ఎన్టీఆర్ ను నాదెండ్ల నిజంగానే 'వెన్నుపోటు' పొడిచారా? అసలేం జరిగిందీ?
ప్రముఖ సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన అన్న నందమూరి తారక రామారావు ఎలియాస్ ఎన్టీఆర్ మరణించి 2025 జనవరి 18 నాటికి సరిగ్గా 29 ఏళ్లు.
ప్రముఖ సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన అన్న నందమూరి తారక రామారావు ఎలియాస్ ఎన్టీఆర్ (NTR) మరణించి 2025 జనవరి 18 నాటికి సరిగ్గా 29 ఏళ్లు. తెలుగు జాతి ఆత్మ గౌరవం పేరిట 42 ఏళ్ల కిందట 1982లో తెలుగుదేశ పార్టీ (TDP)ని స్థాపించి 9 నెలల కాలంలోనే 1983లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించారు. ఆయన మరణించే నాటికి కాంగ్రెస్ ను మాడు సార్లు ఓడించి అధికారంలోకి వచ్చారు. మూడు మార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయనను రెండు మార్లు ముఖ్యమంత్రి పదవి నుంచి దించారు. మొదటి తొలగింపును వెన్నుపోటు అన్నారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది తిరక్కమునుపే ఆయన్ను సీఎం పోస్టు నుంచి దించారు.
దానికి ఆవేళ నాయకత్వ వహించింది నాదెండ్ల భాస్కరరావు. ఆయన చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి. ఇక, రెండవ తొలగింపునకు నాయకత్వం వహించింది చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఈ తొలగింపు జరిగింది. ఎన్టీఆర్ లేటు వయసులో పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి చేతుల్లోకి టీడీపీ పోకుండా ఉండేందుకు చంద్రబాబు నాయకత్వంలో ఈ తొలగింపు జరిగిందనేది ఈ ప్రచారం అర్థం. రెండోసారి అధికారం పోయాక తీవ్ర మానసిక క్షోభతో మరణించారని ఎన్టీఆర్ అనుయాయులు కొందరు చెబుతుంటారు. ఆయన కడుపున పుట్టిన వారెవ్వరూ TDPకి నాయకత్వం వహించలేకపోయారు. ఆయన రెండో అల్లుడు చంద్రబాబు మాత్రమే ఎన్టీఆర్ పెట్టిన టీటీడీకి నాయకుడు కాగలిగారు. రాష్ట్ర విభజనకి ముందు ఆ తర్వాత కూడా టీడీపీని అధికారంలోకి తీసుకురాగలిగారు.
తొలిసారి ఎన్టీఆర్‌ను తొలగించినపుడు...
తొలిసారి 1984లో ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి తొలగించారు. అప్పుడు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా పని చేసిన నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండలేదు. 1984 ఆగస్టు 16న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన నాదెండ్ల భాస్కరరావు సెప్టెంబర్ 16న రాజీనామా చేశారు. ఆనాడు ఏమి జరిగిందనే దాన్ని నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskar rao 'నా జీవిత ప్రస్థానం' అనే పుస్తకంలో సవివరంగా రాశారు.
ఆయన ఏమి రాశారో అది ‘ది ఫెడరల్’ పాఠకుల కోసం యధాతథంగా...
1984 ఆగస్టు 14వ తేదీ.. ఎన్టీ రామారావు తన మంత్రివర్గం నుంచి నాదెండ్ల భాస్కర్ రావు తొలగించమని కోరుతూ గవర్నర్ కి లేఖ రాశారు. ఆ విషయం అదే రోజు సాయంత్రం భాస్కరరావు తెలిసింది. ఆయన మిత్రుడొకరు గవర్నర్ బంగ్లా నుంచి ఫోన్ చేసి "ఎన్టీ రామారావు మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తొలగించమని గవర్నర్ కి లేఖ రాశారు. కాలం కలిసి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన ఆ నటుడు మిమ్మల్ని క్యాబినెట్ నుంచి తీసేయడమేమిటి ? పార్టీ పెట్టిందే మీరు కదా! అని అన్నారు.
ఆ విషయం తెలిసి నేను (నాదెండ్ల భాస్కర్ రావు) మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తూ లేఖ రాశా. భాస్కరరావును మంత్రివర్గం నుండి తొలగిస్తున్నట్టుగా ఎన్టీఆర్ రాసిన లేఖ, మంత్రిగా నేను రాజీనామా చేస్తున్న లేఖ- ఇవి రెండు- గవర్నర్ ముందున్నాయి.
