పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీలో దుమారం? బాబును ఇబ్బంది పెట్టడానికేనా?
పవన్ కల్యాణ్ ప్రతిపక్ష వైసీపీకి అస్త్రం అందించారా? లేక చంద్రబాబును ఇరుకున పెట్టారా? హోంమంత్రి అనితకి ఇచ్చిన వార్నింగ్ దేనికి సంకేతం. ఇప్పుడిదే హాట్ టాపిక్..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి పాలనపై ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీయే కాదు భాగస్వామ్య పక్షమైన జనసేన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ సంకేతాలనే ఇస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు దారుణంగా క్షీణించాయంటూనే అవసరమైతే హోం మంత్రిత్వ శాఖనూ తానే తీసుకుంటానని హెచ్చరిక చేశారు. దీనర్థం ప్రస్తుత హోం మంత్రి అనిత సరిగా పని చేయడం లేదనే సంకేతంతో పాటు చంద్రబాబుకూ పరోక్ష హెచ్చరిక చేసినట్టయింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ దుమారం చెలరేగింది. అసలింతకీ పవన్ మనసులో ఏముందీ? హోంమంత్రి పదవి చేపట్టాలనేదా లేక రాష్ట్రంలో శాంతిభద్రతలను చక్కదిద్ది పాలనను గాడిలో పెట్టాలన్నదా?
అసలేం జరిగిందంటే..
తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని గొల్లప్రోలులో అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన ఫార్మా పరిశ్రమలతో కాలుష్యం, పిల్లలపై లైంగికదాడుల గురించి ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను ప్రత్యేక దృష్టిసారించాం. అయినప్పటికీ కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదు. నిజాయితీగా పనిచేయాలని చెబితే మీనమేషాలు లెక్కిస్తున్నారు. మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకుని వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మీరందరూ ఐపీఎస్ లు కాదా, మీకు భారతీయ నేర శిక్షా స్మృతి తెలియదా? ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకు? మా సహనానికీ ఓ హద్దు ఉంటుంది. నేను ప్రస్తుత హోం మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా.. నేను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది’ అని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో మంటలు పుట్టించిన పవన్ వ్యాఖ్యలు..
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో మంటలు పుట్టిస్తున్నాయి. "పవన్ కళ్యాణ్ ఎవరు?" తమను హెచ్చరించేందుకని టీడీపీ మంత్రులు కొందరు రుసరుసలాడుతున్నారు. కొందరైతే "ఆయన కూడా తమలాగా ఓ మంత్రే. ఆయన మిమ్మల్ని హెచ్చరించేదేమిటీ?" అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏదో "ఫ్రస్టేషన్" ఉండి ఉంటారని, అందుకే అలా మాట్లాడి ఉంటారన్న వెటకారపు వ్యాఖ్యలూ వినవచ్చాయి.
అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మరో మంత్రి నారాయణ మాత్రం "పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి. ఆయన కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులను అదుపు చేసే అధికారం ఉంటుంది. ఆ తీరులోనే మంత్రి అనితను హెచ్చరించి ఉంటారు" అన్నారు. ఇదొక విధంగా డామేజీ కంట్రోల్ లో భాగమే అయినా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటున్న విపక్ష వైసీపీ వాదనకు మద్దతు లభించినట్టయింది.
వైసీపీ వాదనకు మద్దతు వచ్చినట్టేనా?
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలోనే మహిళలు, బాలికలు సహా ఇప్పటికే 58 మంది హత్యలకు గురయ్యారంటూ వైసీపీ ఆరోపించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ధర్నా చేసి వచ్చింది. మూడ్రోజుల కిందట తిరుపతిలో ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం సంఘటన అన్ని రాజకీయ పక్షాలను విస్మయానికి గురి చేసింది. ఈ సందర్భంగా కూడా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. హోం మంత్రి పని తీరు సరిగా లేకపోవడం వల్లే రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న విమర్శలు వచ్చాయి.
చంద్రబాబును కాకుండా ఆదిత్యనాథ్ యోగీ ప్రస్తావన ఎందుకు?
