
లూలూ కంపెనీ మీద అంత వల్ల మాలిన ప్రేమ ఎందుకు?
క్యాబినెట్ లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఉపముఖ్యమంత్రి పవన్
లూలూ గ్రూపు మీద రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న అమితానురాగం డిప్యూటి చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ ను కొద్ది గా ఇరుకున పెడుతున్నట్లుంది. ఈ కంపెనీకి ప్రభుత్వానికి ఉన్న అనుబంధం మీద ఆయన చిరాకుపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యం వల్ల, విశాఖలో మాంచి స్థలం కొట్టేసిన లూలూ గ్రూప్ ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి పోతున్నదని పవన్ భావిస్తున్నారు. దీనితో ఆ గ్రూప్ ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలనుకుంటున్నది. లులూగ్రూప్లో భాగమైన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్స్క 7.48 ఎకరాలను కోర్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ కృష్ణా జిల్లా మల్లపల్లి వద్ద ఏర్పాటు చేయాలనుకోవడం ఇందులో ఒక ప్రతిపాదన. ఈ విషయం నిన్న జరిగిన క్యాబినెట్ లో చర్చకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఈ ధోరణిని ఆయన ప్రశ్నించినట్లు కూడా తెలిసింది. ఈ లూలూ గ్రూప్ ఏంచేయాలనుకుంటున్నది, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తుందా, ఇవ్వకపోతే ఏమి చే యాలి, ఆహారశుద్ధి పేరుతో గోమాంసం ప్రాసెస్ చేస్తుందా వగైరా ప్రశ్నలను ఆయన సంధించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రిమండలి సమావేశం అయింది. కృష్ణాజిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్ పోర్ట్స్ 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పా టు చేయాలనుకుంటున్నది. ఇది క్యాబినెట్ లో చర్చకు వచ్చింది. ఈ సందర్బంగా ఈ సంస్థ కార్యకలాపాలమీద క్యాబినెట్ లో ఆసక్తికరమయిన చర్చ జరిగింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఈ సంస్థ మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ బలం చేకూర్చారు. నిజానికి ఇది మౌనంగా ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని నిర్ణయాలను ప్రశ్నించే ధోరణే. ఆహారశుద్ధి పేరిట మెగాఫుడ్ పార్క్ లో లూలూ కంపెనీ ఏం చేస్తుందో సమా చారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు చెప్పిన అస్పష్ట సమాధానం పవన్ కు నచ్చలేదు. ఆహారం అంటే ఏమిటి, పళ్ళా, కూరగాయాలా, లేక గోమాంసమా, ఏమిటి అనేవిషయాలను స్పష్టం చేయాలని ఆయన అధికారులను అడిగారు. ఇది ఒక విధంగా ముఖ్యమంత్రిని ప్రశ్నించడమే. ఎందుకంటే, జగన్ కాలంలో వెళ్లిపోయిన లూలూను మళ్లీ ఏరికోరి రాష్ట్రానికి రప్పిస్తున్నది ఆయనే.
ఊరికే ఆహారశుద్ధి అంటే ఎలా? అక్కడ అసలు ఆహారం ఏమిటి, శుద్ధి ఏమిటి? కూరగాయలు, పండ్లు సాగుచేస్తారా? ఉద్యానవన పంటలు సాగుచేస్తారా? లేక కబేళాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా? అని పవన్ సూటిగా ప్రశ్నించడం క్యా బినెట్ లో ఉన్న అందరిని కొద్దిగా ఇబ్బంది పెట్టింది.
తనని సనాతన హిందూ సంరక్షకుడిగా చాలా కాలంగా చెప్పుకుంటున్న పవన్ క్యాబినెట్ సమావేశంలో గోవధ అనే మాట ప్రయోగించి, “గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకం,” అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇది అందరిని ఇరుకున పడేసింది.
దీనితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జోక్యం చేసుకుని రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లే దని, అలాంటి వాటిని అనుమతించబోమనిచెప్పాల్సి వచ్చింది.
’ఆంధ్ర జ్యోతి’ కథనం ప్రకారం పవన్ మరొక అడుగు ముందుకేసి, లులూ గ్రూప్ వ్యవహారశైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలగురించి ఆరా తీశారు.
లులూ గ్రూపు కు లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5 శాతం మాత్రమే పెంచడం గురించి జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. ప్రతి మూడు 3 ఏళ్లకు 10 శాతం పెంచాలన్న నిబంధనను ఆయన క్యా బినెట్ ముందుంచారు.
'లులూ యాజమాన్యం పదే పదే కోరడంతో పాటు పెద్ద పరిశ్రమ, ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకుని సడలింపు ఇచ్చాం' అని అధికారులు చెప్పి తప్పించుకోవాలనుకున్నారు.