ఇది జరిగిన గంటలోపే మరో ముగ్గురు మంత్రులు కూడా గవర్నర్ కి, ముఖ్యమంత్రి కి తమ రాజీనామా లేఖలు పంపారు. అలా రాజీనామా చేసిన వారిలో రామముని రెడ్డి, ముత్యాల సత్యనారాయణ, జీవన్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కూడా తన రాజీనామా సమర్పించారు.
జరుగుతున్న పరిణామాలకు నేను (నాదెండ్ల భాస్కర్ రావు) శాసనసభ్యుల వద్దకి వెళ్ళలేదు. వారికి ఎలాంటి సూచనలు కూడా లేవు. ఎలాంటి అభ్యర్థనలు కూడా లేవు. తామంతట తామే వచ్చి 'మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తీసేయడమేమిటి? మంత్రివర్గం నుంచి మిమ్మల్ని తొలగించాలనుకోవడం పిరికి వాడి చర్య! మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ వెంటే మేముంటాం' అని ఆ రాత్రికి రాత్రి 90 మంది ఎమ్మెల్యేలు ఎన్టీ రామారావుకి మద్దతు ఒకరు ఉపసంహరించుకుంటూ సంతకాలు చేశారు. నేను (భాస్కర్ రావు) సంతకం చేస్తే 91మంది.
తత్తరపడిన ఎన్టీఆర్ బృందం...
జరుగుతున్నదానికి రామారావు బృందం తత్తర పడి ఇదేమిటీ ఎలా జరిగిందని ఆలోచనలో పడిపోయారు. భాస్కర్ రావు ను క్యాబినెట్ నుంచి తొలగిస్తే అతని వెనుక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా ఆయన సపోర్ట్ చేసే వారు ఎవరు ఉండరని, అంతా తమవైపే ఉంటారని చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కు పురి ఎక్కించి చెప్పి ఉంచారు.
ఈ విషయం ఎన్టీ రామారావు తన మిత్రులతో ఇలా జరిగింది ఏమిటీ? భాస్కరరావును తొలగిస్తే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పితే ఎవరు సపోర్ట్ చేయరని చెప్పాడే చంద్రబాబు నాయుడు? మరి ఇదేమిటి? 90 మంది ఎమ్మెల్యేలు భాస్కరరావును సమర్ధించడమేంటి ? చంద్రబాబు నాయుడు చెప్పిన విషయానికి ప్రత్యక్షంగా జరుగుతున్న విషయానికీ పొంతన లేకపోవడంతో ఆ క్షణంలో ఎన్టీ రామారావు... అల్లుడని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు పై ఎంతగానో అరిచాడని, అసహ్యించుకున్నాడని విన్నాను కూడా.
పరిస్థితి తెలిసిన చంద్రబాబు నాయుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు ఎమ్మెల్యేలను తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలు కొందరు చంద్రబాబు నాయుడుకు దేహశుద్ధి చేసి పంపించారని కూడా విన్నాను. నాతో పాటు సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలంతా మర్నాడు పొద్దున్నే గవర్నర్ రాంలాల్ ని కలవడానికి సిద్ధపడి నా వద్దకు వచ్చారు. రామ్ లాల్ ఉదయం 8.30 గంటలు 9 గంటల మధ్య అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము గవర్నర్ కి ఒకే ఒక మాట చెప్పాం. ముఖ్యమంత్రి రామారావుకు మా శాసనసభ్యుల మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని మాత్రమే.
పాత్రికేయులందరూ అక్కడే...
అప్పుడు అక్కడ పాత్రికేయులు ఎంతోమంది ఉన్నారు. నా వెంట ఉన్న వారు శాసనసభ్యులు అవునా? కాదా? అని గుర్తించి చెప్పడానికి శాసనసభ సచివాలయ కార్యదర్శి ఉన్నారు. ఎవరెవరు వచ్చింది? ఎంతమంది వచ్చింది? అందరినీ గవర్నర్ చూశారు. అయితే అక్కడ ఉన్న నాతో పాటు 91 మంది ఎమ్మెల్యేలు అవునా కాదా అని ఎవరు వెరిఫై చేయలేదు. సంతకాలు చేసిన 90 మంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి తాలూకు మనుషులు, వారి అన్న మనుషులు. అప్పటి వరకూ మా వద్ద ఉండి తిరిగి ఎన్టీ రామారావు క్యాంపులో చేరారు. అయినా మేము 91 మంది సంతకాలతో ఉన్న వినతి పత్రాన్ని గవర్నర్ కి సమర్పించాం.
