తెలంగాణాను కేటీఆర్-హరీష్ చెరిసగం పంచుకుంటారా ?
పాదయాత్ర చేయబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించగానే పార్టీలో హరీష్ ను తొక్కేయటానికే కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోయాయి.
కేటీఆర్ పాదయాత్రలో మార్పులు జరిగినట్లు సమాచారం. తొందరలోనే తాను పాదయాత్ర(Padayatra) చేయబోతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఈమధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. పాదయాత్ర విషయాన్ని కేటీఆర్ అలా ప్రకటించారో లేదో వెంటనే పార్టీలో మిశ్రమస్పందన మొదలైపోయింది. ఇంకా క్లారిటిగా చెప్పాలంటే హరీష్(Harish Rao) ను అణగదొక్కేందుకే కేటీఆర్ పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. దాంతో పార్టీ అధినేత కేసీఆ(KCR)ర్ వెంటనే మేల్కొన్నట్లు సమాచారం. పార్టీని ఇపుడు కేటీఆర్, హరీష్ ఇద్దరు ముందుండి నడిపిస్తున్నారు. హరీష్ లేని పార్టీ కార్యక్రమాలను మెజారిటి నేతలు, క్యాడర్ ఊహించుకోలేరు. అలాంటిది తాను పాదయాత్ర చేయబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించగానే పార్టీలో హరీష్ ను తొక్కేయటానికే కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోయాయి. అసలే పార్టీ పరిస్ధితి అంతంతమాత్రంగా ఉంది. ఈ పరిస్ధితుల్లో పార్టీనేతల్లో గందరగోళం లేదా నెగిటివ్ ఆలోచనలు మంచివి కావన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ జోక్యం చేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
ఇంతకీ విషయం ఏమిటంటే పాదయాత్రను కేటీఆర్ ఒక్కళ్ళే కాకుండా హరీష్ కూడా చేసేట్లుగా కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణా ధక్షిణంలో హరీష్ రావు, తెలంగాణా ఉత్తరంలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే బాగుంటుందని కేసీఆర్ డిసైడ్ చేశారట. ఇద్దరు అగ్రనేతలు చెరోవైపు పాదయాత్ర మొదలుపెడితే పార్టీ నేతలు, క్యాడర్లో జోష్ పెరుగుతుందని కేసీఆర్ ఆలోచించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ధక్షిణ తెలంగాణాలోని వికారాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో హరీష్ పాదయాత్ర చేస్తారు. అలాగే ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్, కొమరమ్ భీం అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కేటీఆర్ పాదయాత్ర చేస్తారు. మిగిలిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇద్దరు కలిసే పాదయాత్ర చేసేట్లుగా రూట్ మ్యాప్ రెడీ అవుతోందని సమాచారం.
తమకు కేటాయించిన జిల్లాలనుండి కేటీఆర్, హరీష్ పాదయాత్ర మొదలుపెట్టి రంగారెడ్డి, హైదరాబాద్ లో కలిసేట్లుగా రూట్ మ్యాప్ రెడీచేయమని నేతలను కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ముగింపు సభ హైదరాబాద్ లో పెట్టాలా లేకపోతే ఇంకెక్కడైనా నిర్వహించాలా అన్నది ఇంకా తేలలేదు. మామూలుగా అయితే ఎవరైనా పాదయాత్ర అంటే జనరల్ ఎలక్షన్ ముందు మొదలుపెడతారు. సాధారణ ఎన్నికలు ఇంకో ఏడాదిలో ఉండగా మొదలుపెడితే పార్టీ నేతలు, క్యాడర్లో ఫుల్లు జోష్ పెరిగిపోతోంది. అలాగే మామూలు జనాలు కూడా పాదయాత్రను గుర్తుంచుకుంటారు, మాట్లాడుకుంటారు. ఆ టెంపో ఎన్నికల వరకు సరిపోతుంది. కాని తెలంగాణాలో ఎన్నికలంటే మరో నాలుగు సంవత్సరాలుంది. ఈలోపు కేటీఆర్, హరీష్ పాదయాత్ర చేసినా ఎన్నికల నాటికి పెద్దగా ఉపయోగం ఉండదు. సాధారణ ఎన్నికల్లోపు మరో ఎన్నికలంటే తొందరలో జరగబోయేది స్ధానికసంస్ధల ఎన్నికలు మాత్రమే.
స్ధానికసంస్ధల ఎన్నికలు బహుశా జనవరి ప్రాంతంలో జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. అంటే ఇప్పటినుండి తీసుకుంటే స్ధానికసంస్ధల ఎన్నికలకు ఉన్నది సుమారు రెండు నెలలు మాత్రమే. 6వ తేదీన మొదలయ్యే కులగణన సర్వే ప్రక్రియ(Family Survey) పూర్తి అయిన తర్వాత కాని స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం లేదు. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గానే కేటీఆర్ పాదయాత్రను ప్రకటించారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదయాత్ర చేస్తానంటే అది స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటన అయ్యుండే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి పాదయాత్ర అంటేనే రాబోయే జనరల్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకునే అయ్యుండచ్చనే చర్చ పార్టీలో నడుస్తోంది. అందుకనే కేటీఆర్ పాదయాత్ర అనే ప్రకటన చేశారు కాని ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. కేటీఆర్ చేసిన ప్రకటనపైనే పార్టీ నేతల్లో మిశ్రమస్పందన వినబడుతోంది కాబట్టి చేసే పాదయాత్రేదో కేటీఆర్ తో పాటు హరీష్ ను కూడా జతకలిపితే మొత్తం రాష్ట్రమంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని కేసీఆర్ భావించినట్లున్నారు. పాదయాత్రను ఎప్పుడు ప్రారంభించినా కేటీఆర్, హరీష్ ఇద్దరూ ప్రారంభించాలన్నది కేసీఆర్ ఆలోచన. మరి చివరకు ఏమి జరగుతుందో చూడాల్సిందే.