తెరపైకి దుర్గమ్మ లడ్డూ ప్రసాదం తయారీలోనూ లోపాలు
దేవుళ్ల లడ్డూ ప్రసాదాల కల్తీపైలపై ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోతోంది. తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం కొలిక్కి రాక ముందే మరో ప్రధాన దేవాలయం ప్రసాదం తెరపైకి వచ్చింది.
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంతో రాష్ట్రం అట్డుడికి పోతోంది. ఈ వ్యవహారం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. జగన్ ప్రభుత్వమే కావాలనే చేసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఆరోపణలు చేస్తుండగా, కావాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం తమపై బురద జల్లుతోందని వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. మరో వైపు హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ వైపు తిరుమల లడ్డూపై ఇంత వరకు నిజం తేల లేదు. నిగ్గు తేల్చ లేదు.
ఈ వివాదం ఇంకా కొలిక్కి రాక ముందే మరో ప్రముఖ దేవాలయం లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల తిరుపతి తర్వాత విజయవాడ దుర్గమ్మ గుడి రాష్ట్రంలోనే పేరు గాంచిన దేవాలయం. విజయవాడలోని దుర్గమ్మ లడ్డూ తయారీలో కూడా లోపాలు ఉన్నట్టు బయటపడ్డాయి. దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వినియోగించే జీడిపప్పు ప్యాకెట్లపై లేబుల్స్ లేవని తనిఖీల్లో వెల్లడైంది. లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారులు చేపట్టిన ఈ తనిఖీల్లో లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలు బయటపడ్డాయి.
కాంట్రాక్టర్లు నాసిరకం సరుకు సరఫరా చేస్తున్నట్టు తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదంలో వాడేందుకు తెచ్చిన వాటిల్లో కిస్మిస్‌లు, జీడిపప్పులు ఉన్నాయ. ప్రసాదంలోకి వాడేందుకు తెచ్చిన 1,100 కిలోల కిస్మిస్‌లోను, మరో 700 కిలోల జీడిపప్పులోను నాణ్యత లేదని గుర్తించిన అధికారులు వాటిని తిరిగి వెనక్కి పంపారు. ఇంకోవైపు లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యి, బెల్లం, శెనగపప్పు నమూనాలను కూడా పరీక్షించేందుకు హైదరాబాదుకు పంపించారు.
దీంతో మరో సారి లడ్డూ ప్రసాదం కల్తీ కలకలం భక్తులను ఆవరించింది. మరో రెండు రోజుల్లో శనివారం రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు మూడు రోజుల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం గమనార్హం.
Next Story