట్రంలో భారీ అంచనాలు ఉన్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి బావమరిది చిత్రం కావడంతో, ఈ జీవో రాజకీయ రంగు పులుముకుంది.

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మంగళవారం జీవోను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 4 రాత్రి ప్రదర్శించబడే ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను ఏకంగా రూ. 600 వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5 నుంచి పది రోజుల పాటు, సినిమా విడుదల తర్వాత, సింగిల్ స్క్రీన్లలో రూ. 75, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 వరకు అదనంగా ధరలు పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించింది. రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి కూడా అనుమతి లభించింది.ఈ ధరల పెంపు నిర్ణయంపై సినీ అభిమానుల్లో, సామాన్య ప్రేక్షకుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అఖండ 2 చిత్రానికి ధరల పెంపుపై వినిపిస్తున్న ప్రధాన అభ్యంతరం ‘ప్రేక్షకుడిపై ఆర్థిక భారం’. అధిక ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకుడికి థియేటర్‌లో వినోదాన్ని దూరం చేస్తాయని ఒక వాదన. సాధారణంగా ఒక కుటుంబం (నలుగురు) సినిమా చూడాలంటే ఇప్పుడు రూ. 1000 వరకు ఖర్చవుతోంది. కొత్త పెంపుతో ఈ ఖర్చు మరింత పెరిగి, సామాన్యుడు థియేటర్‌కు రావడం కష్టమవుతుంది.



సినిమా టికెట్లు అధిక ధరలకు లభించడం వల్ల, ముఖ్యంగా అంతగా ఆదాయం లేని యువత, కళాశాల విద్యార్థులు పైరసీని ఆశ్రయించడానికి మొగ్గు చూపే ప్రమాదం ఉంది. ‘ఇంత ఖర్చు పెట్టే బదులు, తక్కువ ధరకు పైరసీలో చూడొచ్చు’ అని ఆలోచించే అవకాశం ఉంది. ఈ కారణంగా, సినిమా పరిశ్రమకి అతిపెద్ద సవాలు అయిన పైరసీ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ఈ జీవో జారీని సమర్థించే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చిత్రం భారీ నిర్మాణ వ్యయాన్ని, పాన్-ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంటోంది.పెంచిన ఈ ప్రత్యేక ధరలు తొలి పది రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించి, నిర్మాణ పెట్టుబడిని తిరిగి పొందడానికి సహాయపడతాయని సినీ వాణిజ్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం కేవలం ఈ చిత్రానికి ఈ ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం రాజకీయ పక్షపాతం అనే విమర్శలకు కూడా తావిస్తోంది.

ఈ టికెట్ రేట్ల ధరల పెంపు గురించి సినీ విమర్శకులు తమ అభిప్రాయాలను ‘ఫెడరల్ తెలంగాణ’ తో పంచుకున్నారు.

‘టిక్కెట్లు రేట్లు పెంచటం అనేది ప్రొడక్షన్ వైపు చూస్తే తప్పనిసరి చర్యే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో సినిమా వీకెండ్ దాటితే రెవిన్యూ కనపడటం లేదు. ఈలోగా టైమ్ బాగోక నెగిటివ్ టాక్ వస్తే మొదటి రోజు మాట్నీకే జనం ఉండటం లేదు. ఇలాంటి టఫ్ సిట్యువేషన్ లో కోట్లు కుమ్మరించే నిర్మాత కు ఎంతో కొంత సేఫ్ రెవిన్యూ అవసరం అది. స్పెషల్ ప్రీమియర్ షోలు, పెంచిన టిక్కెట్ రేట్లు ఇస్తున్నాయటనంలో సందేహం లేదు. అంతెందుకు ఈ సినిమాకే హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ల ప్రీమియర్‌ల కోసం ₹50 లక్షల రికార్డ్ డీల్ జరిగింది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరగని అరుదైన డీల్ అని చెప్తున్నారు. అంటే కొంతలో కొంత ఖర్చు రికవరీ మొదలైనట్లే.

అలాగే కొన్నిసార్లు టిక్కెట్ రేట్లు పెంచటం అనేది ఎంత ప్లస్ అవుతుందో..అంతే మైనస్ కూడా అవుతుందనేది మర్చిపోకూడదు. సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ఈ పెంచిన టిక్కెట్ రేట్లే భారమనిపిస్తాయి. థియేటర్స్ దగ్గర ఆ మాత్రం కూడా జనం మిగలరు. ఇది ఎన్నో సార్లు జరిగిన విషయం. అంటే ఈ టిక్కెట్ పెంచటమనే నిర్ణయం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. అలాంటప్పుడు ఆ రిస్క్ నిర్మాత చేస్తున్నాడంటే ఖచ్చితంగా అతని వైపు నుంచి ఆలోచించాలి.

