ఇందిరాగాంధీ అనుభవమే రేవంత్ ను భయపెట్టిందా ?
x

ఇందిరాగాంధీ అనుభవమే రేవంత్ ను భయపెట్టిందా ?

రేవంత్ రెడ్డి భద్రతా వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే స్పెషల్ బెటాలియన్ పోలీసులను తప్పించి ఆ బాధ్యతలను ఆర్ముడు రిజర్వు పోలీసులకు భద్రతా అధికారులు అప్పగించారు.


రేవంత్ రెడ్డి భద్రతా వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే స్పెషల్ బెటాలియన్ పోలీసులను సడెన్ గా తప్పించి ఆ బాధ్యతలను ఆర్ముడు రిజర్వు పోలీసులకు భద్రతా అధికారులు అప్పగించారు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఎవరున్నా భద్రతా వ్యవహారాలను మాత్రం స్పెషల్ పోలీసులే చూసుకునే వారు. వ్యక్తిగత భద్రతతో పాటు సెక్రటేరియట్, ఇంటి దగ్గర కూడా స్పెషల్ పోలీసులే రక్షణ బాధ్యతలను చూసుకునే వారు. అలాంటిది సడెన్ గా మంగళవారం స్పెషల్ పోలీసుల(Special Police)ను రేవంత్(Revanth Reddy Security) భద్రత నుండి తప్పించి ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసుల(Armed Reserve Police)కు ఉన్నతాధికారులు అధికారులు అప్పగించారు. రేవంత్ వ్యక్తిగత భద్రతే కాకుండా ఇంటి దగ్గర, సెక్రటేరియట్ దగ్గర నుండి స్పెషల్ పోలీసులను తప్పించి మొత్తం బాధ్యతలను ఆర్ముడు రిజర్వుకు అప్పగించేశారు. ఇంతటి అసాధారణ నిర్ణయం వెనుక కారణం ఏమయ్యుంటుంది ?

అది 1984, జూన్ 1-10 మధ్య పంజాబ్, అమృత్ సర్(Amritsar) లోని స్వర్ణదేవాలయం(Golden Temple)లో సైనిక చర్య జరిగింది. సిక్కులు ఎంతో పవిత్రంగా చూసుకునే స్వర్ణదేవాలయంలో దాక్కున్న వేర్పాటువాద నాయుకుడు జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే(Jarnail singh Bhindranwale) తో పాటు ఆయన అనుచరులను బయటకు రప్పించేందుకు కేంద్రప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోవటంతో చివరకు వేరేదారిలేక అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి(Indira Gandhi) ఆదేశాల ప్రకారం మిలిటరీ సైనిక చర్యకు దిగింది. ఇందులో భాగంగానే సైనికులు దేవాలయంలోకి ప్రవేశించి వేర్పాటువాదులను వేటాడింది. వేర్పాటువాదులను సైన్యం చాలా తక్కువ అంచనావేసింది. వేర్పాటువాదుల దగ్గర అత్యాధునిక మెషీన్ గన్లు, తుపాకులున్నాయన్న విషయాన్ని ఊహించలేదు. అయితే విషయం తెలియగానే సైనికులు అప్రమత్తమై ట్యాంకులు తెప్పించి దేవాలయంపైకి కాల్పులు మొదలుపెట్టారు.

దేవాలయంలోపల నుండి వేర్పాటువాదులు, బయటనుండి సైనికులకు దాదాపు వారంరోజులు పెద్ద యుద్ధమే జరిగింది. చివరకు వేర్పాటువాదులతో పాటు యాత్రీకులు మొత్తం 1592 మంది చనిపోయారు. సైనికులు కూడా 83 మంది చనిపోయారు. ఈ సైనికచర్యకే కేంద్రప్రభుత్వం ఆపరేషన్ బ్లూస్టార్(Operation Blue Star) అని పేరుపెట్టింది. దాదాపు ఆరురోజులు జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ జూన్ 8వ తేదీకి పూర్తయ్యింది. దేవాలయంలోపల చిక్కుకుపోయిన యాత్రీకులను వేర్పాటువాదులు రక్షణ కవచంగా పెట్టుకోవటంతోనే ఇంతమంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది.

