డామిట్ కథ అడ్డం తిరిగింది.. పేర్ని నాని స్వయంకృతమేనా?
రేషన్ బియ్యం మాయం వ్యవహారం నుంచి బయట పడేందుకు పేర్ని నాని రాసిన లేఖ..ఆయన ఫ్యామిలీకి చుట్టుకుంది. తాజాగా కోటి రూపాయలు చెల్లించడం కూడా చర్చగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులంతా ఒకెత్తైతే.. వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య( నాని) ఎపిసోడ్ మరొక ఎత్తులా మారింది. రాష్ట్రంలోని రేషన్ బియ్యం కేసులన్నీ పక్కకు పోయి.. పేర్ని నానినే రేషన్ బియ్యం మొత్తాన్ని మాయం చేసినట్లుగా సీన్ మారిపోయింది. మాయమైన రేషన్ బియ్యం కేసుకు భయపడి పేర్ని నాని కుటుంబం పారిపోయిందని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రతి విషయానికి మీడియా ముందుకొచ్చి మాట్లాడే పేర్ని నాని.. పారిపోయారనే దానిపైన కానీ, అజ్ఞాతంలోకి వెళ్లారనే దానిపైన కానీ, కేసులకు భయపడుతున్నారనే దానిపైన కానీ ఖండించక పోవడంతో అధికార పక్షం చేస్తున్న ఆరోపణలను బలపరుస్తున్నట్లుగా ఉందనే భావన వ్యక్తం అవుతోంది.
లేఖతో వెలుగులోకి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం తనిఖీల నేపథ్యంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. గత పాలకుల ఆధ్వర్యంలోనే ఈ అక్రమ రవాణా జరుగుతోందని పవన్ కల్యాణ్ ఆరోపించడంతో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల్లో ఒక్క సారిగా కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో పేర్ని నాని స్పందించారు. తమకు తెలియకుండా తమ గోడౌన్‌లో నిల్వ ఉన్న రేషన్ బియ్యం మాయమైందని, దీనిపై విచారణ జరిపించాలని నవంబరు 26న పేర్ని నాని కుటుంబం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు డిసెంబరు 4న తనిఖీలు నిర్వహించారు. దాదాపు 3,708 బస్తాలు అంటే 1,85,400కేజీల రేషన్ బియ్యం మాయమయ్యాయని నిర్థారించిన అధికారులు దీనిపై నిగ్గు తేల్చాలని పౌరసరఫరాల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబరు 10న పోలీసులు కేసు నమోదు చేశారు. మాయమైన బియ్యం విలువ రూ. 86లక్షలు ఉంటుంది.
ఈ నెల 13న పేర్ని నాని కుటుంబీకులు మాయమైన రేషన్ బియ్యానికి సంబంధించి కోటి రూపాయల డీడీని తమ న్యాయవాది ద్వారా పౌరసరఫరాల శాఖ అధికారులకు అందజేశారు. ఇప్పుడు ఇది కూడా వివాదాస్పదంగా మారింది. కేసు నమోదైన తర్వాత డీడీలు తీయించడం గమనార్హం. అయితే డీడీలు తీయడానికి అంత పెద్ద మొత్తం ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు సమకూర్చారు? ఎవరి ఆదేశాల మేరకు ఇంత భారీ సొమ్ము ఇచ్చారు? డీడీలు తీసిన వారిని ఎందుకు విచారించ లేదు? అనే అంశాలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ మొత్తం ఎపిసోడ్‌ను ఒక సారి గమనిస్తే.. నాని స్వయంకృతమే స్పష్టం అవుతోంది. ఆ బియ్యం ఎప్పుడు మాయమైందనేది ఆయన లేఖ రాసే వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఎన్నికలు ముగిసి ఓటమి పాలై కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటుతిరి ఎటు వస్తుందో అనే ముందు చూపుతో నాని రాసిన లేఖ బియ్యం బాగోతాన్ని బయటపెట్టింది. ఆయన నిర్వహణలో ఉన్న గోడౌన్‌లో మాయమైన బియ్యానికి నానియే బాధ్యత వహించాల్సి ఉంటుందనేది ఇప్పుడు కూటమి సంధిస్తున్న ప్రశ్న. దీనికి తోడు తాజాగా మాయమైన బియ్యానికి రూ. కోటి చెల్లించడంతో ఆ తప్పు తనపై వేసుకున్నట్లు అవుతుందని ఆయన సన్నిహితుల్లో జరుగుతున్న చర్చ. ఈ టోటల్ ఎపిసోడ్‌లో పేర్ని నాని నిజాయితీని నిరూపించుకోవడం కంటే అతి జాగ్రత్తతో రాసిన లేఖ నుంచి డబ్బులు చెల్లింపుల వరకూ.. అన్నీ వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయి.
Next Story