CPM  BV Raghavulu
x

చంద్రబాబూ, మరో గిరిజన జిల్లా ఏర్పాటు హామీ ఏమైందీ?

చింతూరు, రంపచోడవరం, పోలవరం డివిజన్లతో జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది తరమేనని ప్రశ్నించిన సీపీఎం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చింతూరు, రంపచోడవరం, పోలవరం రెవెన్యూ డివిజన్‌లను కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్‌ చేసింది. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కమిటీ మంగళవారం తీర్మానం చేసింది.
సీపీఎం డిమాండ్ ఏమిటంటే..
"జిల్లాలు, మండలాల సరిహద్దుల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొత్తగా రెండు కొత్త జిల్లాలను (మదనపల్లె, మార్కాపురం) ప్రతిపాదించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చింతూరు, రంపచోడవరం, పోలవరం ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దాని గురించి స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు, రంపచోడవరం డివిజన్లు తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనుకోవడం సరైంది కాదు. ఈ మూడు డివిజన్‌లు ఆదివాసీ మెజారిటీ ప్రాంతమే కాదు పోలవరం మునక ప్రాంతం కూడా. దీర్ఘకాలం కొనసాగే ప్రత్యేక సమస్యలున్నాయి. చింతూరు, రంపచోడవరం ఈ రెండు రెవెన్యూ డివిజన్‌లతోపాటు, పోలవరం నియోజకవర్గాన్ని కూడా కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది అక్కడ ప్రజల వాంఛ" అని సీపీఎం పేర్కొంది. గతంలో కూడా సీపీఎం ఈ డిమాండ్ చేసింది.
తర్లువాడపై స్పష్టత ఇవ్వండి...
విశాఖపట్నం సమీపంలోని తర్లువాడలో పెడుతున్న గూగల్‌ డేటా సెంటర్‌ వివరాలను బయట పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘ఈ డేటా సెంటరుకు భారీ స్థాయిలో విద్యుత్తు, నీరు అవసరం. వాటిని ఎక్కడ నుంచి తీసుకొస్తారో చెప్పాలి. రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటరు కోసం 49 మంది దళిత రైతుల నుంచి 100 ఎకరాల డి.ఫారం పట్టా భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా భూమిని ఎందుకు ఇవ్వరు? దీనిపై సామాజిక పర్యావరణ అధ్యయన నివేదికను కూడా బయటపెట్టలేదు. అసలు పర్యావరణ ప్రభావం అంచనా వేశారా? లేదా? చెప్పాలి. డేటా సెంటరు వల్ల లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కానీ స్థానికులకు ఉపాధి కల్పించడం లేదు. సీఎం ప్రకటించిన సంజీవని పథకానికి సంబంధించిన విషయాలను కూడా ప్రభుత్వం దాస్తోంది. సంజీవని ద్వారా ఆరోగ్య సేవలంటే వాటిని ప్రైవేటుపరం చేయడమే. నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయడం అప్రజాస్వామికం. కార్మికుల హక్కులను కాలరాచే ఈ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈనెల 26న కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుంది. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో గిరిజన ప్రజానీకంపై యుద్ధం చేస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కాల్చి చంపుతున్నారు. ఏపీ ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీ క్రూరత్వానికి ప్రతినిధిగా నిలుస్తోంది’ అని రాఘవులు విమర్శించారు.
Read More
Next Story