సరిగ్గా అదే సమయంలో పవన్ కల్యాణ్ హోంమంత్రి అనిత ప్రస్తావన తెచ్చారు. ‘ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా వ్యవహరిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది. డీజీపీ ఇంటిలెజెన్స్ అధికారులు బయటకు రావడం లేదు. ప్రజలేమో మమ్మల్ని తిడుతున్నారు. క్రిమినల్స్‌ను అరెస్టు చేయడానికి అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదు. నాకు డిప్యూటీ సీఎం పదవి, ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వసతి గృహాల్లో ఉండే అమ్మాయిలను కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఎంతమంది కూటమి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. ఇసుకలో ఎంత వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు తప్ప ఇలాంటి వాటిపై దృష్టిసారించడం లేదు’ అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే ఆయన రాష్ట్రంలో ఇసుక, మద్యం జరుగుతున్న అవినీతినీ ప్రస్తావించారు.
రాజకీయాలలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుణ్ణి కాదని ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ఎందుకు పొగిడారు అనేది కీలకంగా ఉంది. ఆదిత్యనాథ్ మాదిరి పవన్ కల్యాణ్ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారా లేక ఆ టార్గెట్ దిశగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా అనేది అంతుచిక్కకుండా ఉందని వైసీపీలో మంత్రిగా పని చేసిన ఓ కాపు నాయకుడు చెప్పారు.
వైసీపీ చెప్పిందే నిజమైందా?
పవన్ కల్యాణ్ కి ఇప్పుడు తెలిసి ఉండవచ్చునేమో గాని తమ పార్టీ ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరూ ఫెయిల్ అయ్యారని చెబుతోందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ నైతిక బాధ్యత వహించాలన్నారు. ‘‘శాంతి భద్రతల వైఫల్యానికి హోం మంత్రి కారణమని వైఎస్సార్‌సీపీ మొదట్నుంచీ చెప్తోంది. ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఇంతవరకు దొరకలేదు. ఏపీలో రోజుకో చోట మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయి. హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగింది. కనీసం హోంమంత్రి బాధితురాళ్లను పరామర్శించటం లేదు. అత్యాచార ఘటనలపై హోం మంత్రి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీలో మహిళలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవటం లేదు. కానీ, హోంమంత్రి అనిత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పిఠాపురంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే.. పవన్ భరోసా ఎందకివ్వలేదు? పంతం నానాజీ అనుచరుల వేధింపులతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్ చేసుకుంది. మరి ఆ బాధితులకు పవన్ ఎందుకు భరోసా ఇవ్వ లేదు?’’అని ఆమె ప్రశ్నించారు.
అవినీతినీ దునుమాడిన పవన్...
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అవినీతి మాత్రం యథేచ్ఛగానే సాగుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే ఇప్పటికి అనేక సార్లు తమ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను హెచ్చరించారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లవద్దన్నా వాళ్లు వినిపించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో పవన్ సూటిగానే ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించారు.
"ఇసుక బ్లాక్ మార్కెట్ జరుగుతుంటే ఎదురు తిరగాలని ప్రజలకు పిలుపునిచ్చా. అందరికీ తినడం అలవాటైపోయింది. దాన్ని మార్చడానికి సీఎం చంద్రబాబు, నేను ప్రయత్నిస్తున్నాం. మీ సొంత అవసరాలకు ఇసుక కావాలంటే బండి లేదా ట్రాక్టర్ తీసుకువచ్చి ఉచితంగా తీసుకువెళ్లండి. అంతేతప్ప జనాన్ని దోచుకోవాలని చూడకండి" అన్నారు పవన్ కల్యాణ్. దీనిపై సీనియర్ జర్నలిస్టు కె.రామకృష్ణ వ్యాఖ్యానిస్తూ- చంద్రబాబు చక్కదిద్దే పరిస్థితిలో లేరని, తాను వస్తే కొరఢా ఝుళిపిస్తానన్నదే అర్థం అని అభిప్రాయపడ్డారు. అయితే అదంత తేలిక కాదు. టీడీపీ బలమైన పార్టీ. ఇప్పటికిప్పుడు ఏమీ జరక్కపోవచ్చు గాని చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నది మాత్రం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. సంబంధిత మంత్రులు బాధ్యతాయుతంగా మెలగాలన్న సూచన కూడా పవన్ వ్యాఖ్యల్లో ఉంది. చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
పవన్ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేకపోయినా చంద్రబాబు ఇంకా చురుగ్గా వ్యవహరించాలన్న సంకేతాలైతే ఇచ్చారు. దీన్ని టీడీపీ అధినేత ఎంత వరకు సానుకూలంగా తీసుకుంటారో, ఆయన పార్టీ శ్రేణులు ఎంత ఘాటుగా స్పందిస్తాయో మున్ముందు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం విపక్షమైన వైసీపీకి మంచి అస్త్రాన్నే పవన్ కల్యాణ్ అందించారు.
Next Story