
విజయవాడ జోజీనగర్ బాధితులతో జగన్
కేశినేని చిన్నీ కుట్రతోనే జోజీనగర్ లో ఇళ్లు కూలాయ్!
బుల్‌డోజర్ సంస్కృతిని విజయవాడకు తెచ్చారని వైఎస్ ఆరోపణ
విజయవాడ భవానీ పురం జోజి నగర్‌లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. 42 బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను బాధితులు వైయస్ జగన్‌కు చూపించారు.
‘25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మావన్నీ కూడా పట్టా భూములే. అన్ని అనుమతులున్నాయి. వాటర్, కరెంట్ బిల్లులు కడుతూ వచ్చాం. మా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారు. మమ్మల్ని రోడ్డున పడేశారు’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో.. ‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటాం’’ అని ఆయన భరోసా ఇచ్చారు.
న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డుపాలు చేశారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ.150 కోట్ల దాకా ఉంటుంది. 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పేటర్ సోదరుడి ప్రమేయం కూడా ఉంది. బాధితులు చంద్రబాబును మూడుసార్లు కలిశారు. లోకేష్‌ను రెండు సార్లు కలిశారు. ఆ ఇద్దరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా కుట్రపూరితంగా.. చంద్రబాబు, లోకేష్, చిన్ని బాధితులకు అన్యాయం చేశారు. బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లాట్లకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారు. స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు?. ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు?.. బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి?.. క్రయవిక్రయాలపై పేపర్లలలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? అని ప్రశ్నించారాయన.
ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని.. వాళ్ల బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తాం. ఒకవేళ మీరు ఎంక్వైరీ వేయకపోతే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుంది. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు.
Next Story

