'రాయలసీమ ఏపీలో భాగమే అని మర్చిపోకండి'
ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుంచుకుని రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు.
రాయలసీమ అభివృద్ధిలో నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుంచుకుని రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాల ఉద్యమాల ఫలితంగా గత వైసిపి ప్రభుత్వం శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ ఆ ఒప్పందంలో భాగంగా రాయలసీమలో కొన్ని రాష్ట్ర స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమలో ఏర్పాటు అయిన కార్యాలయాలను అమరావతికి తరలిస్తున్నారనే వార్తలు తనని ఆందోళన కలిగించాయన్నారు.
గత ప్రభుత్వం శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నాం అంటూనే కీలకమైన హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చెయ్యకుండా, కొన్ని న్యాయ సంబంధిత సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేసిన విషయాన్ని బొజ్జా ఈ సందర్భంగా గుర్తు చేసారు. సాగునీటి రంగాన్ని పూర్తిగా అలక్ష్యం చేసి ప్రాజెక్టులను శిధిలావస్థకు దిగజార్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి 2024 సార్వత్రిక ఎన్నికలలో రాయలసీమ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ప్రకటనలో పేర్కొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమంలోనూ, పార్డీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన, తదనంతర కార్యక్రమాలలో రాయలసీమ సమానాభివృద్ధికి, సాగునీటి రంగ అభివృద్ధికి సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్ తదితర నిర్మాణాలతో పాటు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్ తదితర అనేక అంశాలను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు దేశం పార్టీ పై సంపూర్ణ విశ్వాసంతో రాయలసీమ ప్రజలు ఆ పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మ రథం పట్టారని స్పష్టం చేశారు.
రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగం అనే భావనతో రాయలసీమ సమానాభివృద్ధికి చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేపడతామని ప్రకటించడాన్ని సాగునీటి సాధన సమితి ఆహ్వానించిందని దశరథరామిరెడ్డి వెల్లడించారు. కానీ ప్రకటించిన కార్యక్రమాల అమలుపై కార్యాచరణ చేపట్టకుండా, ఉన్న అరకొర కార్యాలయాల తరిలింపుపై వార్తలు రావడం రాయలసీమ సమాజానికి దిగ్బ్రాంతికి గురిచేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యాలయాల తరలింపు చేపట్టడం లేదని ప్రభుత్వం ప్రకటిస్తూనే, రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనల కార్యాచరణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం తక్షణమే స్పందించి, రాష్ట్ర సమగ్రత విచ్చిన్నం జరగకుండా ఆపాలని బొజ్జా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.