ఇక్కడ సంతకం చేసిన వారిలో రామారావు క్యాబినెట్లలోనూ, చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లోను మంత్రివర్గ సభ్యులుగా ఉండి పని చేసిన వారున్నారు. ఇదీ సంగతి. వీరిని గురించి ఏం చెప్పను? ఇవి వాళ్ళ మోరల్స్. ఇది వాళ్ళ క్యారెక్టర్. వారికి ఏం కమిట్మెంట్ ఉంది? ఈ రాష్ట్రం పైన వారికి శ్రద్ధ మటుకు ఏముంటుంది? పదవుల కోసం అటు ఇటు ఊగిసలాడిన వారికి ముఖ్యంగా ఇటువంటి వారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం మటుకు ఏమి ఉంటుంది? మనశుద్ధి లేని నీతి భాహ్యమైన మనుషులు.
గవర్నర్ చేసిన ఆలస్యంతో...
ఇక విషయానికొస్తే, మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన రోజే మాకు ప్రభుత్వాన్ని అప్పగించి ఉంటే చరిత్ర మరోలా ఉండేది. గవర్నర్ ఆలస్యం చేసిన కారణంగా ఎమ్మెల్యేలు అంతా భయపడిపోయారు. అప్పటికి ఇంకా ఎన్టీ రామారావు ప్రభుత్వ అధినేత గానే ఉన్నారు. తెల్లవారితే ఆగస్టు 15వ తారీకు. ఉదయం మేము గవర్నర్ కు మెమోరాండం అన్నం ఇచ్చాం. 15వ తేదీ సాయంత్రం ఢిల్లీ ఆగంతకుడు ఎన్టీ రామారావును బలపరుస్తున్న 50 మంది ఎమ్మెల్యేలు గవర్నమెంట్ కలవడానికి టైం అడిగారు. గవర్నరు వాళ్లను చూడనేలేదు. చూసి ఉండవలసింది.
చూసుంటే ఎన్టీ రామారావును సమర్థిస్తూ వారి వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నది అప్పుడే తెలిసిపోయేది. అదే జరిగుంటే నన్ను 30 రోజుల్లో బలనిరూపణ చేసుకోమనే కండిషన్ పెట్టి ఉండేవారు కాదేమో. ఆ రోజుల్లో ఫ్లోర్ క్రాసింగ్ గాని పార్టీ నుండి విడిపోతే అనర్హత ప్రకటించే చట్టంగాని లేదు. ఒకవేళ అటువంటి బిల్లు ఉన్నప్పటికీ 90 మంది శాసనసభ్యులు బయటకు వచ్చారు అంటే అర్థం ఏమిటి?
50% ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని అదే ఒకప్పుడు చౌదరి చరణ్ సింగ్ 40 మంది ఎమ్మెల్యేలను వెంట తీసుకొని వెళ్లి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యారు. మరో ఆయన.. చంద్రశేఖర్. వీపీ సింగ్ వద్ద ఉన్న ఎంపీలను తీసుకెళ్లి ప్రధాన మంత్రి అయ్యాడే.. ఇవన్నీ ప్రజాస్వామ్య వాదులకు గుర్తు రావా వీరిని దుర్మార్గులనీ, తప్పుడు పని చేశారనీ ఎవరు అనలేదే!
ఎన్టీఆర్ మిత్రద్రోహి..
ఎన్టీ రామారావు నాకు చేసిన మిత్ర ద్రోహం ఏమిటో ఎవరికి కనిపించలేదు. ఒక వ్యక్తికి ఒక న్యాయం, మరొక వ్యక్తికి, మరో న్యాయమా? న్యాయం ఇలా ముఖముఖాలు చూస్తుందా? ముఖం చూసి బొట్టు పెడుతుందా? అంతస్తులు చూస్తుందా? మోసపు మాటలను, చేతలను చూస్తుందా? నమ్ముతుందా? మరెలా??