ప్రభుత్వం మీద లులూ గ్రూప్ వత్తిడి తీసుకురావడమేమిటి అని ప్రశ్నిస్తూ ఈ సంస్థ చాలా అతిగా కండీషన్లు పెడుతోందని, ప్రభుత్వానికే తన అవసరం ఉందన్నట్లుగా వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
తర్వాత లూలూ గ్రూపునకు భూములు కేటాయించడం మీదకు చర్చ మళ్లింది.
విశాఖపట్నం, విజయవాడల్లో ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారు? దానికి మార్గదర్శకాలు ఏమి టి? అని కూడా పవన్ ప్రశ్నించారు.
"భూము లు ఇచ్చి మాల్స్ ఏర్పాటు చేయమని ప్రభుత్వం కోరుతున్నది. కానీ ఆ కంపెనీ షరలుతు పెడుతున్నది. ఇదెక్కడి వింత? మూడు సంవత్సరాలకోసారి లీజు పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్స్లో ఉంది. కానీ, ఆ కంపెనీ పదేళ్లకోసారి పెంచాలని కండీషన్ పెడు తున్నది?ఇదే మిటి? మాల్స్ నిర్మించాక ఆ కంపెనీ షాప్ ల రెంట్ ఎలా పెంచుతుంది? మూడేళ్లకో సారి అద్దెలు పెంచుతారా? లేక పదేళ్లకోసారి పెంచుతా మని చెబుతారా? కచ్చితంగా ఏటేటా అద్దె పెంచుకుంటారు. కదా! వారికో న్యాయం? ప్రభుత్వానికో న్యాయమా! ఇలా ఎక్క డైనా ఉంటుందా? దీనిపై మీరేమంటారు?" అని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అధికారులను ప్రశ్నించారు.
అదే విధంగా ఉద్యోగాలు ఎవరికి ఇస్తారో కూడా చెప్పాలని అన్నారు.
విశాఖపట్నం, విజయవాడలో లులూ గ్రూపు నిర్మించే మాల్స్ లో గాని, ఇతర సంస్థలో గాని ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు?స్థానికుల వాటా ఎంత? సహజంగా ఆ కంపెనీ తన సొంత మనుషులనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నాం. ఇక్కడా అలాగే జరగదని గ్యారంటీ ఉందా? అపుడు మనం ఇక్కడ భూములు ఇచ్చి ఏం లాభం? కచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకా శాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మీరుజాగ్రత్తలు తీసుకోబోతున్నారు ?" అని పవన్ అడిగారు.
లులూ గ్రూప్ కొన్ని అతి షరతులు పెడుతున్న మాట వాస్తవమేనని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అంగీకరించినట్లు తెలిసింది.
. "గత జగన్ ప్రభుత్వం ఆ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమివేసింది.ఇపుడు ఎన్డీయే ప్రభుత్వం ఆ కంపెనీని తిరిగి ఆహ్వానించింది. ఆ కంపెనీ అనేక షర తులు విధిస్తున్నది. వాటిని పరిశీలిస్తున్నాం. ప్రజలకూ, రాష్ట్రానికి మేలుచేసే విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుంది" అని మంత్రి అనగాని వివరణ ఇచ్చినట్లు తెలి సింది.
అయితే, లూలూ గ్రూప్ కు భూములు ఇచ్చే ప్రతిపాదన క్యాబినెట్ దాకా వచ్చిందంటే, తెరవెనక ఎంతో చర్చ జరిగి ఉంటుంది. లూలూ గ్రూప్ తో చర్చలు పూర్తి కాకముందే, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మీద,రెంట్ మీద, గోమాంసం శుద్ధి మీద ఏమీ తెలియకుండా అధికారులు కాబినెట్ ప్రతిపాదన తీసుకువచ్చి ఉంటారా? దీని వెనక రాజకీయ జోక్యం ఉండదా అనేవి ప్రశ్నలు. పవన్ ప్రశ్నించిన తీరు ప్రభుత్వం మీద నిఘా పెట్టినట్లు గా అర్థమవుతుంది. గతంలో కూడా ఆయన అమరావతి భూముల రెండో దశ ల్యాండ్ పూలింగ్ మీద ఇలాగే నిలదీయడంతో అది కొంతకాలం వాయిదా పడింది. అయితే, కేవలం లూలూకంపెనీ మీదే కాకుండా ప్రభుత్వ భూములుపొందుతున్న అన్ని కంపెనీల మీద, వాటి ఉద్యోగ కల్పన సామర్థ్యంమీద, అందులో స్థానికుల కోటా మీద కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ నిఘా పెడితే బాగుటుంది.