కడపలో క్రాస్ ఓటింగ్ ?
కడపలో షర్మిలకు క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని, ఇది షర్మిల గెలుపు ఓటములపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది స్థానికుల్లో చర్చ.
కడప పార్లమెంట్ నియోజక వర్గంలో ఈ సారి పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ స్థానికుల్లో ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో క్రాస్ ఓటింగ్ జరిగేందుకు అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా కడప పార్లమెంట్ వైఎస్ కుటుంబానికి కంచు కోటగా ఉంది. వైఎస్ కుటుంబ సభ్యులే కడప పార్లమెంట్ నుంచి గెలుస్తూ వస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిలు పలుమార్లు ఎంపీలుగా గెలిచారు. ఇలా 1989 నుంచి నేటి వరకు వైఎస్‌ఆర్ కుంబానిదే ఇక్కడ పై చేయిగా ఉంటూ గెలుస్తూ వస్తున్నారు.
ప్రత్యర్థులుగా మారిన అన్నా, చెల్లెలు
ఈ సారి ఎన్నికల్లో అన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చెల్లెలు వైఎస్ షర్మిల ప్రత్యర్థులుగా మారారు. జగన్ తన సొంత పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బరిలో దింపిన అవినాష్‌ను గెలిపించాలని కోరగా, వైఎస్‌ఆర్ బిడ్డగా
2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా నిల్చున్నానని, తనకు ఓట్లేసి గెలిపించి ఆశీర్వదించాలని ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య, సీఎం జగన్ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లారు.
షర్మిల పక్షానే తల్లి విజయమ్మ
కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుమార్తె షర్మిలను ఆశీర్వదించాలని ఇద్దరికీ తల్లి వైఎస్ విజయమ్మ తన ఆశీస్సులను అందజేశారు. ఈ నేపథ్యంలో ఎవరి పక్షాన కాకుండా ఇద్దరినీ సమానంగా చూశారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లి పోయారు. పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో కుమార్తె షర్మిలకే తన మద్దతు తెలిపారు. వైఎస్‌ఆర్‌పైన చూపించిన ఆదరాభిమానాలు కుమార్తె షర్మిలపై చూపాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి లాగే ప్రజలకు సేవ చేయాలని వచ్చిన షర్మిలను ఆశీర్వదించాలని, అందరూ ఓట్లేసి గెలిపించాలని కడప ప్రజలను కోరుతూ అమెరికా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. తల్లి విజయమ్మ వీడియాతో షర్మిలకు బలాన్ని చేకూర్చినటై్టందని, ఇది షర్మిల పట్ల సానుభూతిగా మారిందనే చర్చ కూడా స్థానికుల్లో ఉంది. అటు వైఎస్‌ఆర్ కుమార్తె కావడం, ఇటు కడప జిల్లాలో వైఎస్‌ఆర్ కుటుంబానికి మంచి ఆదరణ ఉండటం, వైఎస్‌ఆర్ పట్ల కడప ప్రజల్లో అభిమానం ఉండటంతో కడప ప్రజలు షర్మిల వైపు మొగ్గు చూపి ఉంటారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ
కడప పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో షర్మిల ప్రభావం చూపింది. దీంతో అన్నిస్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందనే చర్చ స్థానికుల్లో ఉంది. పులివెందులతో పాటు కడప, బద్వేలు, జమ్మలమడుగు,కమలాపురం,ప్రొద్దుటూరు, మైదుకూరులో కూడా షర్మిలకు క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అది ఏ స్థాయిలో జరిగి ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీల్లో తమకు ఇష్టం వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసుకున్నా ఎంపీ విషయానికి వచ్చే సరికి షర్మిల వైపు మొగ్గు చూపి ఉంటారని అంచనా వేస్తున్నారు. పార్టీలకు అతీతంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అభిమానులు, కార్యకర్తలు కూడా షర్మిల వైపు మొగ్గు చూపి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి బలమైన ప్రత్యర్థిగా ఉంటడంతో క్రాస్ ఓటింగ్ షర్మిల గెలుపు ఓటమలుపై ఎలాంటి ప్రభావం చూపుతోందో అనేది కడప ఓటర్లలో ఆసక్తి కరంగా మారింది.
Next Story