తెలంగాణాలో ఏడుపు రాజకీయాలు
x

తెలంగాణాలో ఏడుపు రాజకీయాలు

అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని తప్పుగా చిత్రీకరించి తనను అసభ్యంగా చిత్రీకరిస్తారా అంటు మంత్రి కొండా సురేఖ భోరున ఏడ్చేశారు.


తెలంగాణా రాజకీయాల్లో ఏడుపుగొట్టు రాజకీయాలు కొత్తగా మొదలయ్యాయి. ఆమధ్య రేవంత్ రెడ్డి తనను ఏదో అనేశాడంటు మాజీమంత్ర సబితా ఇంద్రారెడ్డి ఏడుస్తు నానా రచ్చచేసిన విషయం తెలిసిందే. సబితకు మద్దతుగా హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు కొద్దిరోజులు నానా గోలగోల చేశారు. సీన్ కట్ చేస్తే ఇపుడు అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని తప్పుగా చిత్రీకరించి తనను అసభ్యంగా చిత్రీకరిస్తారా అంటు మంత్రి కొండా సురేఖ భోరున ఏడ్చేశారు. తనపై బీఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యంగా చిత్రీకరించారంటు కొండా మీడియా సమావేశంలోనే భోరుమని ఏడ్చేశారు. దాంతో మరో మంత్ర సీతక్క కూడా రంగంలోకి దిగేశారు. ఆమధ్య తనపైన కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బ్యాడ్ గా చిత్రీకరించారంటు మండిపోయారు. వీళ్ళకు మద్దతుగా సహచర మంత్రులు పొన్నంప్రభాకర్ తదితరులతో పాటు పార్టీ నేతలు రంగంలోకి దిగేశారు.

ఇంతకీ జరిగింది ఏమిటంటే ఆమధ్య అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ ఫిరాయింపులపై మాట్లాడుతు బీఆర్ఎస్ అధినేతను నమ్ముకుంటే అక్కల బతుకు బస్టాంటే అంటు సబితను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నిజానికి రేవంత్ తన ప్రసంగంలో ఎక్కడా సబిత పేరు ప్రస్తావించలేదు. కేవలం అక్కల బతుకు అనిమాత్రమే అన్నారు. కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వారిలో సబితతో పాటు సునీతా లక్ష్మారెడ్డి కూడా అసెంబ్లీలో ఉన్నారు. అయితే రేవంత్ తనను ఉద్దేశించే అవమానిస్తు కామెంట్ చేశాడంటు సబితా నానా ఏడ్పులు ఏడ్చి గోలగోల చేశారు. రేవంత్ కామెంట్లలో అసభ్యత, అవమానం ఏమీలేకపోయినా సరే సబిత మాత్రం ఏడ్పు రాజకీయాలను రెండు మూడురోజులు రక్తి కట్టించారు.

సీన్ కట్ చేస్తే ఇపుడు మంత్రి కొండా సురేఖ ఒకటే ఏడుస్తున్నారు. సిద్ధిపేటలో చేనేత కార్మికుల కోసం ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మంత్రి కొండాసురేఖ తో పాటు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందనరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేతలు నూలుతో చేసిన దండను ఎంపీ మంత్రి మెడలో వేశారు. ఆ ఫొటోతో పాటు దానికి సంబంధించిన వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. వార్తను మీడియాలో వార్తగానే హైలైట్ చేశారు. అయితే మరుసటి రోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మంత్రికి ఎంపీ నూలుదండ వేస్తున్న ఫొటోను పెట్టి కల్యాణ లక్ష్మి & షదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారనే ట్యాగ్ లైనుతో వైరల్ చేశారు. ఇదే విషయాన్ని కొండా తప్పుపడుతు మీడియా సమావేశంలో భోరున ఏడ్చేశారు.



ఎంపీ రఘునందనరావు తనకు సోదర సమానుడని అన్నారు. సోదరి భావంతోనే ఎంపీ తనమెడలో వేసిన నూలుదండను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యంగా చిత్రీకరించిందని మంత్రి భోరుమన్నారు. ఎప్పుడైతే కొండా ఏడుపు మొదలుపెట్టారో వెంటనే మరో మంత్రి దనసరి సీతక్క కూడా రంగంలోకి దిగేశారు. ఒకపుడు తనపైన కూడా బీఆర్ఎస్ అసభ్యంగా చిత్రీకరిస్తు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు మహిళలంటే చాలా చులకనంటు ధ్వజమెత్తారు. కొండాను అవమానిస్తారా అంటు ఆల్రేడీ కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణా భవన్ పై సోమవారం దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో తెలంగాణా భవన్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పాడ్డాయి. ఇపుడు మంత్రులిద్దరికీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మద్దతుగా నిలిచారు. చివరకు ఈ ఏడుపు రాజకీయలు ఎక్కడకు దారితీస్తాయో చూడాలి.

Read More
Next Story