పత్రికలు ఈ విషయంలో తమ ఇష్టం వచ్చినట్లు రాశాయి. పత్రికలు రాసిన విషయాలను విశ్వసించి వాటిని నమ్మి మనం తీర్పు చెబితే సమాజం ఎటువైపు పయనిస్తున్నట్టు? న్యాయ న్యాయాలను విచారించ తలచుకున్నప్పుడు రెండు పక్షాల వారి వాదనలు వినాలి కదా! అటువంటి విషయాలతో న్యాయానికి అవసరం ఉండదా? మేం హాజరైన 91 మంది శాసనసభ్యులు జాబితా, ఢిల్లీ ఆగంతుకునితో పాటు అక్కడ కొంతమంది శాసనసభ్యులు కలిసి, ఎన్టీ రామారావును తాము బలపరుస్తున్నామని సంతకాలు పెట్టినా లిస్టు- రెండూ- గవర్నర్ వద్దే ఉన్నాయి. ఆ రెంటిని ఆ రాత్రి గవర్నర్ చూసుకునే ఉన్నారు. నన్ను ఇతర ప్రతిపక్షాలు కూడా బలపరుస్తున్న కారణంగా గవర్నర్ నన్ను గవర్నమెంట్ ను ఫార్మ్ చేయమన్నారు.
ప్రతిపక్ష నాయకుడు కూడా అక్కడే ఉన్నారు...
ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి పదవి నుండి రిజైన్ చేయమన్నారు గవర్నర్. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏ మదన్మోహన్ గవర్నర్ సమక్షంలోనే ఉన్నారు. గవర్నర్తో నేను ఒక మాట కూడా అన్నాను. నేను ముఖ్యమంత్రి పదవి కోసమేమీ తాపత్రయపడుట లేదు, ప్రతిపక్ష నాయకుడు మదన్మోహన్ మీ ముందే ఉన్నారు కదా, ముఖ్యమంత్రిగా వారికి అవకాశం ఇవ్వండి, బయట నుండి మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్పాను. ఢిల్లీలోని అధిష్టానం మదన్మోహన్ కు ఏమి వద్దు, భాస్కరరావుకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి అని గవర్నర్ తో పరిస్థితి తెలుసుకొని సంప్రదించి మరీ నన్ను మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయమన్నారు. తప్పేముంది ఇందులో?
ఇలాంటి సంఘటనలు భారతీయ రాజకీయ రంగంలో గతంలో ఎన్ని చోటు చేసుకోలేదు? గవర్నర్ మరుసటి రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనప్పుడు ప్రతిపక్షాలన్నీ నాకు తమ సపోర్టును తెలుపుతూ గవర్నర్ కి లేక అందించాయి. ప్రమాణ స్వీకారానికి సమయం నిర్ణయించుకోమని గవర్నర్ చెప్పిన కారణంగా నేను ప్రమాణస్వీకారం చేయడానికి సమయం నిర్ణయించుకొని నా అనుయాయులతో రాజ్ భవన్ కి వెళ్లాను.
నేను వెళ్ళిన సమయానికి గవర్నర్.. ఎన్టీ రామారావు కు, ఆయన అనుచరులకు ఇంటర్వ్యూ ఇచ్చి పొరపాటు చేశారు. గవర్నరు నాతో ప్రమాణం చేయించడం కోసం వస్తున్నప్పుడు ఆటంకం కల్పిస్తూ రామారావు దారికి అడ్డంగా కూర్చొన్నారు. నేను (గవర్నర్) భాస్కర రావుతో ప్రమాణం స్వీకారం చేయించాలి అడ్డుతొలగమని గవర్నర్ కోరినా ఎన్టీ రామారావు అడ్డు తొలగకపోవడంతో అక్కడే ఉన్నా పోలీస్ కమిషనర్ విజయరామారావుతో... మీరు ఎన్టీ రామారావును పక్కకు తొలగించమని ఆదేశించారు.
విజయరామారావు సృష్టించిన రభస..
గవర్నర్ ఆదేశాలతో- కావాలని పోలీస్ కమిషనర్ విజయరామారావు ఎన్టీ రామారావుని అరెస్టు చేసి పోలీసు వ్యానులో ఎక్కించి ఫోటోలు తీయించి మరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి, వారి పేర్లు రాసుకొని నానా రభస చేశారు. ఇంతగా నాటకం ఆడిన పోలీస్ కమిషనర్ విజయ రామారావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.
