చైతన్య, సమంత ఇరకాటంలో పడ్డారా ?
రాజకీయాలకు అనర్హమంటు ఏమీలేదు. తమ అవసరాల కోసం రాజకీయనేతలు దేన్నైనా రాజకీయంలోకి లాగేయగలరని మరోసారి నిరూపితమైంది.
రాజకీయాలకు అనర్హమంటు ఏమీలేదు. తమ అవసరాల కోసం రాజకీయనేతలు దేన్నైనా రాజకీయంలోకి లాగేయగలరని మరోసారి నిరూపితమైంది. విషయం ఏమిటంటే మంత్రి కొండాసురేఖకు బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగానికి వివాదం నడుస్తోంది. బీజేపీ ఎంపీ రఘునందనరావు ఒక కార్యక్రమంలో మంత్రి మెడలో నూలుదండ వేశారు. దాన్ని పట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారన్నది కొండా అభియోగం. మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించి భోరభోరున ఏడ్చేశారు.
ఇదే విషయమై తర్వాత ఎప్పుడో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీష్ రావు స్పందిస్తు మహిళలపై అసభ్యంగా ట్రోలింగ్ చేయటాన్ని ఖండించారు. అంతేకాని కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుగా ట్రోలింగ్ చేశారని హరీష్ అంగీకరించలేదు. అయినా సరే కొండా మీద జరిగిన ట్రోలింగ్ ను తప్పుపట్టారు, ఖండించారు కాబట్టి వివాదం అక్కడితో ముగిసిందనే అంతా అనుకున్నారు. అయితే ఉరుములేని పిడుగులాగ బుధవారం కొండా సురేఖ మాట్లాడుతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.
నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని పెద్ద బాంబు పేల్చారు. వాళ్ళ విడాకులకు కేటీఆర్ ఏ విధంగా కారణమో చెప్పలేదు కాని చాలామంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడంటు మండిపడ్డారు. తాను డ్రగ్స్ తీసుకోవటంతో పాటు ఎంతోమంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటుచేసింది కూడా కేటీఆరే అన్నారు. చాలామంది హీరోయిన్లు వివాహం చేసుకుని సినిమా ఫీల్డులో నుండి తప్పుకోవటానికి కూడా కేటీఆరే కారణమన్నారు. హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపించారు. కేటీఆర్ వ్యవహారం సినిమా ఫీల్డులో అందరికీ తెలుసన్నారు. ఇపుడు విషయం ఏమిటంటే నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ బహిరంగంగా చెప్పటంతో అనివార్యంగా విడాకులు తీసుకున్న వాళ్ళు స్పందించక తప్పనిస్ధితి ఏర్పడింది.
తమ విడాకులకు కేటీఆర్ కు సంబంధం ఉందో లేదో చెప్పాల్సిన బాధ్యత ఇపుడు నాగచైతన్య, సమంతలపైన పడింది. నాగచైతన్య, సమంతలు స్పందించకపోతే కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిజమని జనాలు నమ్మే అవకాశాలున్నాయి. ఒకవేళ విడాకులపై స్పందిస్తే అది ఇంకో కంపు అవుతుంది. విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య, సమంత ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఎవరి సినిమాలు, వెబ్ సీరిసుల్లో బిజీగా ఉన్న వీళ్ళ వ్యవహారాన్ని రాజకీయం రోడ్డున పడేసినట్లయ్యింది. కొండా సురేఖ చేసిన బహిరంగ ఆరోపణ కారణంగా చైతన్య, సమంత ఇరుకునపడ్డట్లుగా అయ్యింది. ఇదంతా కొండా ఎందుకు చేశారంటే తనపై ట్రోలింగ్ జరిగినపుడు కేటీఆర్ స్పందించలేదని.