ఏపీలో వైన్‌ షాపులపై తగ్గిన ఆస్తకి
x

ఏపీలో వైన్‌ షాపులపై తగ్గిన ఆస్తకి

ప్రభుత్వం అనుకున్నదొకటి... అయిందొకటి... మంగళవారం నాటికి 20వేల దరఖాస్తులు మాత్రమే వైన్‌ షాపులకు వచ్చాయి. లక్షకుపైగా వస్తాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.


ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీ మారింది. ప్రభుత్వ ఆధీనంలో నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మద్యం షాపులు వెళ్తున్నాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మూడు నెలల పాటు అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మద్యం పాలసీని ప్రభుత్వం రూపొందించింది. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం ప్రభుత్వమే అమ్మి ప్రజల డబ్బును కొల్లగొట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం నేటికీ విమ్శలు గుప్పిస్తూనే ఉంది. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను కేటాయించడం ద్వారా నాణ్యమైన మద్యాన్ని మందు బాబులకు అందించడంతో పాటు సరసమైన ధర కూడా నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆలోచన ప్రకారం మద్యం దుకాణాల నిర్వహణ కోసం భారీ స్థాయిలో ప్రైవేటు వ్యక్తులు ధరఖాస్తులు చేశారని ప్రభుత్వం భావించింది. అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులను జారీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించింది. అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా 10వ తేదీ కూడా దరఖాస్తులు స్వీకరించేందుకు నిర్ణయించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 20,310 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా డిపాజిట్లుగా చెల్లించే నాన్‌ రీఫండబుల్‌ రుసుం రూ. 406 కోట్లు వచ్చింది. విచిత్రం ఏంటంటే.. సోమవారం ఒక్క రోజే 12,036 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి దరఖాస్తు ఫీజు కింద రూ. 2లక్షలు తీసుకున్నారు.
జిల్లాల వారీగా ఒక సారి పరిశీలిస్తే.. సోమవారం మధ్యాహ్నానానికి అనకాపల్లి జిల్లా 136 షాపులకు 267 దరఖాస్తులొచ్చాయి. అనంతపురంలో 136 షాపులకు 289, అన్నమయ్య జిల్లాలో 111 షాపులకు 232, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 షాపులకు 75, బాపట్ల జిల్లాలో 117 షాపులకు 243, చిత్తూరు జిల్లాలో 104 షాపులకు 287, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 133 షాపులకు 311, తూర్పు గోదావరి జిల్లాలో 125 షాపులకు 424, ఏలూరు జిల్లాలో 144 షాపులకు 706, గుంటూరు జిల్లాలో 127 షాపులకు 394, కాకినాడ జిల్లాలో 155 షాపులకు 197 దరఖాస్తులు, కృష్ణా జిల్లాలో 123 షాపులకు 222, కర్నూలు జిల్లాలో 99 షాపులకు 302, నంద్యాలలో 105కు 217, ఎన్టీఆర్‌ జిల్లాలో 113కు 613, పల్నాడులో 129కి 224, ప్రకాశం జిల్లాలో 171 షాపులకు 231, మన్యం జిల్లాలో 52 షాపులకు 174, నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179, సత్యసాయి జిల్లాలో 87 షాపులకు 132, శ్రీకాకుళంలో 158 షాపులకు 503, తిరుపతి జిల్లాలో 227 షాపులకు 165, విశాఖ జిల్లాలో 155 షాపులకు 278, విజయనగరం జిల్లాలో 153 షాపులకు 855, పశ్చిమ గోదావరి జిల్లాలో 175 షాపులకు 356, కడప జిల్లాలో 139 షాపులకు 398 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,396 షాపులకు సోమవారం నాటికి 8,274 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒక్క రోజే 12,036 దరఖాస్తులు రావడం విశేషం.
ప్రభుత్వ అధికారులు అనధికారికంగా చెబుతున్న గణాంకాల ప్రకారం మంగళవారం నాటికి 931 షాపులకు అసలు దరఖాస్తులే రాలేదని సమాచారం. నిన్నటి వరకు దరఖాస్తులు అందిన వాటిల్లో తిరుపతి జిల్లాలో 227 షాపులుంటే 165 షాపులకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయంటే కనీసం దుకాణానికి ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. నెల్లూరు జిల్లాలోను ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో మాత్రం 144 షాపులుంటే ఇప్పటి వరకు కేవలం 706 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలోను సోమవారం సాయంత్రానికి వెయ్యి వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో ఉన్నది 153 షాపులు మాత్రమే.
వినియోగదారులకు నాణ్యమైన మద్యాన్ని అందించడమే లక్ష్యంగా మద్యం షాపులకు నోటిఫికేషన్‌ వేశామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈ షాపుల డ్రా అయిపోయిన తర్వాత గీత పనివార్లకు కేటాయించిన 10 శాతం అంటే 340 షాపులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా డ్రా నిర్వహిస్తామన్నారు. భారత దేశంలో ఏ ప్రాంతం నుంచైనా ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకొని డ్రాలో పొల్గొనొచ్చని మంత్రి చెప్పడం విశేషం. మద్యం షాపులను దక్కించుకునేందుకు సిండికేట్లుగా ఏర్పడినట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దరఖాస్తులు అనుకున్న స్థాయిలో రాకపోవడానికి ప్రధాన కారణం కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అనే విమర్శలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని ఒక నియోజక వర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మద్యం షాపుల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. తనకు తెలియకుండా దరఖాస్తులు చేయొద్దని, ఎవరైనా షాపుల కోసం దరఖాస్తులు చేయాలంటే ముందుగా ఎమ్మెల్యే మనుషులకు రూ. 10 లక్షలు ఇవ్వాలని, తర్వాత డిపాజిట్లు ధరఖాస్తుదారులే కట్టుకోవాలని, షాపు లాటరీలో వస్తే ఏడాదికి రూ. 30లక్షలు ఎమ్మెల్యే అనుచరులు చెప్పిన విధంగా అందించాలని బెదిరింపులకు పాల్పడినట్లు ఆ ప్రాంతంలో చర్చ సాగుతోంది. అందుకే ఈ నియోజక వర్గంలో చాలా తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కృష్ణా జిల్లా మొత్తమ్మీద 123 షాపులుంటే 222 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అంటే సగటున ఒక్కో షాపునకు రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నియోజక వర్గంలో ఎమ్మెల్యే మనుషులు కొందరు ప్రతి మండలానికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని నియమించినట్లు సమాచారం. ఆ వ్యక్తి ద్వారా ఆ మండలంలో ఏ షాపునకు ఎవరెవరు దరఖాస్తులు చేశారనే వివరాలు సాయంత్రానికి ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సమాచారం తీసుకుంటున్నారు.
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకునేందుకు ఈ నెల 10 వరకు గడువుంది. ఈ లెక్కన ఎన్ని ఎక్కువ దరఖాస్తులు వచ్చినా, అవి మరో 30 వేలకు మించి వచ్చే అవకాశం ఉండక పోవచ్చని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. లక్షకు పైగా దరఖాస్తులొస్తాయని, వాటి వల్ల వచ్చే రుసుమే వేల కోట్లల్లో ఉంటుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. ఒక వేళ అసలు దరఖాస్తులే రాని షాపులు మిగిలిపోతే వాటి పరిస్థితి ఏంటి? తిరిగి రెండో సారి నోటిఫికేషన్‌ ఇస్తారా? మొదటి నోటిఫికేషన్‌పైనే దరఖాస్తులు తీసుకునేందుకు గడువును పొడిగించి స్వీకరిస్తారా? అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించ లేదు.
Read More
Next Story