ఎన్టీ రామారావు తనకు శాసనసభలో మెజారిటీ లేదని తప్పుకున్నారు కూడా. ఈ సందర్భంగా గవర్నర్ ను విమర్శించాల్సిన అవసరమేమి కనిపించదు. గవర్నరు ఎన్టీ రామారావు కు మెజార్టీ లేనప్పుడు రిజైన్ చేయమనే ఆయన అడిగింది. ఆ నిక్ ఆఫ్ ది మూమెంట్లో నాకు మెజారిటీ ఉంది. ఎన్టీ రామారావు మైనారిటీలో పడిపోయారు. అందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎన్టీ రామారావు దారికి అడ్డంగా కూర్చుని గవర్నర్ ను నాతో ప్రమాణం చేయించడానికి రానివ్వకుండా అడ్డుగా ఉండటంతో చాలా కాలయాపన జరిగింది. అప్పటికే రాహుకాలం వచ్చేసింది. అప్పుడు గవర్నర్ వచ్చి నాతో ప్రమాణ స్వీకారం చేయిస్తానంటారు. రాహుకాలం వెళ్ళిపోయాక ప్రమాణ స్వీకారం చేస్తానని నేనన్నా కూడా వినకుండా ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు అలా ముఖ్యమంత్రి లేకుండా ఇక ఏమాత్రం ఉండటానికి వీల్లేదు అలా ఉండడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. మీరు వెంటనే ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ మడత పేచీ పెట్టారు.
రాహుకాలంలోనే ప్రమాణం...
నాతో రాహుకాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఎన్టీ రామారావు కు కావాల్సింది కూడా అదే. రాహుకాలంలోనే నేను ప్రమాణ స్వీకారం చేయగలిగేటట్టు తాను (ఎన్టీఆర్) ఏదో రకంగా గవర్నర్ ను అడ్డుకోగలిగితే ఆ రాహుకాలంలో ఏర్పడ్డ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని ఎన్టీ రామారావు ప్రగాఢ విశ్వాసం. ఎన్టీ రామారావుకి జ్యోతిష్య శాస్త్రం ఎడల బాగా విశ్వాసం ఉంది .అలాగే నాకు కూడా.
ఆరోజు జరిగిన వ్యవహారం తీరుకు గవర్నర్ నా ముందే పోలీస్ కమిషనర్ విజయ రామారావును- నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నా మర్యాద పోయింది. ప్రజల్లో ఎన్టీ రామారావు కు సానుభూతి సంపాదించాలని నువ్వు ఈ పని చేశావు? అని ఎంతగానో కోప్పడ్డారు.
నేనప్పుడు గవర్నర్ను అడిగాను ప్రమాణ స్వీకారానికి నన్ను రమ్మని, మరోవైపు ఎన్టీ రామారావు కు ఇంటర్వ్యూ ఇవ్వటమేమిటి? ఇది సరైన పద్ధతి కాదు అన్నాను. గవర్నర్ కోరినా రిజైన్ చేయకపోతే తర్వాత కార్యక్రమం డిస్మిస్ చేయడమే జరిగే ప్రక్రియ. అందులో కొత్తమీ లేదు. ఇందుకు బాధపడి చేసేదేమీ లేదు. ఏం లాభం? మేము నిర్ణయించుకున్న శుభ ఘడియ కాస్తా గత కాలంలో కలిసిపోయింది. గవర్నర్ దర్భారు హాలులో నా ఒక్కడితోనే ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యులతో క్యాంప్ నిర్వహించవలసిందిగా అనేకమంది మిత్రులు నాకు సూచించారు.. అయినా నేను నిర్వహించలేదు...
ఆ 48 గంటల్లో ఏమి జరిగిందీ..
