తోట త్రిమూర్తులు ఎలా గెలుస్తాడో చూస్తామంటున్న ఈ దళితులు ఎవరు?
x

తోట త్రిమూర్తులు ఎలా గెలుస్తాడో చూస్తామంటున్న ఈ దళితులు ఎవరు?

శిరాముండనం కేసులో తోట త్రిమూర్తులు వేసిన శిక్షపై దళిత సంఘాల నేతలు, మానవహక్కుల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.


(శివరామ్)

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారా? శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు పడిన శిక్ష నామమాత్రమేనా? కోర్టు తీర్పులో న్యాయం అంతంత మాత్రమేనా? అంటే అవుననే అంటున్నాయి దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాలు. విశాఖపట్నంలోని ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక విభాగం ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసేందుకు ఆ సంఘాలు సిద్దమౌతున్నాయి.

ఎస్సీ ఎస్టీ కోర్టులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని విశాఖపట్నం దళిత సంఘాల ఐక్యవేదిక (విదసం) రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు. తోట త్రిమూర్తులపై కేసు ఐదు సెక్షన్ల కింద నేరం రుజువు అయిందన్నారు. తీవ్ర నేరం జరిగితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని గుర్తు చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పు నిరాశ, నిస్పృహ రీతిలో ఉందని అభిప్రాయపడ్డారు. నిందితుడికి నేరం నుంచి ఊరట కలిగించే విధంగా తీర్పు ఉందని, తీర్పును పునః సమీక్షించాలని కోరారు. తీర్పుపై హై కోర్టుకు వెళతామని, తమను ఏమీ చేయలేరన్న ధీమాతో వ్యవహరిస్తున్న తోట త్రిమూర్తులు, వైసీపీ నేతల తీరును ఆయన ఖండించారు. వైసీపీ ప్రభుత్వం అండతో కోర్టులు ఏమి చేయలేవు అని త్రిమూర్తులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.

త్రిమూర్తులకు టికెట్ ఇచ్చిన జగన్ పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరని, వెంటనే ఆయన దళితులకు క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఎలా పోటీ చేసి గెలుస్తారో చూస్తామని సవాల్ విసిరారు. ఈ శిరోముండనం వ్యవహారం వెలుగులోకి తెచ్చిన విలేకరి రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. విదసం కో –కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ, సుదీర్ఘ పోరాటంతో వచ్చిన తీర్పు సంతృప్తి కరంగా లేదన్నారు.

దళిత నాయకుడు కే చిన్నారావు మాట్లాడుతూ, సామాజిక న్యాయం అంటున్న జగన్ ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన త్రిమూర్తులను ఎన్నికల బరి నుంచి తప్పించాలని కోరారు. సమావేశంలో విదసం నేతలు సుధాకర్, ఓంకార్, త్రినాధ్, రాజేంద్ర ప్రసాద్, ఈశ్వరరావు, ప్రసాద్ కూడా తీవ్ర స్థాయిలోనే వైసీపీపైన, తోట త్రిమూర్తులు పైన ఆరోపణలు చేశారు. శిరోముండనం కేసు తీర్పులో న్యాయం నామమాత్రమే

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ స్సెషల్ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం నామమాత్రంగానే ఉందని మానవ హక్కుల వేదిక అభిప్రాయపడింది. నిందితులు నేరం చేశారని చట్టపరంగా నిర్ధారించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన న్యాయస్థానం శిక్ష కాలాన్ని ఖరారు చేసే విషయంలో ఉదార వైఖరిని ఎందుకని ప్రశ్నించింది. ఆ కేసులో ఉన్న రెండు సెక్షన్లలో గరిష్టంగా ఐదేళ్ల వరకూ శిక్ష వేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 18 నెలలు మాత్రమే శిక్షాకాలంగా ఖరారు చేయడంలో న్యాయస్థానం నేరం యొక్క కులాధిపత్య స్వభావాన్ని పరిగణలోకి తీసుకోలేదని అనిపిస్తుందని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యూ జీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వై రాజేష్, ఉపాధ్యక్షుడు జి శివ నాగేశ్వర రావు, కార్యదర్శి జి రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేరం కేవలం బాధిత వ్యక్తుల పట్ల మాత్రమే జరిగింది కాదని, ఒక అణగారిన సమూహం పట్ల జరిగిందని, న్యాయస్థానం ఉదారంగా వ్యవహరించడానికి సహేతుకమైన కారణాలేమీ కనిపించడం లేదని వారు అన్నారు. కేసును 28 ఏళ్ల పాటు సాగదీయడంలోనే నిందితుల స్థాయి, ఉద్దేశం అర్థం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆ కేసులో శిక్ష కాలాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేయాలని వేదిక డిమాండ్ చేసింది. లేనిపక్షంలో బాధితులు ప్రైవేటు అప్పీలు చేసుకోనేందుకు తాము సహకరిస్తామని మానవహక్కుల వేదిక నేతలు.

Read More
Next Story