సిపిఎస్... ఏమిటి మళ్ళీ  లొల్లి!
x

సిపిఎస్... ఏమిటి మళ్ళీ లొల్లి!

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఈ నెల 12 నాటికి సరిగ్గా నెల రోజులైంది. సిపిఎస్ రద్దు హామీలపై ప్రభుత్వం ఏమి చేసింది.


సిపిఎస్ రద్దు అంశం రాష్ట్ర ఉద్యోగుల్లో ఉత్కంఠకు మళ్లీ తెరలేపింది. కూటమి అధికారంలోకి రాగానే సిపిఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీంను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగా ఎన్నికలకు ముందు చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సిపిఎస్ పై అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై సిపిఎస్ ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులూ వారికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా? అని వేచిచూస్తున్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు అటుంచితే ఈ నెల 12న గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జిపిఎస్‌)పై ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించడాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సీపీఎస్ పై ఏపీ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెెఎస్ఎస్ ప్రసాద్ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం సీఫీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇవ్వలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించగా సీపీఎస్ రద్దుపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆలోచించి ఒక విధానం ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే సీపీఎస్ ను రద్దు చేయాలని తాము కోరుతున్నామని, ఆందోళన ఏరూపంలో చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఒపిఎస్‌) అమలు కోసం ఎంతగా కొట్లాడారో మనం చూశాం. తాము అధికారంలోకి వస్తే సిపిఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. ఒపిఎస్‌పై అవగాహన లేక హామీ ఇచ్చామని, అంతకంటే మెరుగైన పెన్షన్‌ విధానం తీసుకొస్తామంటూ అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. ఆ తర్వాత దానిపై వైయస్సార్సీపి ప్రభుత్వం రకరకాల కమిటీలు వేసి కొంతకాలం కాలయాపన చేసింది.
చివరకు సిపిఎస్‌ స్థానంలో ఉద్యోగులకు జిపిఎస్‌ను తీసుకొచ్చింది. దానిపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలకూ ప్రయత్నించింది. ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటంతో ప్రభుత్వం రిస్క్‌ తీసుకోవడానికి సాహించలేదు. దీనిపై ఉద్యోగులు ఓటు ఫర్‌ ఒపిఎస్‌ అనే నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.
పోరాటాల ఫలితంగా తాత్కాలికంగా గత ప్రభుత్వం జిఒను విడుదల చేయకుండా వెనక్కు తగ్గింది. సిపిఎస్‌ రద్దుకు హామీ ఇచ్చి మోసగించిన వైయస్సార్సీపి ఎన్నికల్లో భారీ మూల్యమే చెల్లించుకుంది. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి దీనిపై మాట్లాడకపోయినా కూటమి తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిపిఎస్‌ రద్దు, వైయస్సార్సీపి తీసుకొచ్చిన జిపిఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించి, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే పెన్షన్‌ విధానం అమలు చేస్తామని మాటిచ్చారు.
సీపీఎస్ ను రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో చాలా వరకు ఓల్డ్ పెన్షన్ పథకం అమలు జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వంలో మాత్రం సీపీఎస్ మాత్రమే అమలు జరుగుతోంది. త్రిపురలో కూడా సీపీఎస్ నే బీజేపీ వారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలి. చంద్రమబాబు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఆదేశాలు మావి కావని కూటమి ప్రభుత్వం చెబితే నమ్మే అంత అమాయకులు ఉద్యోగులు కాదనే విషయాన్ని గుర్తించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పూర్వపు అధ్యక్షులు సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులకు శాశ్వత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పెద్దలు ఇప్పుడు ఏ చర్చా లేకుండానే జిపిఎస్‌పై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ఉద్యోగులను షాక్‌కు గురిచేసింది. పైగా ఏమీ ఎరగనట్టు అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ జూన్‌ 12న జిఒ నంబరు 54ను విడుదల చేశారని, గత ప్రభుత్వం రూపొందించిన నోటిఫికేషన్‌నే గెజిట్‌లో అప్‌లోడ్‌ చేశామంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నమ్మబలుకుతోంది. జూన్‌ 12న జీఒ జారీ అయ్యిందంటే కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతే జరిగిందన్న మాట. కూటమి ప్రభుత్వం వస్తుందన్న గట్టి నమ్మకంతో ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఈ ఫైల్ పై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాసి నిలుపుదల చేయించారు.
గత ప్రభుత్వం ట్రైనీ ఐఎఎస్‌లకు ప్లేస్‌మెంట్‌లు కేటాయిస్తున్నారనీ, ఒక పోస్టుకు ఐఏఎస్ ప్రమోషన్ ఇస్తున్నారన్న సమాచారంతో కేంద్రానికి సైతం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫైల్స్ మాయం కాకుండా గనులశాఖ, సిఐడి కార్యాలయాలను సీజ్‌ చేయించారు. గత ప్రభుత్వ పాపాలపై ముందుస్తు చర్యలు తీసుకున్న చంద్రబాబు జిపిఎస్‌ జీఒను ఎందుకు ఆపలేకపోయాన్న చర్చ ఉద్యోగుల్లో సాగుతోంది. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే జీపిఎస్‌ను తీసుకొచ్చి ఆ నెపాన్ని వైయస్సార్సీపి ఖాతాల్లో వేయాలని చూస్తున్నట్లుగా ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓపిఎస్‌తో పాటు ఇతర సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశలు పెట్టుకున్న ఉద్యోగులను ఆదిలోనే వంచించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతకు తానే బీజం వేసుకున్నట్లైందని ఉద్యోగ సంఘాల వారు అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అన్నీ ఒకేసారి చేయలేదని, హామీల అమలుకు కొంత సమయం కావాలని చెప్తున్న టిడిపి పెద్దలు కేసులు, కక్ష సాధింపులకు పాల్పడే విషయంలో చాలా వేగంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందనే విమర్శ ఉంది. వైఎస్ఆర్సిపి చేసిన తప్పులే మనమూ చేస్తే వారికీ మనకూ తేడా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ పెద్దలతో చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్లు నిజం అని చెప్పాల్సి రావడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గంలో చర్చ జరుగుతోంది. అభివృద్ధిని వదిలేసి నియంతృత్వం, తీవ్ర నిర్బంధం, కేసులతో ప్రతికార చర్యలకు పాల్పడటం వల్లే వైఎస్ఆర్ సీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కని దుస్థితి వచ్చింది. దీనిని గుణపాఠంగా తీసుకొని అభివృద్ధి వైపుగా టిడిపి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనే ఆశ మాత్రం ఉద్యోగులు ఇతర వర్గాల్లో ఇంకా చావలేదు.
Read More
Next Story