సచివాలయంలో అగ్ని ప్రమాదం.. ఉలిక్కిపడిన సీఎం
x

సచివాలయంలో అగ్ని ప్రమాదం.. ఉలిక్కిపడిన సీఎం

సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో అగ్ని ప్రమాం చోటు చేసుకున్న ఘటనా స్థలాన్ని ముఖ్యంత్రి చంద్రబాబు పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, హోం మంత్రి వంగలపూడి అనిత, జీఏడీ పోలిటికల్‌ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా ఇతర అధికారులతో కలిసి అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఎప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్‌ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, రెండో బ్లాక్‌లోని యూపీఎస్‌ బ్యాటరీ రూమ్‌ వద్ద ఘటన జరిగిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అయితే ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, దానికి దారితీసిన కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని, విచారణ కొనసాగుతున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ ఆ ప్రదేశంలో లేక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రెండో బ్లాక్‌లో యూపీఎస్‌ బ్యాటరీ రూమ్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్క సారిగా మంటలు వ్యాపించడంతో విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్పీఎఫ్‌ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏపీఎస్పీఎఫ్‌ సిబ్బందితో కలిసి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చారు.
అమరావతి సచివాలయంలో మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు, సీఎస్‌ల పేషీలు ఉంటే రెండో బ్లాక్‌లో దాదాపు ఏడుగురు మంత్రుల పేషీలు ఉన్నాయి. అందులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేషీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి పి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఈ బ్లాక్‌లోనే ఉన్నాయి.
Read More
Next Story