
అశోక్ ధవాలే వర్సెస్ ఎంఏ బేబీ
రైతు నేత అశోక్ థవాలేకి సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి?
సీపీఎం 24వ జాతీయ మహాసభ కీలక ఘట్టానికి చేరుకుంది. ఇప్పుడు అందరి దృష్టి పార్టీ కొత్త కార్యదర్శి ఎవరనే దానిపైకి మళ్లింది.
ఆవేళ విశాఖ.. ఈవేళ మధురై.. ఈ రెండు చోట్లా జరిగిన సీపీఎం జాతీయ మహాసభలకు ఓ ప్రత్యేకత మరో సారూప్యత ఉంది. బహుశా ఇవి చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు కావొచ్చు. ఈ రెండు మహాసభల మధ్య 9 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆవేళ అందర్నీ ఆకర్షించిన అంశం ప్రకాశ్ కారత్ వారసునిగా సీతారాం ఏచూరి అవుతారా లేదా అనేది. ఈసారి కూడా అలాంటి ఉత్కంఠే నెలకొంది.
2015 ఏప్రిల్ 19 న ఏచూరి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)- సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2024లో ఆయన మరణించే వరకు ఈ పదవిలో కొనసాగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ చనిపోయిన వారిలో సీతారామ్ ఏచూరి ఒకరు. ఆయన నాయకత్వంలో పార్టీ ఆచరణాత్మకవాదం, పిడివాదం మధ్య అంతరాన్ని అధిగమించింది. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన సైద్ధాంతిక మూలాలను కొనసాగించింది.
2025లోనూ నాయకత్వ ఎంపికే సమస్య అయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరవుతారు? ఎవర్ని ఎంచుకోవాలనే మీమాంస వచ్చింది. కేరళలో జరిగిన 23 జాతీయ మహాసభల్లో భారత జాతీయ కాంగ్రెస్‌పై పార్టీ వైఖరి ప్రధాన చర్చనీయాంశం కాగా ఈసారి మొత్తం దృష్టి అంతా కొత్త కార్యదర్శి ఎంపికపై నిలిచింది.
సీపీఎం 24వ జాతీయ మహాసభ కీలక ఘట్టానికి చేరుకుంది. తమిళనాడులోని మధురైలో ఏప్రిల్ 2న ప్రారంభమైన మహాసభలు నాలుగో రోజుకు చేరాయి. పార్టీ రాజకీయ తీర్మానం ముసాయిదాతో పాటు పార్టీ కార్యకలాపాల, సంస్థాగత నివేదికపై మూడు రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇక జరగాల్సింది నూతన నాయకత్వ ఎంపికే.
ఇంతటి ఆసక్తికి కారణం లేకపోలేదు. పార్టీ పాలిట్ బ్యూరోలోని 17మందిలో ఇద్దరు చనిపోయారు. 75 ఏళ్ల వయసు దాటిన వాళ్లు పార్టీ నాయకత్వం నుంచి తప్పుకోవాలన్న నిబంధనతో మరో ఏడుగురు సీనియర్లు పాలిట్ బ్యూరో నుంచి రిలీవ్ అవుతారు. ఇక మిగిలిన సీనియర్లలో ఒకరైన బీవీ రాఘవులు అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక మిగిలిన వారిలో సీనియర్ కేరళకు చెందిన ఎం.ఏ. బేబి. ఆయన్ను ఉత్తరాది రాష్ట్రాల పార్టీ నేతలు సమర్థించడం లేదు. పైగా కేరళ పార్టీ శాఖ కూడా ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహారాష్ట్రకు చెందిన అశోక్ థవాలే పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు హిందీ మాట్లాడే రాష్ట్రాల ప్రతినిధుల మద్దతు పెరుగుతోంది. దీన్ని బట్టి ప్రధాన పోటీ ఎంఏ బేబీ, అశోక్ థవాలే మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
పార్టీ మహాసభల ఆఖరి రోజైన ఏప్రిల్ 6న ప్రతినిధులు పార్టీ కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు. ఈ కమిటీ పాలిట్ బ్యూరో సభ్యుల్ని, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది. ఆయా రాష్ట్రాలలో పార్టీ పని తీరు ప్రాతిపదికన పాలిట్ బ్యూరో సభ్యుల ఎన్నిక లేదా ఎంపిక ఉంటుంది.
ఎంఏ బేబీ వర్సెస్ థవాలే...
ప్రస్తుతం పాలిట్ బ్యూరోలోని సీనియారిటీ ప్రకారం ఎంఏ బేబీ ప్రధాన కార్యదర్శి కావాల్సి ఉన్నా ఆయన పట్ల ఎక్కువ మంది సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నాయకుడు, పూనే నుంచి ముంబాయి వరకు రైతులతో పాదయాత్ర నిర్వహించిన నేతగా పేరున్న అశోక్ థవాలే కి ఈసారి ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి ఎన్నికైన నాయకుడు మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు. 60 ఏళ్లలో ఐదుగురే ప్రధాన కార్యదర్శులు కాగలిగారు. ఈసారి థవాలే ఎన్నికైతే ఎంఏ బేబీకి ఇక అవకాశం లేనట్టే.
