
ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి
ప్రజాస్వామ్యానికి ప్రాణం సదుపాయాలు కాదు సమర్ధవంతమైన పాలన అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
స్వాతంత్య్రం ద్వారా మనకు స్వేచ్ఛ లభించింది గాని ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతలను తెలుసుకుని మన ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి, ∙జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్స శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగష్టు 15వ తేది ఒక సాధారణమైన రోజు కాదని అది మనకు స్వేచ్ఛను ఇచ్చిన శుభ దినమని పేర్కొన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి కలిగి కోట్లాది మంది ప్రజల కలలు సాకారమైన రోజని అన్నారు.
ఈ స్వేచ్ఛకు మూలం నిరాహార దీక్షలు, ఇరుకైన జైళ్ళ గదుల్లో బందించబడి ఆనేకమంది ప్రాణ త్యాగాల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పారు. కావున జాతిపిత మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామ రాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వంటి ఎందరో మహనీయుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తించు కోవాలని అన్నారు. ముఖ్యంగా ఈ నాటి యువత స్వాతంత్య్రయోధ్యమ చరిత్రను తెల్సుకోవాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు సూచించారు.
ప్రజాస్వామ్యానికి ప్రాణం సదుపాయాలు కాదని సమర్దవంతమైన పాలన అని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రతి ప్రజా సమస్య కూడా చట్ట సభల్లో చర్చించబడాలని సూచించారు. ప్రతి నూతన విధానం ప్రజల శ్రేయస్సు కోసమే ఉండాలని అదే మన లక్ష్యం కావాలన్నారు. నేటి యువత స్వాతంత్య్ర పోరాటం గురించి తెలుసుకుని ఆనాటి త్యాగధనులను గుర్తించుకుని, దేశానికి సేవ చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీ సమావేశాలకు కొంతమంది ఎంఎల్‌ఏలు హాజరు కావడం లేదని, అది వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని స్పీకర్ పేర్కొన్నారు. ఇకనైనా ప్రతి సభ్యుడు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై సభలో చర్చించాలని స్పీకర్ సూచించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఉప కార్యదర్శులు, ఇతర అధికారులు, అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.