పోలీసులు బెదిరించారా? ఒత్తిడి చేశారా? మావోయిస్టులను కోర్టు ఆరా
x

పోలీసులు బెదిరించారా? ఒత్తిడి చేశారా? మావోయిస్టులను కోర్టు ఆరా

ఏలూరులో అరెస్టైన 15 మంది మావోయిస్టులకు 14 రోజుల రిమాండ్ విధించారు.


పోలీసులు ఎవరైనా బెదిరించారా? ఏదైనా ఒత్తిడి చేశారా? అని మావోయిస్టులను ఏలూరు మొబైల్ కోర్టు ప్రశ్నించింది. ఏలూరు జిల్లా గ్రీన్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం పట్టుబడిన 15 మంది మావోయిస్టులను మొబైల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఒక్కొక్క నిందితుడిని విడివిడిగా పిలిచి విచారించారు. న్యాయమూర్తి ప్రతి నిందితుడినీ పేరు, తండ్రి పేరు, స్థలం, వయసు వంటి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. అనంతరం “పోలీసులు మిమ్మల్ని బెదిరించారా? ఏదైనా ఒత్తిడి చేశారా?” అని నేరుగా ప్రశ్నించారు. నిందితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ 15 మందిలో హిడ్మా దళానికి చెందిన 11 మంది సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా నలుగురు కూడా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టు క్యాడర్‌కు చెందినవారే. వీరంతా ఏలూరులో దాక్కుని పార్టీ పునర్వ్యవస్థీకరణ పనులు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రిమాండ్ ఆదేశాల అనంతరం భారీ భద్రతా మధ్య నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ అరెస్టులతో ఏలూరు నగరంలో మావోయిస్టులు రెండోసారి గుట్టు రట్టయిన సంఘటనగా మారింది. మరో వైపు గత 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 50 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు కావడం, హిడ్మా సహా ఆరుగురు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో రాష్ట్రంలో మావోయిస్టు నెట్‌వర్క్‌కు భారీ దెబ్బ పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Read More
Next Story