దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తుతో జగన్ కి షాక్ ఇచ్చారా?
x
వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తుతో జగన్ కి షాక్ ఇచ్చారా?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. పుష్కర కాలం తర్వాత దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసింది.


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. పుష్కర కాలం తర్వాత దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసింది. వీటి విలువ సుమారు 793 కోట్ల రూపాయలు ఉండవచ్చునని అంచనా. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో 407.05 హెక్టార్ల సున్నపు రాయి గనులు, మరికొన్ని ఆస్తులు ఉన్నాయి. దాల్మియా సిమెంట్ కంపెనీకి సున్నపురాయి గనులు ఇచ్చినందుకు జగన్‌ పెట్టిన కంపెనీల్లోకి నిధులు మళ్లించారన్నది ఆరోపణ. దీనిపై 2013లో దాల్మియా సిమెంట్స్‌పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. వాటిని సవాలు చేస్తూ దాల్మియా సిమెంట్స్‌ కోర్టుకెళ్లింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో దాల్మియా సిమెంట్స్... షేర్ల అమ్మకం, అడ్డదారిలో నగదు మార్పిడి వంటి ఆరోపణలు ఎదుర్కొంటోంది.

హైదరాబాద్‌లో ఉన్న డీబీసీఎల్‌ భూమిని ప్రొవిజనల్‌ ఎటాచ్‌మెంట్‌ చేశామని, గతంలో ఆ కంపెనీ రూ.377.26 కోట్లతో ఆ భూమిని కొనుగోలు చేసిందని ఈడీ ప్రకటించింది. జగన్మోహన్‌రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్స్‌ పెట్టుబడులపై 2011లో సీబీఐ కేసు నమోదు చేసిందని, ఆ కేసు ఆధారంగా డీబీసీఎల్‌ ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చామని తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా మనీలాండరింగ్‌ చట్టాన్ని (2002) ఆ కంపెనీ ఉల్లంఘించినట్లు పేర్కొంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార పలుకుబడిని ఉపయోగించి ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి భారతీ సిమెంట్స్‌కు భారీ ఎత్తున ఈక్విటీని, రుణాలను సమీకరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. భారతీ సిమెంట్స్‌ ఈక్విటీ షేర్లు ఐదున్నర కోట్లున్నాయి. రూ.10 ముఖ విలువకే నాలుగున్నర కోట్ల వాటాలను జగన్‌, ఆయన కంపెనీలు తీసుకోగా.. మిగతా షేర్లను దాల్మియా సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌ వంటి సంస్థలు, మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ వంటి వ్యాపార ప్రముఖులు ఒక్కో షేరుకు రూ.94 నుంచి రూ.175 రేటుతో కొనుగోలు చేశాయని ఆరోపించింది.
దాల్మియా సిమెంట్స్‌ ఆ తర్వాత 2 లక్షల షేర్లను రూ.1,440 రేటుతో కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందని సీబీఐ గతంలో వెల్లడించింది. తాజాగా ఈడీ అవే అభియోగాలతో డీబీసీఎల్‌ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
న్యాయపరంగా ఎదుర్కొంటాం..
తమకు చెందిన రూ.793.34 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తుపై ఈడీ గత నెల 31న ఉత్తర్వులిచ్చిందని.. ఆ ప్రతిని ఈ నెల 15వ తేదీన తాము అందుకున్నామని డీబీసీఎల్‌ బుధవారం (ఏప్రిల్ 17)న ప్రకటించింది. ఇది తాత్కాలిక జప్తు మాత్రమేనని.. దీనివల్ల తమ కంపెనీ కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకులూ ఉండవని, యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఈడీ ఆదేశాలను న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది.
భారతీ సిమెంట్స్ పై అభియోగాలు...
వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 2007లో భారతీ సిమెంట్స్ ఏర్పాటైంది. 2009 ఆగస్టు 27న తన వాటా నుంచి 2,27,584 షేర్లను ఒక్కొక్కటీ రూ.1,450 ధరకు మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌కు చెందిన అల్ఫా విల్లాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అల్ఫా అవెన్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు విక్రయించారు. జగన్‌కు రూ.33 కోట్లు వచ్చాయి. భారతీ సిమెంట్స్‌ ఉత్పత్తిని ప్రారంభించక ముందే ఆయనకు భారీ ప్రతిఫలం వచ్చిందన్నది ఆరోపణ. ఈ మొత్తంతో ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసిందని, విక్రయించిన ఈ షేర్లు జగన్‌ వాటాలో ఒక శాతం కంటే తక్కువేనని, ఆయన తండ్రి అధికార పగ్గాలు చేపట్టాక భారతీ సిమెంట్స్‌లోకి అక్రమ పెట్టుబడులు రప్పించే పని కొనసాగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఈ వ్యవహారంలో ఆనాటి గనుల శాఖ డైరెక్టర్‌ వి.రాజగోపాల్‌ కూడా వినిపించింది. ఆనాటి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎ.దయాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కె.వెంకట్రావు సీబీఐకి ఈమేరకు వాంగ్మూలాలు కూడా ఇచ్చారని తెలుస్తోంది.
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఎ.చాముండేశ్వరి, ఆమె ముగ్గురు కుమార్తెలతో కలిసి ఏర్పాటు చేసిన జయా మినరల్స్‌ కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407.05 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్‌ లీజు కోసం 1997లో దరఖాస్తు చేసుకుంది. సరైన వివరాలు సమర్పించలేదని, సదరు చిరునామాలో ఆ కంపెనీ లేదని 2000 సంవత్సరం వరకు ప్రభుత్వం దీన్ని పక్కనపెట్టింది. 2004లో వైఎస్‌ ప్రభుత్వం వచ్చాక సజ్జల దివాకర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఈశ్వరి సిమెంట్స్‌- జయా మినరల్స్‌ను స్వాధీనం చేసుకుంది. జయ మినరల్స్‌ అడిగిన సున్నపురాయి నిక్షేపాలను ఈశ్వరి సిమెంట్స్‌కు కేటాయించాలని సజ్జల దివాకర్‌రెడ్డి గనుల శాఖ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సున్నపురాయి నిక్షేపాల లీజు ఈశ్వరి సిమెంట్స్‌కు దక్కింది.
ఈ షేర్లు ఎలా బదిలీ అయ్యాయంటే...
అనంతరం ఈ లీజును దాల్మియా సిమెంట్స్‌కు బదలాయించేలా 2006 ఏప్రిల్‌ 12న ఒప్పందం కుదిరింది. ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్‌ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టింది. ఒక్కో షేరుకు రికార్డు స్థాయిలో రూ.1,440 చెల్లించింది. అనంతరం ఆ వాటాలను ఫ్రెంచి సంస్థకు విక్రయించింది. ఇందుకు దాల్మియా సిమెంట్స్‌కు రూ.146.58 కోట్లు రాగా వాటిలో పెట్టుబడుల లాభం పోను రూ.139 కోట్లు మిగిలింది. ఈ డబ్బును హవాలా మార్గంలో జగన్‌మోహన్‌రెడ్డికి బదిలీ చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. దాల్మియా సిమెంట్స్‌ ఉద్యోగి జయ్‌దీప్‌ బసు నుంచి ఆదాయపన్నుశాఖ స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌ను విశ్లేషించినప్పుడు ‘జేఆర్‌’ ఖాతాలోకి రూ.55 కోట్లు చెల్లించినట్లు ఉంది. జేఆర్‌ అంటే జగన్‌మోహన్‌రెడ్డి అని దర్యాప్తు సంస్థలు భావించాయి.

మొత్తం దాల్మియా సిమెంట్స్‌కు వచ్చిన రూ.139 కోట్లలో రూ.55 కోట్లు హవాలా మార్గంలో జేఆర్‌ ఖాతాలోకి పంపగా మిగతా డబ్బు కూడా మళ్లించేలోపే సీబీఐ దర్యాప్తు మొదలవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. సున్నపురాయి గనుల కేటాయింపు, భారతి సిమెంట్స్‌లో దాల్మియా పెట్టుబడి పెట్టడం, తమ వాటా అమ్మగా వచ్చిన డబ్బును హవాలా ద్వారా మళ్లించడం వంటివన్నీ నిధుల మళ్లింపు కిందికే వస్తాయనే అభియోగంపై దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. ఇప్పుడీ విషయం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది.
Read More
Next Story