ఉత్తరాంధ్రకు ‘దానా’ ఎఫెక్ట్.. భారీ వర్షం సూచన
ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న ‘దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది.
దానా తుపాను ఉత్తరాంధ్రలో కలకలం రేపుతోంది. దీని ప్రభావం ఉత్తరాంధ్రమీద తీవ్రం ఉండే అవకాశముంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, శుక్రవారం తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పోర్టులకు రెండో నంబర్ హెచ్చరిక జారీ చేశారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అంతేకాకుండా సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
దానా తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దానా ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీని ప్రభావం ఉండనుంది. ఉత్తరాంధ్రతో పాటు తక్కిన చోట్ల మూడు రోజులు వర్షాలు పడనున్నాయి. వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Next Story