ఆర్టీజీఎస్ డేటా లేక్ పనులు నవంబరు కల్లా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెస్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీజీఎస్ డేటాను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సును ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్పారు.
మన వద్ద ఉన్న డేటాతో ఆయా శాఖలు ఏమేమి కావాలని కోరుకుంటున్నాయో ఆయా శాఖల అధికారులు, కార్యదర్శులతో చర్చించి ఆ దిశగా యూస్ కేసెస్ రూపొందించేలా ఆర్టీజీఎస్ పనిచేయాలన్నారు. ఈ–క్రాప్ డేటాను, ఆయా ప్రాంతాల్లో భూసార డేటాను అనుసంధానించుకుని విశ్లేషించి, ఆయా ప్రాంతాల్లో రైతులు తక్కువగా ఎరువులు వినియోగించుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి కూడా ఒక శాస్త్రీయ విశ్లేషణ ఉండాలన్నారు.
ఈ నెల 15వ తేదీ నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 రకాల ప్రభుత్వ సేవలను పౌరులకు అందించనున్నామని సీఎం పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో సేవలు పొందడంలో పౌరులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలన్నీ చూసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా పౌరులు వాట్సాప్ ద్వారానే సేవలు పొందవచ్చని దీనిపై పౌరులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకునే వారి శాతం మరింత పెరగాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లోని అవేర్ విభాగం రూపొందించిన అవేర్ 2.0 వెర్షన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో వర్షపాతాన్ని ముందుగానే ఈ విధానంద్వారా అంచనా వేయొచ్చు అన్నారు.
నదుల్లోకి పరివాహక ప్రాంతాల నుంచి ఏ సమయంలో ఎంత మాత్రం వర్షపు నీరు వస్తుంది, కురిసిన వర్షం భూమిలోకి ఎంతమేర ఇంకుతోంది, వర్షపు నీటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపైన రియల్ టైమ్ డేటా విశ్లేషణ చేసి సంబంధిత శాఖలను ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామాల్లో చెరువుల పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం ఉంది కాబట్టి నీటి కరవు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలను ఉపయోగించుకుని రియల్ టైమ్‌లో విశ్లేషించుకుని శాంతిభద్రతల పర్యవేక్షణకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు.
వీటిని కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలు, శాంతిభద్రతల పర్యవేక్షణకే కాకుండా వరదలు, తుపాన్ల వంటి సమయంలో రోడ్లపై ఎక్కడెక్కడ వర్షపు నీరు, వరద నీరు నిలిచిపోయింది తదితర అంశాలు పరిశీలించి ఎప్పటికప్పుడు ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేలా చూడాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పౌరులకు వాట్సాప్ ద్వారా వాళ్లు ఎలా ఉల్లంఘనకు పాల్పడింది వీడియోలు పంపి వారికి తెలియజేసి తదుపరి అలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా చైతన్యవంతం చేయాలన్నారు.
రాష్ట్రంలో డ్రోన్ సేవలు విస్తృతంగా అందేలా డ్రోన్ కార్పొరేషన్ పనిచేయాలని సీఎం అన్నారు. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా 45 యూస్ కేసెస్ సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపైన సీఎం స్పందిస్తూ వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా చూడాలన్నారు. పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గించడానికి రైతులు డ్రోన్లు ఉపయోగించుకునేలా చేయాలని చెప్పారు. అంటు వ్యాధుల నివారణకు, దోమల వ్యాప్తిని అరికట్టడానికి డ్రోన్లను విరివిగా వినియోగించుకోవాలని, డ్రోన్ సిటీ నిర్మాణ పనుల వేగవంతం చేయాలని సూచించారు.