ఇక చాలా మంది అనొచ్చు..సినిమా మీద నమ్మకం లేకే టిక్కెట్ రేట్లు పెంచి కొద్ది రోజుల్లో ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుందామని నిర్మాత ఆలోచన అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సినిమా బాగోపోతే ప్రీగా టిక్కెట్ ఇచ్చినా జనం సినిమాలకు వెళ్లరు. అలాగే టిక్కెట్ రేటు పెంచినంత మాత్రాన జనం చూడటమూ మానరు. అయితే మొదట రోజు చూడాలా, పదో రోజు చూడాలా అనే డెసిషన్ మాత్రం మారుతుంది.’

-సూర్యప్రకాష్ జోస్యుల, సినీ రచయిత

ఈ విషయం గురించి సినీ విమర్శకులు ప్రసేన్ మాట్లాడుతూ,

‘టికెట్ రేట్లు పెంచడం అన్నది అభిమానులను దోచుకునే ఒక సహజమైన ప్రక్రియ. ఇది అందరు అభిమానులకి వర్తించదు.డబ్బులున్న బాలకృష్ణ అభిమానులు మాత్రమే రేపు థియేటర్ లో అంత రేటు పెట్టి చూడగలడు,మరి డబ్బు లేని అభిమానుల మాటేంటి ?సినిమా టికెట్ రేట్లు పెంచే హక్కు ఆ సినిమా వర్గానికి ఉంది, అలాగే ప్రేక్షకులకు నచ్చకపోతే చూడకుండా ఉండే హక్కు ఉండొచ్చు. కానీ ఇంత ఖరీదైన సినిమాలను పాన్ ఇండియా పేరుతో తీయడం అవసరమా ? ఒక మంచి సినిమా, ఫీల్ గుడ్ సినిమా తీసే అవకాశం లేదా? ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళను ప్రేక్షకులు తప్పు పట్టకుండా ఉంటున్నారంటే ఇది కూడా కారణమే కదా. ఇకపోతే ఇప్పుడు థియేటర్ ఎక్స్ పీరియన్స్ అనేది ఒక ట్రాష్. దాని బదులు టెక్నాలజీ అనుసంధానంతో ఒక టైంకి ఒక వందరుపాయలు ధరగా పెట్టి ఒకే సమయం ఇచ్చి మన ఇంట్లో నుండే మన టివిలో సినిమా చూసే ఏర్పాటు చేసినా జనాలు ఆమోదిస్తారు’,అన్నారు.

దీని గురించి సినీ విమర్శకులు వంశీ కృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ,

‘ఒకప్పుడు బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఉండేది. ప్రభుత్వం దాన్ని తీసేసి ఇప్పుడు తానే ఇలా ధరలు పెంచి అదే పనిని జీవోలు జారీ చేసి మరి చేస్తుంది. ఒక రైతుకి తన పంటకి ఒక ధర నిర్ణయించుకునే స్వేచ్చ ఉండదు కానీ ఒక పెద్ద సినిమా పేరుతో ఇష్టానుసారంగా ధరలు పెంచుకునే స్వేచ్చ మాత్రం సినీ వర్గాలకు ఉంటుంది’,అన్నారు.

‘అఖండ-2’ టికెట్ రేట్ల ధరల పెంపును సిపిఐ నాయకులు నారాయణ కూడా వ్యతిరేకించారు. ఆయన దీని గురించి మాట్లాడుతూ, ‘ఐ బొమ్మ రవి లాంటి వారిని ప్రజలు ఆమోదించడానికి కారణం ఇటువంటి చర్యలే అని, ఇలా టికెట్ రేట్లు పెంచుతూ,రవిని అరెస్ట్ చేసే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదని’,అన్నారు.

‘అఖండ -2’ చిత్రం కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా టికెట్ ధరల పెంపు అనేది కేవలం ఆర్థిక అంశమే కాకుండా, సామాజిక - నైతిక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ఒకవైపు, ఈ ప్రత్యేక మినహాయింపు చిత్రానికి భారీ ఆదాయాన్ని సమకూర్చి, నిర్మాణ వ్యయాన్ని త్వరగా రాబట్టుకోవడానికి సహాయపడవచ్చు. అయితే, మరోవైపు, టికెట్ ధరలు అమాంతం పెరగడం వల్ల సామాన్య ప్రేక్షకుడిపై భారం పడి, వారు థియేటర్లకు దూరం కావడం, చివరికి సులభంగా లభించే పైరసీని ఆశ్రయించడం వంటి పరిణామాలు జరిగే ప్రమాదం ఉంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మేలు చేస్తున్నామనే వాదన వినిపిస్తున్నప్పటికీ, ఒకవైపు రాజకీయ పక్షపాతం ,మరోవైపు ప్రజల మీద భారం అనే విమర్శలకు తావివ్వడం వలన, దీర్ఘకాలంలో ఈ విధానం చిత్ర పరిశ్రమను ,ప్రేక్షకుడి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.

* * *

Read More
Next Story