కేంద్రం తెచ్చిన చీకటి జీవోతో ఏపీకి నష్టం
x

కేంద్రం తెచ్చిన చీకటి జీవోతో ఏపీకి నష్టం

కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 4, 2023లో నదీ జలాల పంపకంలో తెలంగాణకు అనుకూలంగా జీవో ఇచ్చిందని, ఇది ఏపీ నీటి హక్కులను కాలరాసే చీకటి జీవో అని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు.


కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 4, 2023లో నదీ జలాల పంపకంలో తెలంగాణకు అనుకూలంగా జీవో ఇచ్చిందని, ఇది ఏపీ నీటి హక్కులను కాలరాసే చీకటి జీవో అని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. ఏపీకి నష్టం చేసే ఈ జీవో రద్దుకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామనాయుడుని కోరారు. బుధవారం ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తోపాటు మంత్రిని కలిశారు. అలాగే సచివాలయంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లను కలిశారు.‌

ఎన్డీయే ప్రభుత్వంలో వర్షాకాలం ప్రారంభమైన తొలి మాసాల్లోనే కృష్ణా నదిలో వరదలతో శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జునసాగర్ , పులిచింతల, ప్రకాశం బ్యారేజి నిండటంతో రైతాంగంలో ఆనందం నెలకొందని బొజ్జా ఈ సందర్భంగా మంత్రులకు తెలిపారు. కృష్ణా నది వరదలతో పరవళ్లు తొక్కుతున్న నేపథ్యంలో కూడా ఈ నీటిని రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు మళ్లించడంలో అనేక అవాంతరాలు ఉన్న విషయాన్ని ప్రాజెక్టుల వారిగా ఈ సందర్భంగా మంత్రులకు వివరించారు.

హంద్రీ - నీవా, గాలేరు నగరి, బ్రహ్మసాగర్ ద్వారా తెలుగు గంగకు నీటి తరలింపులలో వున్న సమస్యలు, గత ఏడు సంవత్సరాలుగా మరమ్మత్తులు నోచుకోక నిరుపయోగంగా వున్న అలగనూరు రిజర్వాయర్, కుంగిన రివిట్మెంట్ తో గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మత్తులు, లక్షలాది ప్రజల దాహార్తని తీర్చే గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాలపై జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి, బొజ్జా దశరథరామిరెడ్డి లు మంత్రులకు వివరించారు. ఈ అవాంతరాలు అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని వీటిని సవరించి కృష్ణానది నీటిని సమగ్రంగా రాయలసీమ ప్రాజెక్టులు పొందడానికి కావలసిన నిర్మాణాల పట్ల ప్రత్యేక దృష్టిని పెట్టాలని బొజ్జా మంత్రులను కోరారు.

దీని కోసం వెంటనే చేపట్టాల్సిన మరమ్మతులకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు. తక్షణమే చేపట్టే కార్యక్రమాలతో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు నీరు లభించడానికి చేపట్టవలసిన ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు, రిజర్వాయర్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టితో ఒక ప్రణాళికను రూపొందించి, రాయలసీమలో కరువు, వలసలను నివారించాలని జలవనురుల శాఖ మంత్రికి బొజ్జా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి అంశాలపై విశ్లేషణాత్మకంగా వ్రాసిన "నీటి అవగాహనే రాయలసీమకు రక్ష" పుస్తకాన్ని మంత్రి నిమ్మలకు బొజ్జా ఇచ్చారు.

బొజ్జా వివరించిన సాగునీటి అంశాలపై మంత్రి నిమ్మల సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, ఆ విధంగా కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు. మంత్రులు NMD ఫరూఖ్, BC జనార్థన్ రెడ్డి లు కూడా రాయలసీమ సాగునీటి అంశాలను సీఎం దృష్టికి తీసుకుపోతామని తెలిపారు.

అంతకు ముందు జల వనరుల శాఖ (సాగునీరు) ఇ ఎన్ సి వెంకటేశ్వరావు, జల వనరుల శాఖ (అంతర్ రాష్ట్ర విభాగం) ఇ ఎన్ సి శ్రీనివాస్ లను బొజ్జా కలిసి పై విషయాలను వారికి వివరించారు. ఈ విషయాలను ప్రభుత్వం ముందు ఉంచి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసి నీటి అవగాహనే రాయలసీమకు రక్ష పుస్తకాన్ని అందచేసి, వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అండగా వుండాలని మంత్రి ఆనంకు బొజ్జా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వాడల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
Next Story