వైజాగ్‌లో డైమండ్‌ రాణీలు!
x
పేకాటలో పట్టుబడి పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వస్తున్న విశాఖ మహిళలు

వైజాగ్‌లో డైమండ్‌ రాణీలు!

విశాఖపట్నంలో కొంతమంది ఆర్థికంగా బలిసిన మహిళామణులు రోజంతా మూడు ముక్కలాటలో మునిగి తేలుతున్నారు. ఇంటిని, భర్త, పిల్లలను పట్టించుకోకుండా ఎంజాయ్‌ చేస్తున్నారు.


ఇన్నాళ్లూ పేకాట అంటే మగ మహరాజులకే సొంతం అనే భావన అందరిలో ఉండేది. వైజాగ్‌లో కొంతమంది మహిళలు ఆ భావనను తిరగ రాస్తున్నారు. మగ వారికంటే మేమేం తక్కువ అన్నట్టు జూద క్రీడపై మనసు పారేసుకున్నారు. కొందరు మహిళలు వాణిజ్య, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. తగిన గుర్తింపు కూడా తెచ్చుకుంటున్నారు. కానీ విశాఖలో ఆర్థికంగా స్థితిమంతులైన వారి భార్యామణులు కొంతమంది పరువు పోగొట్టుకునే జూద శిఖామణులుగా మారుతున్నారు. సొసైటీలో పేరు ప్రతిష్టలు గడించిన భర్తలకు తలవంపులు తెచ్చిపెడుతున్నారు. విశాఖలో తన భార్య రోజూ పేకాట ఆడుతోందని. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని స్వయంగా ఓ భర్తే సాక్షాత్తూ నగర పోలీస్‌ కమిషనర్‌కే ఫిర్యాదు చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆ మహిళలను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో మహా నగర వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. విశాఖలో ఇలాంటి ‘డైమండ్‌ రాణీ’లు ఇంకొంతమంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

సాధారణంగా భర్తలు పేకాట ఆడుతున్నారంటూ భార్యలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు. పేకాటే లోకంగా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, ఆస్తులమ్మేస్తున్నారని, అప్పుల పాల్జేస్తున్నరని వాపోతుంటారు. కానీ విశాఖలో వచ్చిన ఫిర్యాదు అలాంటిది కాదు.. కొన్నాళ్లుగా పేకాట మరిగిన తన భార్య సహా మరికొందరి భార్యామణులు పగలు, రాత్రి తేడా లేకుండా జూద క్రీడలో మునిగి తేలుతున్నారంటూ గతంలో స్థానిక ఫోర్త్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడాయన. అయితే తొలుత పోలీసులు ఆ ఫిర్యాదును లైట్‌ తీసుకున్నారు. ఇక లాభం లేదని ఆ ‘భార్యా బాధితుడు’ రాత్రి వేళ నిద్రలో ఆసు, జాకీ, రాణీ అంటూ కలవరిస్తోంది. నా భార్యను పేకాట నుంచి విముక్తిరాలుని చేయండి మహాప్రభో! అంటూ నేరుగా పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీని వేడుకున్నాడు. స్పందించిన కమిషనర్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. వీరు వారం రోజుల పాటు నిఘా వేసి ఆరుగురు జూద శిఖామణులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.22,100 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇంటినే పేకాట డెన్‌గా మార్చేసి..
విశాఖ నగరం అక్కయ్యపాలెం, లలితానగర్‌లో తన ఇంటినే పేకాట డెన్‌గా మార్చేసిందా మహిళ. ఆమెతో పాటు మరికొంతమంది మహిళలు కలిసి రోజూ పేకాటకు కొంగు బిగించారు. ఉదయం భర్తలు ఉద్యోగాలకో, వ్యాపారాలకో వెళ్లిపోగానే వీరు రంగంలోకి దిగుతారు. వారికి అవసరమైనవన్నీ అక్కడకే రప్పించుకుని తింటారు. సాయంత్రం చీకటి పడినా వీరి ఆటకు విరామం ఇవ్వరు. వారి భర్తలో, పిల్లలో ఇళ్లకు వచ్చినా ఆట తర్వాతే ఎవరైనా అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఇలా చాన్నాళ్లుగా అదుపు తప్పి పేకాట ప్రపంచంలో మునిగి తేలుతున్న తమ శ్రీమతుల గురించి బయటకు చెప్పుకోలేక, పేకాట వ్యసనాన్ని మాన్పించలేక ఆ భార్యాబాధితులు వారిలో వారే సతమతమవుతున్నారు. పిల్లలను పట్టించుకోవడం లేదు.. పెద్దలనూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తన ఇంటినే పేకాట డెన్‌గా మార్చేసిన మహిళ భర్త తెగించి పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం బయట ప్రపంచానికి తెలిసింది. ఆ ఇంట్లో మినీ పేకాట డెన్‌ను నిర్వహిస్తున్న మహిళ.. ఆటకు కొంత సొమ్మును తీసుకుంటుందని, పేకాటలో షో గెలిచిన వారికి నగదుకు బదులు కాయిన్స్‌ ఇస్తున్నట్టు గుర్తించారు.
నవ్వు పోదురుగాక మాకేటి సిగ్గు..?
ఇంత జరిగినా జూద శిఖామణుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చిన వీరిని చూసిన వారు చెబుతున్నారు. తాము చేసింది, చేస్తున్నది తప్పు అన్న భావన వారిలో అగుపించలేదని అంటున్నారు. పేకాట ఆడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వీరిని పోలీసులు అరెస్టు చేసి ఫోర్త్‌ టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వీరికి స్టేషన్‌ బెయిలిచ్చి ఇంటికి పంపేశారు. స్టేషన్‌ వద్ద మీడియా ప్రతినిధులు ఫోటోలు, వీడియోలు తీస్తున్నా వారేమీ అభ్యంతరం చెప్పలేదు. నామోషీ భావన కలగలేదు. ఇంతకీ ఈ మహిళా జూదరులు యుక్త వయసులో ఉన్న వారేమీ కాదు.. అంతా 55–65 వయసులో ఉన్నవారే కావడం విశేషం!
ఇలాగే మరికొందరు మహిళలు?
విశాఖ మహా నగరం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. కొన్నాళ్లుగా పాశ్యాత్య సంస్కృతి పొడసూపుతోంది. మహిళలు, యువతులు తప్పటడుగులు వేయడం, పబ్‌లకు వెళ్లడం, సిగరెట్లు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించడం వంటివి అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొందరు మహిళలు పురుషులకు ధీటుగా సరికొత్తగా జూద క్రీడనూ ఎంచుకుంటున్నారు. ఇటీవల లలితానగర్‌లో పట్టుబడిన మహిళా పేకాట రాయుళ్లలో కొందరికి మద్యం, సిగరెట్లు తాగే అలవాట్లున్నాయని తెలుస్తోంది.
Read More
Next Story