‘విజయవాడలో పట్టుకుని మారేడుమిల్లిలో కాల్చి చంపేశారు’
x
Maoist leader Madvi Hidma

‘విజయవాడలో పట్టుకుని మారేడుమిల్లిలో కాల్చి చంపేశారు’

నవంబర్ 15వ తేదీన నిరాయుధంగా పట్టుకుని క్రూరంగా హత్యచేసి మారేడుమిల్లి(Maredumilli encounter) ఎన్ కౌంటర్లో చంపేసినట్లు కట్టుకథలు అల్లారని అభయ్ ఆరోపించారు.


కేంద్రకమిటిసభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటి సభ్యుడు మాడ్వీ హిడ్మాను పోలీసులు పట్టుకుని చంపేసి మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్లో చంపేసినట్లు చెప్పారా ? మావోయిస్టు(Maoist party) పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆరోపణలతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అభయ్ పేరుతో శుక్రవారం మీడియా ప్రకటన రిలీజ్ అయ్యింది. లేఖపైన 20వ తేదీ ఉన్నప్పటికీ మీడియాకు అందింది మాత్రం 21వ తేదీ, శుక్రవారమే. ఆ లేఖలో ఏముందంటే హిడ్మా(Madvi Hidma)తో పాటు మరికొందరిని పోలీసులు విజయవాడ(Vijayawada)లో నవంబర్ 15వ తేదీన నిరాయుధంగా ఉన్నపుడు పట్టుకుని క్రూరంగా హత్యచేసి మారేడుమిల్లి(Maredumilli encounter) ఎన్ కౌంటర్లో చంపేసినట్లు కట్టుకథలు అల్లారని అభయ్ ఆరోపించారు.

ఏవోబీ రాష్ట్రకమిటి సభ్యుడు కామ్రేడ్ శంకర్ తో పాటు మరికొంతమందిని పట్టుకుని హత్యచేసి రంపచోడవరం ఏరియాలో ఎన్ కౌంటర్ జరిగినట్లు కట్టుకథను అల్లారని అభయ్ మండిపోయారు. క్రూర హత్యలకు వ్యతిరేకంగా నవంబర్ 23వ తేదీ దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపిచ్చారు. హిడ్మా, తన సహచరి రాజేతో పాటు కొద్దిమంది వ్యక్తులతో చికిత్సనిమిత్తం విజయవాడకు వెళ్ళారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరుచేసిన ద్రోహంవల్ల స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోంశాఖ డైరెక్షన్లో ఆంధ్ర ఏవోబీ నవంబర్ 15వ తేదీన వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవటంలో పోలీసులు విఫలమై క్రూరంగా హత్యచేసినట్లు అధికార ప్రతినిధి ఆరోపించారు. మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం అంతా అబద్ధమని అభయ్ తేల్చేశారు.

ఉద్యమంలో కొనసాగి, శతృవుకు తలవంచకుండా ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ రాజేకు సీపీఐ(మావోయిస్టు)పార్టీ శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నట్లు చెప్పారు. వీరితో పాటు కిమ్రేడ్లు చైతు, కమ్లూ, మల్లాల్, దేవే కూడా కర్తవ్య నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అభయ్ వివరించారు.

హిడ్మా చరిత్ర

అభయ్ లేఖలోని వివరాల ప్రకారం మాడ్వీ హిడ్మా ఛత్తీస్ గఢ, సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో 1974లో ఆదివాసీ కుటుంబంలో పుట్టాడు. 5వ తరగతి వరకు చదువుకున్న తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉద్యమ ప్రభావంతో హిడ్మా మావోయిస్టు పార్టీవైపు ఆకర్షితుడయ్యాడు. 1997, డిసెంబర్లో కార్యకర్తగా చేరి 1998 చివరివరకు బాసుగూడ దళంలో పనిచేశాడు. 1999లో గడ్చీరోలీలో పనిచేసి తర్వాత ఏడాది పాటు దండకారణ్యంలో ఆయుధ తయారీ విభాగంలో పనిచేశాడు. 2001లో ఏరియా కమిటి సభ్యుడిగా దక్షిణ బస్తర్ కు వచ్చాడు. 2002లో ఊసుర్ ఎల్వోఎస్ కమాండర్ గానే కాకుండ కొంతకాలం కుంట ఎల్వోఎస్ కమాండరుగా కూడా పనిచేశాడు. 2005లో డివిజనల్ కమిటీ సభ్యుడయ్యాడు. తర్వాత కంపెనీ-2లో పీఎల్ కమాండర్ గా పనిచేశాడు. 2006 నుండి 2009 వరకు కంపెనీ-3 కమాండర్ గా, కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 2009లో బెటాలియన్ ఏర్పడినప్పటి నుండి బెటాలియన్ కమాండురుగానే పనిచేశాడు. 2011లో బీఎన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటి సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2020లో సెక్రటేరియట్ సభ్యుడయ్యాడు. 2024 ఆగస్టులో ఎస్ జెడ్ సీ కార్యదర్శిగా, కేంద్రకమిటీ సభ్యుడిగా ప్రమోటయ్యాడు.

