నారా లోకేశ్ కి క్రికెటర్ తిలక్ వర్మ ఇస్తానన్న బహుమతి ఏంటంటే..
x

నారా లోకేశ్ కి క్రికెటర్ తిలక్ వర్మ ఇస్తానన్న బహుమతి ఏంటంటే..

తమ్ముడు తిలక్‌ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైందన్న నారా లోకేశ్


ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు ఆసియా కప్‌ ఫైనల్‌ హీరో, భారత క్రికెటర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma) నుంచి ప్రత్యేక బహుమతి అందనుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తాను ఉపయోగించిన క్యాప్‌ను లోకేశ్‌కు ప్రేమతో ఇస్తున్నట్లు తిలక్‌వర్మ ప్రకటించారు. తిలక్‌ వర్మ సోషల్‌ మీడియాలో ఈమేరకు పోస్ట్‌ చేశారు.
ఆసియా కప్ టోర్నీలో అద్భుత ఆరంభాన్ని ఇచ్చిన అభిషేక్‌ (5) రెండో ఓవర్లోనే నిష్క్రమించడం భారత్‌కు తొలి దెబ్బ. పేలవ షాట్‌ సెలక్షన్‌తో ఇంకొద్దిసేపట్లోనే సూర్య (1), గిల్‌ (12) పెవిలియన్‌ బాట పట్టారు. ఆ దశలో ఆపద్బాంధవుడిలా నిలిచాడు తిలక్‌ వర్మ. ఒత్తిడినంతా తట్టుకుంటూ అతడు ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతం. మెరుపు షాట్లు ఆడిన తిలక్‌.. శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. శాంసన్‌ కాస్త ఇబ్బంది పడ్డా కొన్ని షాట్లు ఆడడంతో 12 ఓవర్లలో 76/3తో భారత్‌ కోలుకుంది. ఈ జోడీ ఇంకొద్దిసేపు నిలిస్తే విజయానికి మార్గం సుగమం అవుతుందనుకున్న దశలో శాంసన్‌ (24) ఓ అనవసర షాట్‌కు యత్నించి ఔట్‌ కావడంతో భారత్‌పై మళ్లీ ఒత్తిడి పెరిగింది.
ఆఖరి ఆరు ఓవర్లలో 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ దశలో తిలక్‌ జోరు పెంచాడు. రవూఫ్‌ ఓవర్లో ఫోర్, సిక్స్‌ బాదాడు. దూబె కూడా షాట్లకు దిగడంతో భారత్‌ 17 ఓవర్లలో 117/4తో నిలిచింది. ఆఖరి 13 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉత్కంఠ తీవ్రమైంది. రవూఫ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో భారత్‌పై ఒత్తిడి తగ్గించాడు దూబె. అయితే 19వ ఓవర్లో 7 పరుగులే రావడం, ఆఖరి బంతికి దూబె ఔట్‌ కావడంతో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. గెలవాలంటే ఆఖరి ఓవర్లో భారత్‌ 10 పరుగులు చేయాల్సిన స్థితి. మళ్లీ తిలకే బాధ్యత తీసుకున్నాడు. ఒత్తిడి తినేస్తుండగా, ఉత్కంఠ ఊపేస్తుండగా.. తొలి బంతికి 2 పరుగులు తీసిన అతడు రెండో బంతికి స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ కొట్టి భారత శిబిరంలో సంతోషాన్ని నింపాడు. తర్వాతి బంతికి అతడు సింగిల్‌ తీయగా.. రింకు ఫోర్‌తో టార్గెట్ పూర్తి చేసి విజయాన్ని పూర్తి చేశారు.
ఈ తిలక్ వర్మ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి మంచి మిత్రుడు. పాకిస్తాన్ పై విజయం తర్వాత తిలక్‌ వర్మ ప్రకటించిన బహుమతికి మంత్రి లోకేశ్‌ ముగ్ధుడయ్యారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘తమ్ముడు తిలక్‌ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైంది. స్వదేశానికి వచ్చాక అతడి చేతుల మీదుగానే క్యాప్‌ తీసుకుంటా’’అని పేర్కొన్నారు. క్యాప్‌పై తిలక్‌ వర్మ సంతకం చేస్తున్న వీడియోను ఈ సందర్భంగా లోకేశ్‌ షేర్‌ చేశారు.
Read More
Next Story