SRHకు ఆఫర్ ఇవ్వడంలో ACA జాప్యమెందుకు చేసిందో..?
x

SRHకు ఆఫర్ ఇవ్వడంలో ACA జాప్యమెందుకు చేసిందో..?

వివాదం జరిగనన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.. HCA, SRH వివాదం పరిష్కారం అయిన రెండో రోజే ఆఫర్ చేయడం ఇప్పుడు కీలకంగా మారింది.


ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)కు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ACA) బంపర్ ఆఫర్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)తో వివాదం నడుస్తున్న క్రమంలో ఏసీఏ ఆఫర్ ఇవ్వడం ప్రస్తుతం రెండు రాష్ట్రల్లో చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆంధ్రకు లాక్కెళ్లిపోదామని ఆ రాష్ట్ర ప్రభుత్వం, క్రికెట్ అసోసియేషన్ ప్లాన్స్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఆఫర్ చేసే విషయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కాస్తంత ఆలస్యం అయిందనిపిస్తుంది. లేదంటే.. అనుకున్నది జరిగి ఉండేదేమో. గొడవ జరుగుతున్నప్పుడు కాకుండా.. పరిష్కారం అయిపోయిన తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆఫర్ చేసింది. దీంతో ఆంధ్రకు షిఫ్ట్ కావడంపై ఎస్‌ఆర్‌హెచ్‌ పెద్దగా ఇంట్రస్ట్ చూపించట్లేదనిపిస్తోంది.

SRH vs HCA వివాదమేంటంటే..

కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఐపీఎస్‌ 2025 ఒప్పందం ప్రకారం 10శాతం టికెట్లు హెచ్‌సీఏకు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50 టికెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్ బాక్స్‌‌ను హెచ్‌సీఏకు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఆ బాక్స్ సామర్థ్యం 30కి తగ్గింది. దీంతో తమకు అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ డిమాండ్ చేసింది. దీనిపై చర్చించాలని ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు సూచించారు. దీంతో ఒక మ్యాచ్ సందర్భంగా ఆ హెచ్‌సీఏ ప్రతినిధులు తమ కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేశారు. తమకు రావాల్సిన అదనపు 20 టికెట్లు ఇస్తేనే తాళం తీస్తామని హెచ్‌సీఏ ప్రతినిధులు చెప్పారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాస్ రావుకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖలో గత రెండేళ్లుగా హెచ్‌సీఏ వేధింపులు ఎక్కువయ్యాయని, తాము ఉప్పల్ స్టేడియంలో ఆడటం ఇష్టం లేనట్లు హెచ్‌సీఏ ప్రవర్తిస్తోందని, ఇలానే కొనసాగితే ఇదే విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో చర్చించి మరో హోమ్ గ్రౌండ్ చూసుకోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు.

సీఎం ఎంట్రీ..

ఈ వివాదంలోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకున్నారు. అసలు వివాదం ఏంటి అన్న పూర్తి వివరాలను సీఎంఓ నుంచి సేకరించారు. అనంతరం ఈ వ్యవహారం దర్యాప్తు చేయాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజిలెన్స్ శాఖ దర్యాప్తు కూడా షురూ చేసింది. ఇంతలోనే ఇరు వర్గాలు కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించేసుకున్నాయి. సంయుక్తంగా ప్రకటన కూడా విడుదల చేశాయి.

పేరువల్లే ఏసీఏ ఆలస్యం చేసిందా..?

అయితే ఈ వివాదం దాదాపు 10 రోజులు జరిగింది. అయితే అన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.. HCA, SRH వివాదం పరిష్కారం అయిన రెండో రోజే ఆఫర్ చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లను విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నిర్వహించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రతిపాదించింది. మిగతా మ్యాచ్‌లను విశాఖపట్నంలో నిర్వహించేందుకు అంగీకరిస్తే పన్ను మినహాయింపులు, ఇతరత్రా సహకారం అందిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు వివరాలను వెల్లడించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ .. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం నుంచి రిప్లై రావడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్ చేసే ప్రక్రియ అంతా కూడా ఫోన్లలలోనే జరిగిందని ఓ ప్రతినిధి ‘ది ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇంకా ఏసీఏ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని వారు తెలిపారు.

