దేవి నవరాత్రులు: ఏడో రోజు శ్రీ సరస్వతీదేవి అలంకణలో కొలువైన అమ్మవారు
x

దేవి నవరాత్రులు: ఏడో రోజు శ్రీ సరస్వతీదేవి అలంకణలో కొలువైన అమ్మవారు

ఆరు రోజుల్లో 4.30లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నేడు సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.


దేవి నవరాత్రులలో ఏడో రోజు దుర్గమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో కొలువయ్యారు. ఏడో రోజు సప్తమి తిథి, మూల నక్షత్రం రోజు దుర్గమ్మ అమ్మవారు చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్వేతపద్మాన్ని అధిష్టించి వీణ, కమండలం, అక్షరమాలను ధరించి, అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకణలో కొలువై ఉన్నారు. ప్రత్యేకించి ఈ రోజు తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యాబుద్దులు సిద్ధించాలని సరస్వతీ పూజలు చేస్తారు. దుర్గమ్మకు ఉన్న అనేక నామాల్లో శ్రీ శారదాదేవి నామం అతి విశిష్టమైంది.

అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజు సందర్భంగా అమ్మవారిని సరస్వతీ దేవిగా భక్తులు ఆరాధిస్తారు. దుర్గమ్మ అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి. తనలోని నిజ రూపాన్ని భక్తులకు సాక్షాత్కరింపచేయడమే ఈ మూల నక్షత్రం నాటి అలంకరణ విశిష్టత. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహా సరస్వతులుగా సప్త నామాలతో అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. చదువుల తల్లి సరస్వతి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్దిని ప్రథాయినిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు.
ఈ రోజు భక్తులు బొమ్మల కొలువులు పెట్టి పేరంటాలతో సందడి చేస్తారు. చదువుకునే విద్యార్థులు ఈ రోజు పుస్తకాలను అమ్మ చెంత ఉంచి తమకు చదువులు బాగా రావాలని పూజలు చేస్తారు. ఇదే రోజు ప్రముఖ దేవాలయాలు బాసర, వర్గల్, శ్రీ కనక దుర్గమ్మ ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు చేస్తారు. శ్రీ సరస్వతీ దేవిగా అలంకరణలో అమ్మవారికి తెలుగు రంగు వస్త్రం సమర్పిస్తారు. తెల్లని పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు.
దేవి నవరాత్రులలో చివరి మూడు రాత్రులు చేసే త్రిరాత్ర వ్రతం ఈ రోజే ప్రారంభిస్తారు. మూల నక్షత్రం నుంచి విజయదశమి వరకు పుణ్య దినాలుగా భావిస్తారు. దుర్గమ్మను ఆరాధిస్తారు. అజ్ఞానాన్ని పారదోలే జ్ఞాన జ్యోతిగా ఈ రోజు అమ్మ వారిని ఆరాధిస్తారు. ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ రోజు సీఎం చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సీఎం వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అదనంగా 1,100 మంది పోలీసులు, 110 హోల్డింగ్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
Read More
Next Story