అంతులేని నిర్లక్ష్యమే ఏడుగురు భక్తుల్ని మింగేసిందా?
x
సింహాచలంలో కూలిన గోడ శిథిలాలను తొలగిస్తున్న ఎన్డీఆర్‌ ఎఫ్‌ బందం

అంతులేని నిర్లక్ష్యమే ఏడుగురు భక్తుల్ని మింగేసిందా?

సింహాచలం అప్పన్న ఆలయంలో బుధవారం తెల్లవారు జామున గోడ కూలి క్యూ లైన్‌లో ఉన్న భక్తుల మీద పడింది.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం చందనోత్సవంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి ఆ దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారుల అవినీతి, విశాఖ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏటా గంధం అమావాస్య తర్వాత వచ్చే అక్షయ తృతీయ నాడు సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహాస్వామికి చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఏడాది పొడవునా స్వామికి పూసిన చందనాన్ని ఆరోజు తొలగించాక అప్పన్న నిజరూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఆ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించడానికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటారు. క్యూలైన్లలో తొక్కిసలాటలు, తోపులాటలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తుంటారు. నెల రోజుల ముందు నుంచే కసరత్తు మొదలు పెడతారు. కానీ ఈ సారి చందనోత్సవానికి ఏం జరిగింది?

గోడ కూలిన ప్రదేశం

చందనోత్సవంలో సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల్లో ఏడుగురు భక్తులు గోడ కూలడంతో దుర్మరణం పాలయ్యారు. బుధవారం వేకువజామున మూడున్నర గంటల సమయంలో కురిసిన వర్షానికి కూలిపోయి క్యూలైన్లో ఉన్న భక్తులపై పడడంతో వీరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 20 రోజుల క్రితం దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులు స్వామి గాలి గోపురానికి దిగువన మెట్ల మార్గానికి ఆనుకుని రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాన్ని ఆదరాబాదరాగా చేపట్టారు. ఈ గోడను భూమిలోకి తగిన పునాదులు గాని, ఇనుప ఊచలతో పిల్లర్లు గాని వేయకుండా నిర్మించారు. దీనికి గోడ పేరే గాని దీనికి ఏమంత పటిష్టత లేదు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకవైపు రూ.వెయ్యి, మరో వైపు రూ.300 టిక్కెట్ల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆపై మంగళవారం అర్థరాత్రి నుంచి భక్తులను అనుమతించారు. ఇంతలో వర్షం కురవడం, భక్తుల రద్దీ పెరగడం మొదలైంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బలహీనంగా ఉన్న గోడ ఒక్కసారిగా కూలి అక్కడున్న భక్తులపై పడిపోవడంతో చాలామంది పారిపోయారు. అక్కడే ఉన్న వారిలో ఏడుగురు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. ఇటీవలే అంతంతమాత్రంగా నిర్మించిన గోడ పక్క నుంచి క్యూలైన్‌ నుంచి భక్తులను అనుమతించడమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఒకవేళ వర్షం కురవకపోయినా, బలంగా లేని ఈ గోడ భక్తుల తాకిడికి కూలిపోయి ఉండేదని అంటున్నారు. గోడ నాణ్యతను, పటిష్టతను పరిశీలించాల్సిన దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులు ఆ పని చేయకుండా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి సింహాచలం దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం అధికారులపై చాలా ఏళ్లుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దేవస్థానం గతంలో రూ.25 కోట్లతో రెండు కల్యాణ మండపాలను లోపభూయిష్టంగా నిర్మించినట్టు ఫిర్యాదులు అందినా చర్యలు లేవు. ఇప్పుడు జరిగిన దుర్ఘటనకు ప్రధాన కారణం గోడ నాణ్యత లేకపోవడమేనని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ‘ఈ దేవస్థానంలో ఇంజినీరింగ్‌ విభాగాన్ని ప్రక్షాళన చేయాలి. జిల్లా యంత్రాంగం వీరిపై నమ్మకం పెట్టుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది’ అని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు పాసర్ల ప్రసాద్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి’తో అన్నారు.

మరణించిన సాఫ్ట్‌వేర్‌ దంపతులు మహేష్, శైలజల పెళ్లినాటి ఫోటో

అధికార యంత్రాంగం ఏం చేసింది?
ఇక అధికార యంత్రాంగం కూడా చందనోత్సవానికి వచ్చే వీవీఐపీలు, వారి వెంట వచ్చే వంది మాగధులకు ప్రోటోకాల్‌ ఎంత ఘనంగా స్వామి దర్శనం చేయించి మెప్పు పొందాలన్న దానికే అధికారులు ప్రాధాన్యతనిచ్చారు. సామాన్య భక్తుల భద్రతను గాలికొదిలేశారు. సాధారణంగా కట్టడాల వెంబడి క్యూలైన్లను ఏర్పాటు చేస్తే వాటి నాణ్యత, పటిష్టతను నిపుణులైన ఇంజనీర్లతో తనిఖీలు చేయించాలి. ఎక్కడైనా లోపభూయిష్టంగా ఉన్నట్టయితే ఆ సమీపం నుంచి భక్తులను అనుమతించకూడదు. కానీ జిల్లా యంత్రాంగం అటువంటి చర్యలు చేపట్టకపోవడం ఇప్పడు భక్తుల ప్రాణాలు హరించడానికి కారణమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో వచ్చే చందనోత్సవానికి ముందస్తు రిహార్సల్స్‌ చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘రిహార్సల్స్‌ చేస్తే లోపాలు తెలుస్తాయి. వాటిని సరిచేసుకోవడానికి వీలుంటుంది. కానీ అలా చేసిన దాఖలాలు లేవు. దేవుడి దగ్గరకు వెళ్లే వారికి రక్షణ లేకపోతే ఆ బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే. ఎవరిపైనో నెపాన్ని నెట్టి తప్పించుకోవడం సరికాదు. దైవదర్శనానికి వచ్చిన ఏడుగురు భక్తులు గోడకూలి చనిపోయారంటే ఎంతో బాధగా ఉంది’ అని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు.

