
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ, అశోక్ ధావలేకి నిరాశ
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నిక అయ్యారు. AIKS అధ్యక్షుడు అశోక్ ధవాలే కి నిరాశే మిగిలినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి పాలిట్ బ్యూరోలో సీనియర్లుగా ఉన్న ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన బీవీరాఘవులు కాగా మరొకరు ఎంఏ బేబీ. రాఘవులు అనారోగ్య కారణాలతో వెనక్కితగ్గడంతో బేబీ పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్ శాఖ అశోక్ ధవలే పేరును ప్రతిపాదించడంతో రెండు రోజులుగా పార్టీ పాలిట్ బ్యూరో తర్జన భర్జన పడి చివరకు ఎంఏ బేబీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఎంఏ బేబీ వైపే మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కూడా మొగ్గు చూపారు. ఇఎంఎస్ నంబూద్రిపాద్ తర్వాత పార్టీకి ప్రధాన కార్యదర్శి అయిన రెండో మళయాళీ ఎంఏ బేబీ. ఈయన ఇంకో ప్రత్యేకత ఏమిటంటే సీతారాం ఏచూరి తర్వాత ఎస్.ఎఫ్.ఐ. బాధ్యతలు ఈయన చేపట్టారు. ఇప్పుడు సీతారాం ఏచూరి వారసునిగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీని ఈయనే చేపట్టడం.
1954లో కేరళలోని ప్రాక్కుళంలో పి.ఎం. అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు జన్మించిన బేబీ పాఠశాల రోజుల్లోనే భారత విద్యార్థి సమాఖ్యకు (ఎస్ఎఫ్ఐ)కి నాయకత్వం వహించారు. కేరళ విద్యార్థి సమాఖ్యలో చేస్తూనే సీపీఎంలో పార్టీ పూర్తికాలపు కార్యకర్తగా చేరారు. 1986 నుండి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2012 నుండి సీపీఐ(ఎం) అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిట్‌బ్యూరోలో బేబీ సభ్యుడిగా ఉన్నారు.
గత సంవత్సరం సీతారాం ఏచూరి మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. ప్రకాష్ కారత్ తాత్కాలిక సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు.
ఏప్రిల్ 6 ఆదివారంతో ముగియనున్న సిపిఎం 24వ అఖిల భారత మహాసభల్లో పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాబోయే మూడేళ్ల కాలానికి ఈ నాయకత్వం పార్టీకి దిశా, నిర్దేశం చేస్తుంది.
దేశ వ్యాప్తంగా సెలెక్ట్ చేసిన 819 మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరయ్యారు.
ఆవేళ విశాఖ.. ఈవేళ మధురై.. ఈ రెండు చోట్లా జరిగిన సీపీఎం జాతీయ మహాసభలకు ఓ ప్రత్యేకత మరో సారూప్యత ఉంది. బహుశా ఇవి చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు కావొచ్చు. ఈ రెండు మహాసభల మధ్య 9 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆవేళ అందర్నీ ఆకర్షించిన అంశం ప్రకాశ్ కారత్ వారసునిగా సీతారాం ఏచూరి అవుతారా లేదా అనేది. ఈసారి కూడా అలాంటి ఉత్కంఠే నెలకొంది. ఇప్పుడా ఉత్కంఠకు తెరపడింది.
2015 ఏప్రిల్ 19 న ఏచూరి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)- సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2024లో ఆయన మరణించే వరకు ఈ పదవిలో కొనసాగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ చనిపోయిన వారిలో సీతారామ్ ఏచూరి ఒకరు. ఆయన నాయకత్వంలో పార్టీ ఆచరణాత్మకవాదం, పిడివాదం మధ్య అంతరాన్ని అధిగమించింది. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన సైద్ధాంతిక మూలాలను కొనసాగించింది.
2025లోనూ నాయకత్వ ఎంపికే సమస్య అయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరవుతారు? ఎవర్ని ఎంచుకోవాలనే మీమాంస వచ్చింది. కేరళలో జరిగిన 23 జాతీయ మహాసభల్లో భారత జాతీయ కాంగ్రెస్‌పై పార్టీ వైఖరి ప్రధాన చర్చనీయాంశం కాగా ఈసారి మొత్తం దృష్టి అంతా కొత్త కార్యదర్శి ఎంపికపై నిలిచింది.
ఈ మహాసభల్లో 85 మందితో కేంద్ర కమిటీ, 18 మందితో పాలిట్ బ్యూరో ఎన్నికైంది. 85 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 84 మందిని ఎన్నుకున్నారు. ఓ సీటును ఖాళీగా ఉంచారు. సెంట్రల్ కమిటీలోకి 17 మంది కొత్తవారిని తీసుకున్నారు. 17మంది మహిళలు కూడా ఉన్నారు. ఇక 18 మంది పాలిట్ బ్యూరో సభ్యుల్లో 8 మంది కొత్తవారు కాగా ఇద్దరు మహిళలు ఉన్నారు.
75 ఏళ్ల వయసు దాటిన వాళ్లు పార్టీ నాయకత్వం నుంచి తప్పుకోవాలన్న నిబంధనతో ప్రకాశ్ కారత్, బృందా కారత్, మాణిక్ సర్కార్, సుభాషిణీ ఆలీ సహా ఏడుగురు తప్పుకున్నారు. కేరళ సీఎంగా ఉన్న పినరయి విజయన్ వయసు మీరినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న దృష్ట్యా మినహాయింపు ఇచ్చారు. గతంలో జ్యోతిబసు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇలాగే మినహాయింపు ఇచ్చారు.
కేంద్ర కమిటీలో తెలుగు వారు...
బీవీ రాఘవులు (ఢిల్లీ కేంద్రం), వి.శ్రీనివాసరావు, డి.రమాదేవి (ఆంధ్ర), తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, ఎస్.వీరయ్య (తెలంగాణ) కె.హేమలత (సీఐటీయూ), అరుణ్ కుమార్ (ఢిల్లీ సెంటర్)తో మరొకరు కేంద్ర కమిటీలో ఉన్నారు. వీరిలో బీవీ రాఘవులు పాలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు.
పాలిట్ బ్యూరో సభ్యులు వీరే..
18 మంది పాలిట్ బ్యూరో సభ్యుల్లో పినరయి విజయన్, బీవీ రాఘవులు, ఎంఏ బేబీ, తపన్ సేన్, నిలోత్పల్ బసు, ఎండీ సలీం, ఏ.విజయ రాఘవన్, అశోక్ ధవాలే, రామచంద్ర డోమ్, ఎం.వి.గోవిందన్ మాస్టర్ పాత వాళ్లు కాగా కొత్తగా వచ్చిన వారిలో అమర రామ్, విజూ కృష్ణన్, మరియం థవాలే, వి.వాసుకీ, కె.బాలకృష్ణన్, జితేంద్ర చౌధురీ, అరుణ్ కుమార్ ఉన్నారు.