
CPM leader V.Srinivas
డెప్యూటీ స్పీకర్ రఘురామను ఉతికి ఆరేసిన సీపీఎం నేత శ్రీనివాసరావు
నువ్వసలు మనిషివేనా? పేదల కొంపలు కూల్చి నువ్వు మేడలు మిద్దెల్లో ఉంటావా? అంటూ CPM నేత వి.శ్రీనివాసరావు డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజుపై మండిపడ్డారు
"నువ్వసలు మనిషివేనా? పేదల కొంపలు కూల్చి నువ్వు మేడలు మిద్దెల్లో ఉంటావా? నిరుపేదల ఇళ్లు కూల్చడానికి నీకేమీ సిగ్గనిపించలేదా?" అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజుపై మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రోత్సహించిన స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అరాచకాలను నియంత్రించాలని డిమాండు చేశారు. బుధవారం విజయవాడ బాలోత్సవ భవన్లో మీడియాతో మాట్లాడుతూ డెప్యూటీ స్పీకర్ రఘురామపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆయన ఏమన్నారంటే...
"అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లపట్టాలిస్తామని వాగ్దానం చేసిన టిడిపి నాయకులు ఇప్పుడు అన్యాయంగా ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రోద్బలంతో 800 కుటుంబాలను రోడ్డుపాలు చేశారు. మరో 600 ఇళ్లను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. బ్రిటీష్ కాలం నాటి 1905 చట్టం ప్రకారం కూల్చివేతల నోటీసులు ఇచ్చారు.

అన్ని చట్టాలనూ మారుస్తున్న ప్రభుత్వం పేదల ఇళ్ల కూల్చివేతలకు వచ్చేప్పటికి పాత చట్టాలను అమలు చేయడం అన్యాయం. పాలకోడేరులో అల్లూరి సీతారామారాజు పేరు పెట్టుకున్న కాలనీని లేకుండా చేశారని, గతంలో బ్రిటీష్‌వాళ్లు అల్లూరి సీతారామారాజును దారుణంగా కాల్చిచంపితే ఆయన పేరుతో ఉన్న కాలనీని కూల్చివేయడం ద్వారా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మరోసారి అల్లూరిని హత్య చేశారు. పేదలు ఇళ్లు కూల్చిన వెనుక భాగంలో 15 ఎకరాలు భూస్వాములు అక్రమంగా సాగు చేసుకుంటున్నా వాళ్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. వారికి కూడా నోటీసులు ఇచ్చి భూములు స్వాధీనం చేసుకొని స్థానిక పేదలకు పంచాలి. పేదల ఇళ్లపక్కన కాల్వగట్లపై ఉన్న కొబ్బరి చెట్లనూ పెత్తందారులే అనుభవిస్తున్నారు" అని అన్నారు.
కాలుష్యం అని చెబుతున్నారని, ఇళ్లలో వ్యర్థాలతో కాలుష్యం కంటే అక్కడ రొయ్యల పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యమే అధికమని Mdj తెలిపారు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. పేదలు తమ గోడు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఇంటికి వెళితే చీత్కరించి పంపించేశారని, డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణంరాజు అనర్హుడని అన్నారు. రాక్షస పాలను చేస్తున్న ఆయన అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, గతంలో బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన కేసులు అనేకం ఉన్నాయని, సిబిఐ కూడా విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. రాఘురామ అక్రమాలు, అన్యాయాలపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు కోర్టు స్టేలో ఉన్న ఇళ్లనూ కూల్చివేశారని, ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తి కూడా ఇలాంటి ఇళ్ల కూల్చివేతలపై తీవ్రంగా స్పందించిన విషయాన్ని శ్రీనివాసరావు గుర్తుచేశారు. ఎమ్మెల్యే చెప్పాడని ఇళ్లు కూల్చిన అధికారులు తరువాత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఆర్‌ఆర్‌ఆర్ ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. గతంలో విధ్వంసపాలనపై పోరాడతానని చెప్పిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు రావణాసురిడిగా విధ్వంసాలు చేస్తుంటే చూస్తు ఊరుకోవడం సరికాదని అన్నారు. అడవిలో మృగం మాదిరి ఆయన ప్రజలను వేటాడుతున్నానడని, దీనిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. మరీ ముఖ్యంగా ఇళ్ల కూల్చివేతల సమయంలో మగ పోలీసులు ఆడవారిపై దౌర్జన్యం చేశారని, ఓ మహిళను గోడకేసి కొట్టడంతో తలపగిలి తీవ్ర గాయాలపాలైందని అన్నారు. చనిపోయిన మహిళకు నోటీసులిచ్చి ప్రభుత్వ అమానుషత్వాన్ని చాటుకున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి పేదలకు న్యాయం చేయాలని, కూల్చివేసిన చోటే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండు చేశారు. ఇదే పద్దతిలో వ్యవహరిస్తే పేదలను కూడగట్టి పెద్దఎత్తున పోరాటం చేస్తామని ఇది రాష్ట్రవ్యాపిత రూపం తీసుకుంటుందని హెచ్చరించారు.
Next Story