ప్రకాశ్ కారత్ మద్దతు ఎవరికి?
ఎంఏ బేబీకి మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కారత్ మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. బేబీ పట్ల కేరళ పార్టీ శాఖ పూర్తిగా అంగీకారం లేకున్నా థవాలేను వ్యతిరేకించడంలో మాత్రం ఏకతాటిపై ఉన్నట్టు సమాచారం.
పార్టీలో పట్టున్న మరో రాష్ట్రం- బెంగాల్ యూనిట్ మాత్రం థవాలేను సమర్థిస్తున్నట్టు మహాసభలకు హాజరైన ఓ పార్టీ నేత సూచనప్రాయంగా చెప్పారు. ఏఐకేఎస్ అధ్యక్షునిగా ధవాలే చేసిన కృషిని బెంగాల్ యూనిట్ గట్టిగా సమర్థిస్తోంది. ఆయన్ను భావి నేతగా చేయాలని డిమాండ్ చేస్తోంది.
పాలిట్ బ్యూరోలో నూతన నాయకత్వంపై తొలివిడత చర్చ ప్రారంభమైనప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. ఏది ఏమైనా పార్టీ వయోపరిమితి నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వకూడదనే నిర్ణయానికే పాలిట్ బ్యూరో కట్టుబడి ఉంది. ఫలితంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా వయసు మీరిన వారందరూ తప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఏదైనా మినహాయింపు ఇవ్వాల్సివస్తే సీఎం హోదా ఉన్నందున విజయన్ కి ఇస్తారని భావన.
ప్రకాశ్ కారత్, బృందా కారత్, మాణిక్ సర్కార్, సుభాషిణీ ఆలీ, జి.రామకృష్ణన్, సూర్యకాంత్ మిశ్రా పాలిట్ బ్యూరో నుంచి రిటైర్ అవుతారు.
ధవాలేకి పెరుగుతున్న మద్దతు..
హిందీ ప్రాంతానికి చెందిన కిసాన్ నాయకుడు అశోక్ ధవాలేకు మద్దతు పెరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నేతలు మాత్రం బేబిని ఎంపిక చేస్తే మొత్తం పార్టీ కేరళకే పరిమితమైపోయే అవకాశం ఉందన్న అభిప్రాయంతో ఉన్నారు. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వాలన్నారు. సీతారాం ఏచూరి తర్వాత అంతటి జాతీయ స్థాయి నాయకుడు ఇప్పుడు ఎవరూ లేరని, కిసాన్ ర్యాలీతో మరిన్ని రాష్ట్రాలలో గుర్తింపు ఉన్న వ్యక్తి అశోక్ ధవాలే మాత్రమేనని చెబుతున్నారు. ఆయా రంగాలలో ప్రతి నాయకుడికీ ఎంతో కొంత ప్రతిభ ఉంటుందని, ఆయన ఎంత మంది ప్రజలకు తెలుసన్నదే అసలు సిసలు ప్రశ్నని ఆ నాయకుడు అన్నారు. కిసాన్ లాంగ్ మార్చ్ తర్వాత ధవాలేకు జాతీయ గుర్తింపు వచ్చిందని కూడా గుర్తు చేశారు.
ఇంకోపక్క, బృందా కారత్ కి మినహాయింపు ఇచ్చి కొత్త కార్యదర్శిగా నియమించాలని కొందరు సూచించినా ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. దీనిపై ఓ పార్టీ నాయకుడు స్పందిస్తూ “ఇప్పటివరకు ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోలేదు. రాఘవులు, బేబి ఇద్దరూ పాలిట్ బ్యూరోలో సీనియర్లే. వయసు కూడా దాదాపు ఒకటే. వారి పని తీరు, వారున్న ప్రాంతాల్లో పార్టీ బలాన్ని ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. చర్చ జరుగుతోంది” అన్నారు.
ఎంఏ బేబీ ప్రధాన కార్యదర్శి కావాలంటే కచ్చితంగా కేరళ పార్టీ శాఖ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైన్నే ఆధారపడి ఉంటుంది. కేరళ నేతలు చాలా మంది ఎంఏ బేబి రావాలని కోరుకుంటున్నా అది అంత సాధ్యమయ్యేలా లేదు. ప్రధాన కార్యదర్శిగా ఆయన్ని నియమిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న INDIA బ్లాక్‌తో డీల్ చేయడం కష్టం కావొచ్చునని భావిస్తున్నారు.
Next Story