వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి పులివెందులలో నామినేషన్
x

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి పులివెందులలో నామినేషన్

పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి జైభీమ్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు షేక్ దస్తగిరి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.


పులివెందుల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలో 2014లో ప్రతిపక్ష నాయకుడుగా, 2019 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం తప్ప వేరే వారికి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అయితే తన చిన్నాన్నను చంపించిన వారిలో జగన్ ఒకరని, ఆయనకు కూడా వైఎస్ వివేకానందరెడ్డిని చంపుతామనే విషయం తెలుసని, అందుకే హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన ఆయనపై తాను పోటీ చేస్తున్నట్లు దస్తగిరి ప్రకటించారు.

నేను వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపానని దస్తగిరి సీబీఐ వారికి ఇప్పటికే చెప్పారు. అప్రువర్ గా మారానని, అందుకే నిజాలు చెబుతున్నానని సీబీఐతో ఎవరెవరు ఎలా వివేకానందరెడ్డిని చంపామనే విషయాన్ని ఇప్పటికే చెప్పారు. పలు మార్లు మీడియా ఇంటర్వ్యూలలో కూడా ఇదే విషయం వెల్లడించారు. ఎమ్మెల్యే కావడం ద్వారా తన తప్పులు మాసిపోతాయనుకున్నారో ఏమో కాని ఏకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు రంగంలోకి దిగుతున్నారు. జైభీమ్ పార్టీకి అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్. ఈయన హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు.

మంగళవారం వేసే నామినేషన్ కు బారీ స్థాయిలో జనాన్ని తీసుకు రావడానికి దస్తగిరి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కదిరి మండలంలోని తలుపుల ప్రాంతం నుంచి కనీసం రెండు నుంచి మూడు వేల మందికి తగ్గకుండా జనాన్ని సేకరించాలనే ఆలోచన చేస్తున్నారు. దస్తగిరి నామినేషన్ వేయడానికి రెడీ కావడం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం కూడా ఉందనే వాదన ఉంది.

తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. జగన్ చిన్నాన్నను చంపినట్లు కోర్టులో అంగీకరించిన వ్యక్తిగా దస్తగిరి రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు. ఈయన జైభీమ్ పార్టీలో చేరి పోటీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

వివేకా హత్యకేసులో ఎప్పుడు ఏమేమి జరిగాయి

2019 మార్చి 15న హత్య, అదే రోజు అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు

మార్చి 28న వివేకా పీఏతో పాటుగా ముగ్గురు అరెస్ట్

జూన్ 13న ఎస్పీ స్థాయి అధికారికి సిట్ బాధ్యతలు అప్పగింత

సెప్టెంబర్ 2న కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతి

2020 ఫిబ్రవరి 7న సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటీషన్ ఉపసంహరించుకున్న జగన్

మార్చి 3న వైఎస్ఈ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి మృతి

మార్చి 11న సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు

2021 ఆగష్ట్ 3 సునీల్ యాదవ్ అరెస్ట్

ఆగస్ట్ 31న అప్రువర్ గా మారిన దస్తగిరి కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు వాంగ్మూలం

సెప్టెంబర్ 9 గజ్జల ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్

నవంబర్ 18న వైఎస్సార్సీపీ కార్యదర్శి శంకర్రెడ్డి అరెస్ట్

2022 జూన్ 9న గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి మృతి

నవంబర్ 22న కేసు ని కడప కోర్టు నుంచి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు

2023 జనవరి 28న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్‌ రెడ్డి విచారణ

ఫిబ్రవరి 3న కడపలో జగన్ ఓఎస్డీ తో పాటుగా భారతి అనుచరుడు నవీన్ విచారణ

ఫిబ్రవరి 23న విచారణకు హాజరుకావాలని వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు

Read More
Next Story