ఆగస్టు 14వ తేదీ రాత్రి 90 మంది ఎమ్మెల్యేలు నాకు మద్దతుగా సంతకాలు చేశారు. 15వ తేదీ ఉదయం గవర్నర్ ని కలిసి ఎన్టీ రామారావు కు మా మద్దతు ఉపసంహరించుకుంటామని మా సంతకాలు పెట్టిన లిస్టు ఇచ్చాం. అదే రోజు మధ్యాహ్నం నన్ను తెలుగుదేశం లెజిస్లేచర్ నాయకుడిగా ఎన్నుకున్నారు. అయినా కూడా గవర్నర్ ఆ సాయంత్రం వరకు ఏ నిర్ణయం చెప్పలేదు. 16వ తేదీ ఉదయానికి కూడా గవర్నర్ తన నిర్ణయాన్ని తెలుపలేదు. 16వ తేదీ ఉదయం 10:30 గంటలకు నన్ను పిలిపించి.. మీకు మెజార్టీ ఉన్న విషయాన్ని గుర్తించాను, ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని బలపరుస్తూ లేఖలు ఇచ్చాయి, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అన్నారు.
ఆగస్టు 15వ తేదీ ఉదయం గవర్నర్ వద్ద సంతకాలు చేసిన జాబితా ఇచ్చి ఎవరి నివాసాలకు వాళ్లం వెళ్ళిపోయాం. మర్నాడు ఇంకా ఎన్టీరామారావు చేతిలోనే ప్రభుత్వ పగ్గాలు ఉన్నాయి కనుక, అవగాహన అంతగా లేని బలహీనుడైన కొంతమంది ఎమ్మెల్యేలకు ఏవేవో ప్రలోభాలు పెట్టి, ఎన్నో నమ్మగొలిపే మాటలు చెప్పి, వారిని తీసుకొని వెళ్లి ఎన్టీ రామారావు స్టూడియోలో బంధించారు. ఆరోజున నా మద్దతుదారులు 90 మంది సంతకాలు చేసి గవర్నర్ కి మొమోరాండం సమర్పించాక దానికి కౌంటర్ గా కేవలం వారిని సపోర్ట్ చేస్తున్న 60, 70 మంది శాసనసభ్యులతో మాత్రమే ఢిల్లీ ఆగంతకుడు వెళ్లి గవర్నర్ ను కలిశారు.
నా రాజకీయం ఇదీ...
నేను ఆ రోజున నాకు మద్దతు ఇచ్చిన శాసనసభ్యులను ఎన్టీ రామారావు మనుషులకు దొరకకుండా దాచకపోవడం ఒక పెద్ద చారిత్రాత్మక తప్పిదంగా రాజకీయ పండితులు ఆ రోజు నుండి ఈరోజు వరకు అంటూనే ఉన్నారు. నేను రాజకీయాల ఎడ మొదటి నుండి ఒక ప్రత్యేక భావజాలం ఉన్నవాడిని. రాజకీయాల్లో ఉండి అక్రమమైన పనులు చేయాలని సంపాదించాలని నేను అనుకోలేదు. ఏవేవో సాధించాలని గానీ ఏనాడు కోరుకున్న వాడిని కూడా కాదు. మొదటి నుండి రాజకీయాలంటే నాకున్న అభిప్రాయం అది. కేవలం స్వార్థ చింతనతో రాజకీయాల్లో ప్రవేశించాననుకుంటే పొరపాటు. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలు కోసమే ఈ పోరాటమంతా జరుగుతున్నది" అని నాదెండ్ల భాస్కరరావు తన జీవిత ప్రస్థానంలో రాసుకున్నారు.
సెప్టెంబర్ 16న రాజీనామా...
నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఆ సభకు భాస్కరరావే అనుమతి ఇస్తారు. ఎక్కడెక్కడి నుంచో నాయకులు తరలి వచ్చారు. ప్రజాస్వామ్యం కూనీ అయిందంటూ ప్రసంగించారు. ఎన్టీఆర్ నాయకత్వంలో ఊరూవాడా యాత్రలు సాగుతాయి. కమ్యూనిస్టులు, సోషలిస్టులు, తెలుగుదేశంతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఉద్యమం సాగిస్తారు. తనకిచ్చిన నెల రోజుల్లో బలనిరూపణ చేసుకోలేని పరిస్థితి రావడంతో నాదెండ్ల భాస్కరరావు సెప్టెంబర్ 16న రాజీనామా చేస్తారు. ఆ తర్వాత ఎన్టీరామారావు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటికి ఎన్నికలు జరిగి 18 నెలలే అయినా ఎన్టీఆర్ శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలుస్తారు. చిత్రమేమిటంటే చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి నాదెండ్ల భాస్కరరావు. అటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడాయన కుమారుడు నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా జనసేన నుంచి ప్రాతినిధ్యం వహించడం కొసమెరుపు.