ఇందులో భాగంగానే ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆంధ్రకు తీసుకెళ్లాళ్లి, వైజాగ్ స్టేడియంను వాళ్ల హోంగ్రౌండ్‌గా మార్చాలన్న స్థాయిలో కూడా ప్రణాళికలు చేశారని, కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అని పేరు ఉండటంతోనే వాళ్లు ఇన్ని రోజులు చర్చించి.. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు అని ఆఫర్ చేశారని సమాచారం. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఏపీకి తీసుకెళ్లాలి అంటే పేరు మార్పు తప్పని అని భావించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అంటే తెలంగాణే గుర్తోస్తుందని, ఏపీ టీమ్‌గా ఐపీఎల్‌లో కనిపించాలంటే పేరు మార్పు సజెస్ట్ చేయాల్సి ఉంటుందని భావించే ముందు ఈ సీజన్ వరకు ఆఫర్ చేద్దామని, ఆ తర్వాత చర్చలు జరిపి పేరు మార్పుపై మాట్లాడొచ్చని ACA భావించినట్లు తెలుస్తోంది.

ఇంట్రస్ట్ చూపని SRH..

అయితే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ACA) చేసిన ఆఫర్‌పై SRH పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. పన్ను మినహాయింపులు, రాయితీలు ఇచ్చినా ఇక్కడ వివాదం పరిష్కారం అయ్యాక మారాలంటే ఫ్రాంఛైజీ యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. గ్రౌండ్ మార్చాలంటే చాలా తంతు ఉంటుందని భావించే ఇప్పుడు సీజన్ మధ్యలో ఒక్కసారిగా అంతా మార్చేస్తే ప్లేయర్స్ కూడా ఇబ్బంది పడతారని ఆలోచించి.. ఆఫర్‌ను రిజెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆంధ్రకు తీసుకెళ్లడానికి మాత్రం ACA గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ACA ఎంట్రీతో స్పీడ్ పెంచిన HCA

సన్‌రైజరస్ హైదరాబాద్‌(SRH), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మధ్య వివాదం మొదలైన రెండు రోజులకే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ACA).. తన ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించింది. అప్పటికే ఈ వివాదాన్ని తెలంగాణ సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. విచారణకు కూడా ఆదేశించారు. ఒకవైపు సీఎం, మరోవైపు ఏసీఏ రంగంలోకి వస్తుండటంతో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేసుకోవాలని హెచ్‌సీఏ భావించింది. అందుకు పది రోజుల నుంచి కొనసాగుతున్న వివాదాన్ని ఒక్క మీటింగ్‌లోనే పరిష్కరించేసుకుంది. పాత ఒప్పందం ప్రకారంమే స్టేడియం సామర్థ్యంలో 10 శాతం కాంప్లిమెంటరీ పాసులను హెచ్‌సీయేకు కేటాయించనున్నారు. ఈ చర్చల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు పూర్తి సహకారం అందిస్తామని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. అనంతరం తమ మధ్య ఉన్న వివాదాలన్నీ ముగిశాయని హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ సంయుక్తంగా ప్రకటించాయి. అదే విధంగా ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులను మెరుగైన అనుభవాన్ని అందించడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు.

ఏది ఏమయినా ఈ విషయంలో మాత్రం ఆంధ్ర అసోసియేషన్ బాగా లేట్ అయిందన్న భావనను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వివాదం నడుస్తున్నప్పుడే ఈ ఆఫర్ చేసి ఉంటే బాగుండేదని, ఆఖరికి వేరే హోం గ్రౌండ్ చూసుకోవాల్సి వస్తుందని ఎస్‌ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ అన్నప్పుడయినా.. ఏసీఏ త్వరపడి ఉండాల్సింది. అలా కాకుండా హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ చర్చించుకుని అంతా ఓకే, ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్దాం అని నిశ్చయించుకుని, బహిరంగంగా వివాదం తీరిపోయిందని చెప్పేవరకు ఏసీఏ ఆగడంతోనే ఇప్పుడు అవకాశం చేజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story