హిడ్మా మొదటినుండి ప్రజల్లో పనిచేస్తు, ప్రజల నుండి నేర్చుకుంటు ఎదిగాడు. ఉద్యమ అభివృద్ది క్రమంలో ఉద్యమ అవసరాల కోసం అనేక విషయాలు నేర్చుకున్నట్లు అభయ్ చెప్పాడు. ఉద్యమక్రమంలో ఆయా సందర్భాల్లో ఎన్నో సర్క్యులర్లను, బుక్ లెట్లను రాసి క్యాడర్ అభివృద్ధికి సిద్ధాంతపరంగా కృషిచేశాడు. మిలిటరీ రంగంలో విశేష అద్యయనంచేసి, ఆచరణలో మెరుగైన ఫలితాలను సాధించాడు. ఎన్నో మిలిటరీ చర్యలకు మెరుగైన పథకాలు రచించి, వాటిని విజయవంతం చేశాడు. ఈక్రమంలో శతృ బలగాల నుండి వందలాది ఆయుధాలను స్వాధీనంచేసుకుని పీఎల్జీఏను సాయుధంగా బలోపేతం చేశాడు.



పాలకవర్గ మీడియా, గోదీ మేథావులు ఎంతోకాలంగా హిడ్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరణ చేసినట్లు అభయ్ మండిపడ్డారు. హత్యచేసిన తర్వాత నేడు ఆ విష, అసత్య ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మనువాదుల ఆజమాయిషీలో మరింత పెట్రేగిపోతున్నట్లు ఆరోపించారు. ఎవరెన్ని దుష్పచారాలు చేసినా ప్రజల మనస్సుల్లో హిడ్మా స్ధానం చెరిగిపోనిదిగా అభయ్ వర్ణించారు. భగవ్ సింగ్, కొమురంభీం, గూండాదూర్, గేంద్ సింగ్, అల్లూరి సీతారామరాజు చరిత్రలాగానే హిడ్మా చరిత్ర కూడా భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్రవేస్తుందన్నారు. హిడ్మా కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదని, పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాడని అభయ్ పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు దేశ సంపదను, ప్రకృతి వనరులను అభివృద్ది పేరుతో కార్పొరేట్లకు అప్పజెబుతారని అభయ్ చెప్పారు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతాయని జోస్యంచెప్పారు. ఆ పోరాటాలను ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు దుర్మార్గంగా విచ్చిన్నంచేయటం, పక్కదారి పట్టించి, అణిచివేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ సంస్ధలన్నింటినీ కార్పొరేట్లు తమగుప్పిట్లో పెట్టుకున్నట్లు అధికార ప్రతినిధి ఆరోపించారు. పూటకొక నినాదం, రోజుకొక పథకాన్ని ప్రకటిస్తు ప్రజలను మోసంచేస్తున్నట్లు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మోదీకి గోది కమిషన్ గా మారిపోయిందని ఎద్దేవాచేశారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని బీహార్ ఎన్నికల్లో భారీ మోసం చేసి విజయంసాధించినట్లు అభయ్ ఆరోపించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలను నిర్మూలించి బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్ధను ధ్వంసం చేయాలనే పథకాన్ని అమలుచేస్తున్నట్లు వివరించారు.

మావోయిస్టుపార్టీ నాయకుడైన హిడ్మా వంటి సాహసోపేతులైన యుద్ధసేనాల చరిత్రను చూసి, ప్రేరణపొంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదలకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటు, అంతిమంగా దోపిడీ వ్యవస్ధ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులు, రైతాంగం, యువత, విద్యార్ధులతో పాటు సామాజికవర్గాలకు అభయ్ పిలుపిచ్చారు.

Read More
Next Story