కేజీహెచ్‌ మార్చురీ వద్ద మతుల బంధువుల రోదనలు

చందనోత్సవ చరిత్రలో ఇదే తొలి దుర్ఘటన

సింహాచలం చందనోత్సవ సందర్భంగా ఎప్పుడూ దుర్ఘటనలు జరగలేదు. ఆ ఆలయ చరిత్రలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం పాలవడం ఇదే తొలిసారి. 2005లో సింహగిరి రోడ్డు వేస్తుండగా ట్రాక్టర్‌ బోల్తాపడి 13 మంది మరణించారు. అయితే అది దేవస్థానంలోనూ కాదు.. చందనోత్సవ వేళ కాదు.
ఎక్స్‌గ్రేషియా ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చందనోత్సవం దుర్ఘటన మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. మతుల కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగం ఇస్తామని తెలిపింది. అలాగే సింహాచలం మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున చెల్లించనున్నట్టు పీఎం సహాయ నిధి నుంచి ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ దుర్ఘటనపై దర్యాపు జరపడానికి సీఎం చంద్రబాబు ముగ్గురితో కమిటీని వేశారు. గోడ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరుపైనా? సంబంధిత దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులపైనా? భద్రతపై పర్యవేక్షణను పట్టించుకోని అధికారులపైనా? వీరిలో ఎవరిని బాధ్యులను చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
దిగ్భ్రాంతి ప్రకటనలు..
సింహాచలం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం, డిప్యూటీ సీఎంలు యధావిధిగా ప్రకటించారు. కాగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాధిత కుటుంబ సభ్యుల పరామర్శకు బుధవారం సాయంత్రం విశాఖ వస్తున్నారు.
సాఫ్ట్‌వేర్‌ దంపతుల దుర్మరణం
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో విశాఖ నగరం మధురవాడలోని చంద్రంపాలేనికి చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (27)లు ఉన్నారు. ఈ దంపతులకు మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. నగరంలోని హెచ్‌బీ కాలనీలో ఉంటున్న శైలజ తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జారి మహలక్ష్మిలు చనిపోయారు. మరో ఇద్దరు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన మణికంఠ ఈశ్వర శేషారావు, పత్తి దుర్గా ప్రసాద్‌ నాయుడు. వీరిద్దరూ స్నేహితులు. మణికంఠ విశాఖ సీతమ్మధారలో ఉంటూ ఇంటీరియర్‌ డెకరేటర్‌ వత్తిలో ఉన్నాడు. దుర్గాప్రసాద్‌ ఓ సంస్థలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. కాగా మరొకరిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న సింహాచలం అడవివరానికి చెందిన యడ్ల వెంకట్రావు లుగా గుర్తించారు.
కేజీహెచ్‌ వద్ద రోదనలు..
మతులను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ముఖ్యంగా మహేష్‌ కుటుంబంలో నలుగురు మృత్యువాత పడడంతో వారి బంధువుల ఆర్తనాదాలకు అంతులేకుండా పోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే సాఫ్ట్‌వేర్‌ దంపతులు మహేష్, శైలజలను గుర్తు చేసుకుంటూ వారి బంధువులు హదయవిదారకంగా విలపించారు. స్నేహితులైన మణికంఠ, దుర్గా ప్రసాద్‌ నాయుడులిద్దరూ మరణంలోనూ ఏకమై వెళ్లిపోయారా? అంటూ వారి బంధువులు రోదించారు. మతుల బంధువులు కేజీహెచ్‌ మార్చురీ వద్ద ఉండడంతో మంత్రులు, ఎమ్మల్యేలు, ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబీకులను పరామర్శించారు.
మృతుల వివరాలు..
1. కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29), అంబాజీపేట, కోనసీమ జిల్లా
2. పత్తి దుర్గా ప్రసాద్‌ నాయుడు (30), అంబాజీపేట, కోనసీమ జిల్లా
3. యడ్ల వెంకట్రావు (58), అడవివరం, సింహాచలం
4. పిళ్లా ఉమామహేశ్వరరావు (30), చంద్రంపాలెం, విశాఖపట్నం
5. పిళ్లా శైలజ (27) , చంద్రంపాలెం, విశాఖపట్నం
6. గుజ్జారి మహాలక్ష్మి (65), హెచ్‌బీ కాలనీ, విశాఖపట్నం
7. పైలా వెంకటరత్నం (45), హెచ్‌బీ కాలనీ, విశాఖపట్నం
Read More
Next Story