పోస్టింగ్ ఇవ్వకుండానే ఇంటికి పంపుతారా?
x

పోస్టింగ్ ఇవ్వకుండానే ఇంటికి పంపుతారా?

తనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవడంపై ఏబీ వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. తనకు పోస్టింగ్ ఇస్తారన్న భయంతోనే సీఎస్.. క్యాట్ ఆదేశాలను హైకోర్టులో ఛాలెంజ్ చేశారన్నారు.


పోస్టింగ్ ఇవ్వకుండానే తనకు రిటైర్మెంట్ ఇచ్చి పంపించేయాలని ప్రస్తుత ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఫ్యాక్షనిస్టులా మారితే గిట్టని వారిని ఎలా వేధిస్తుంది అన్నదానికి తానే నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. గత ఐదేళ్లుగా తనను సస్పెన్షన్లు, అక్రమ కేసులను ఇబ్బందులు పెట్టారు. తీరా తన సస్పెన్షన్ చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. కానీ తనకు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. తాను పదవి విరమణ చేయడానికి ఎంతో సమయం లేదని, ఇంతలో తనకు ఏ పదవి ఇవ్వకూడదని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించుకుందని, అందుకే సీఎస్ దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు స్పందన లేదని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సీఎస్ జవహర్ రెడ్డి.. ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయడంపై కూడా ఐపీఎస్ సర్కిల్స్‌లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పిటిషన్ కూడా ఏబీవీకి పోస్టింగ్ రాకూదనే దాఖలు చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై కేసు నమోదయితే.. సీఎస్ స్థానంలోకి తన తర్వాత వచ్చే అధికారి ఏబీవీకి పోస్టింగ్ ఇస్తారన్న భయంతోనే సీఎస్ జవహర్ ఈ పిటిషన్ దాఖలు చేశారా అన్న అనుమానాలను ఐపీఎస్ సర్కిల్స్ వ్యక్తం చేస్తున్నాయి.

వారం రోజులవుతున్నా మౌనమే

తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సీఎస్‌కు దరఖాస్తు చేసుకుని వారం రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఏబీవీ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్ తీర్పునిచ్చినా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటకు రావడానికి 3రోజుల సమయం పట్టింది. డాక్యుమెంట్లు వచ్చీ రాగానే వాటిని తీసుకున్న ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే సీఎస్‌ను కలిసి తనను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు దాఖలు చేసి ఇప్పటికి వారం రోజులు అవుతున్నా దానిపి సీఎస్ స్పందించలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఏబీవీ పోస్టింగ్‌పై ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈసీకి పంపాల్సిన ఏబీవీ డాక్యుమెంట్లను సీఎస్.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించినట్లు సమాచారం.

అసలు ఆలోచన అదేనా

ఇప్పటివరకు ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ అంశంపై సీఎస్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం అనేక అనుమానాలను తావిస్తోంది. అసలు పోస్టింగ్ ఇచ్చే ఆలోచనా ఉందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది. సాధారణంగా క్యాట్ ఆదేశాలను ఎవరైనా ఆఘమేఘాలపైన అమలు చేస్తారు. ఆదేశాలు వచ్చీ రాగానే పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కానీ క్యాట్ ఆదేశాలు వచ్చి 13 రోజులు, పోస్టింగ్ కోసం ఏబీవీ దరఖాస్తు చేసుకుని వారం రోజులు అవుతున్నా సీఎస్ స్పందించకపోవడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ నెలతో ఆయన పదవీకాలం ముగియనున్న క్రమంలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పంపాలని సీఎస్, ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, అందుకనే ఇంత ఆలస్యం చేస్తున్నారని ఏబీవీ కూడా అనుమానం వ్యక్తం చేశారు. తన పదవిని లాక్కున్న ప్రభుత్వం ఆఖరికి తన ప్రాథమిక హక్కు ఓటును కూడా లాగేసుకుందని తెలిపారాయన.

Read More
Next Story