సీన్ కట్ చేస్తే 1984, అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీ, సప్దర్ జంగ్ రోడ్డులోని ఇంట్లో ఉదయం 9.30 గంటలకు ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చి చంపేశారు. అంగరక్షకుల్లో సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు తమ దగ్గరున్న తుపాకులతో ఇందిరాగాంధీ శరీరంలోకి బుల్లెట్ల వర్షంకురిపించి చంపేశారు. కారణం ఏమిటంటే సిక్కులు ఎంతో పవిత్రంగా పూజించే స్వర్ణదేవాలయంలోకి సైనికులను పంపటమే కాకుండా కాల్పులు చేయించి వందలమంది మరణానికి కారణమయ్యారని ఇద్దరు అంగరక్షకులకు ఇందిరాగాంధీ మీద బాగా మండిపోయింది. అందుకనే తుపాకులతో కాల్చిచంపేశారు. అంగరక్షకులుగా ఉండటంవల్లే ఇందిరాగాంధీ మీద కాల్చిచంపటానికి సిక్కు అంగరక్షకులకు అవకాశం దొరికిందని తర్వాత విచారణలో తేలింది.

ఇపుడు తెలంగాణాకు వస్తే రేవంత్ కు ఇంతకాలం భద్రతగా ఉన్న స్పెషల్ బెటాలియన్ పోలీసులందరినీ రక్షణ బాధ్యతల నుండి పూర్తిగా తప్పించేశారు ఉన్నతాధికారులు. దీనికి కారణం ఏమిటంటే గడచిన కొద్దిరోజులుగా స్పెషల్ బెటాలియన్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముందు స్పెషల్ బెటాలియన్ పోలీసుల భార్యలు ఆందోళనలు మొదలుపెట్టారు. తమ భర్తలు 26 రోజులు పనిచేస్తే కేవలం నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే తమ భర్తలతో గడ్డి పీకిస్తున్నారని, మట్టి తవ్విస్తున్నారని, గుంతలు తవ్విస్తున్నారంటు పోలీసుల భార్యలు నల్గొండ, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో వరసుగా ఆందోళనలు చేశారు. వారం రోజుల పాటు భార్యలు ఆందోళనల పేరుతో రోడ్డెక్కిన తర్వాత చివరకు భర్తలు అంటే బెటాలియన్ పోలీసులు కూడా భార్యలకు సంఘీభావంగా ఆందోళనలకు దిగారు. స్పెషల్ పోలీసులు పెద్దఎత్తున ధర్నాచౌక్ లో భారీ ఆందోళనే చేశారు.

పోలీసులయ్యుండి రోడ్డుపై ఆందోళనలు చేసినందుకు ఉన్నతాధాకారులు పదిమందిపై వేటు వేయటమే కాకుండా మరో 30 మందిని సస్పెండ్ చేశారు. దాంతో ఆందోళనలు మరింత పెరిగిపోయాయి. ఇపుడు స్పెషల్ బెటాలియన్ పోలీసులతో పాటు వాళ్ళ భార్యలు కూడా ప్రభుత్వం మీద మండిపోతున్నారు. వాళ్ళంతా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తు బూతులు తిడుతున్నారు. వీళ్ళ ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతుగా రంగంలోకి దిగేశాయి. దాంతో స్పెషల్ బెటాలియన్ పోలీసులు ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో అని భయపడిన ఉన్నతాధికారులు అర్జంటుగా రేవంత్ వ్యక్తిగత భద్రతతో పాటు ఇంటి దగ్గర, సెక్రటేరియట్ దగ్గర కూడా భద్రతా వ్యవహారాల నుండి స్పెషల్ పోలీసులందరినీ తప్పించి మొత్తం బాద్యతలను ఆర్ముడు రిజర్వు పోలీసులకు అప్పగించేశారు. ఇంటిదగ్గర స్పెషల్ పోలీసులు 30 మంది 24 గంటలూ రక్షణగా ఉంటారు. అలాగే సెక్రటేరియట్ దగ్గర సుమారు 60 మంది, రేవంత్ తో పాటు మరో 50 మంది 24 గంటలూ షిఫ్టు పద్దతిలో రక్షణగా ఉంటారు. ఇంతమందిని ఒకేసారి మార్చేయటం అంటే కీడెంచి మేలు ఎంచటమంటారేమో.

Read More
Next Story