లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్పలను విడుదల అంశంలో విజయవాడ కోర్టు వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఈ ముగ్గురికీ శనివారం నాడే విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినా, వారిని విడుదల చేయకుండా కాలయాపన చేశారని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం విడుదల చేయాల్సి ఉండగా దాదాపు 10:30 గంటల వరకు కావాలనే లోపలే ఉంచారు. దీంతో నిందితుల తరపున న్యాయవాదులు, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయ విభాగానికి చెందిన శ్రేణులు విజయవాడ జైలు వద్ద నిరసనలకు దిగారు. జైలు వద్ద భైఠాయించి నినాదాలు చేశారు. విడుదల చేయడంలో కావాలనే జాప్యం చేస్తున్నారని పెద్ద ఎత్తున నిరనసలు వ్యక్తం చేశారు. దాదాపు 10:30 గంటల సమయంలో బెయిలు పొందిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీలను జైలు అధికారులు బయటకు విడుదల చేశారు.
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ధనుంజయరెడ్డి మాట్లాడుతూ.. జైలు అధికారులను, వారు అనుసరించిన తీరును తప్పుబట్టారు. ఆరు గంటల నుంచి కావాలనే జాప్యం చేశారు. కావాలనే వెయిట్ చేయించారు. జైలు సూరిండెంటెండెంట్ వస్తున్నారు, ఏడున్నరకు వస్తారు, ఎనిమిదికి వస్తారు, తొమ్మిది గంటలకు వస్తారు, ఇంకో గంట పడుతుంది అని చెప్పి కావాలనే వెయిట్ చేయించారు. కూటమి ప్రభుత్వానికి, జైలు అధికారులకు న్యాయం అంటే గౌరవం లేదు. చట్టం అంటే గౌరవం లేదు. కోర్టు ఆదేశాలన్నా గౌరవం లేదు. వాటినేమీ పట్టించుకోకుండా కావాలనే డిలే చేశారు. మళ్లీ ఇంకో గంట పడుతుందని జైలు అధికారులు చెబుతున్నారు.
కారణం ఏమంటే.. సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్‌ను మూవ్ చేశారు. హౌస్ మోషన్‌లో స్టే వస్తుందేమో, ఒక వేళ ఏపీ హైకోర్టు స్టే మంజూరు చేస్తే మమ్మల్ని బయటకు వెళ్లనీకుండా మళ్లీ జైల్లోనే బందించాలనే ఆలోచనలు చేశారు. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలపైన లెక్కా పత్రం లేదు ఈ ప్రభుత్వానికి. శనివారం రాత్రి ఆరు గంటలకు విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆదివారం 11:30 గంటల వరకు మమ్మలను విడుదల చేయకుండా కావాలనే డిలే చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదంతా అర్థమైన తాము విడుదల చేయాలని, బయటకు పంపాలని గొడవ చేస్తే అప్పుడు మమ్మలను విడుదల చేశారని ధనుంజయరెడ్డి మండిపడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారి కుటుంబ సభ్యులు, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి కలిశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా శనివారం విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శనివారం నాడే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్‌రెడ్డి విడుదలయ్యారు.